ప్రసంగిస్తున్న జస్టిస్ చంద్రకుమార్. చిత్రంలో వరవరరావు తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: ఉరిశిక్షలు వద్దన్నందుకు.. భావ ప్రకటనా స్వేచ్ఛ కావాలన్నందుకు... హింసను ఖండించినందుకు... మతోన్మాదాన్ని ప్రశ్నించినందుకు దేశంలో రాజద్రోహ నేరం మోపుతున్నారని జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజద్రోహ నేరం కింద ఎవరినైనా అరెస్టు చేయాలంటే ముందుగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుంటున్న వారిని చేయాలన్నారు. ‘రాజకీయ ఖైదీల హక్కుల దినం’ సందర్భంగా కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్’ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. బ్రిటిష్ వారు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తెచ్చిన చట్టాలను ఈనాడు మన దేశ ప్రజలపైనే ప్రయోగించడం అన్యాయమన్నారు. సీఆర్‌పీపీ కార్యదర్శి బల్ల రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.వై.రత్నం మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛకు, మేథో వికాసానికీ పునాదిగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు మతోన్మాద శక్తుల చేతిలో బందీలుగా మారాయన్నారు. ఫాసిస్టు శక్తులు విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించి అధ్యాపకులు, విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాలిని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న హింస బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేసేందుకు ఎన్‌కౌంటర్ల పేరుతో‡కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. గ్రీన్‌హంట్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నదంతా ఇదేనని అన్నారు. విరసం నాయకులు వరవరరావు మాట్లాడుతూ రాజకీయ ఖైదీల హక్కుల కోసం జైళ్లలోనూ.. బయట జరుగుతున్న ఉద్యమాలను పాలకులు ఎంతోకాలం అణచలేరని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మౌలానా నసీరుద్దీన్, సిఎల్‌సి నారాయణ, చైతన్య మహిళా సంఘం సావిత్రి తదితరులు మాట్లాడారు.