ఉరితీసిన నేరస్తుల మృతదేహాలను తరలిస్తున్న అంబులెన్సులు
సిలకేప్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎనిమిది మందిని ఇండోనేషియా ప్రభుత్వం ఈ తెల్లవారుజామున ఉరితీసింది. వారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నారు. పలు దేశాలు ఈ చర్యను ఖండించాయి. అయితే ఇండోనేషియా అటార్నీజనరల్ ఈ చర్యను సమర్ధించుకున్నారు. తమ దేశం మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించిందని, అందులో భాగంగానే మాదకద్రవ్యల కేసులలో నేరస్తులైన ఏడుగురు విదేశీయులతోపాటు ఒక స్వదేశీయుడిని ఉరితీసినట్లు ఇండోనేషియా అటార్నీజనరల్ చెప్పారు. మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కొంటున్న తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలోనే ఈ శిక్షలు అమలు చేసినట్లు ఆయన సమర్ధించుకున్నారు.
నేరస్తుల కుటుంబ సభ్యులు, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరిని, ఆఫికాకు చెందిన నలుగురిని, బ్రెజిల్, ఇండోనేషియాలకు చెందిన ఒక్కొక్కరిని మొత్తం ఎనిమిది మందిని ఉరి తీశారు. తమ పౌరులకు మరణశిక్ష విధించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండోనేషియాపై మండిపడింది. ఇండోనేషియాలోని తమ రాయబారిని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కు పిలిపించింది. ఫ్రాన్స్ కూడా ఉరితీతను ఖండించింది.