శరణార్థుల పయనం ఎటువైపు..?
ప్రపంచ దేశాలలో ముఖ్యమైన సమస్యల్లో వలస ఒకటని చెప్పవచ్చు. కొన్ని దేశాల వారు బతుకుదెరువు కోసం వలస వెళతారు. మరికొన్ని దేశాల ప్రజలు రక్షణ కరువైందని శరణార్థులుగా మారతారు. ఏది ఏమైతేనేం.. పొరుగు గడ్డకు పరుగులు తీయడం మాత్రం తప్పనిసరిగా మారింది. అయితే పొరుగు దేశాల ప్రజలు తమ దేశంలో ప్రవేశిస్తే తమ ఉద్యోగ, పని అవకాశాలు దెబ్బతింటాయని చాలా దేశాల అధినేతలతో సహా ప్రజలు భావిస్తుంటారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ శరణార్థులపై ఓ సర్వే నిర్వహించింది.
శరణార్థులుగా వచ్చిన వారు ఉద్యోగాలు తెచ్చుకుని వలస దేశాలలో జీవనం కొనసాగించడం, వారి స్థితిగతులు మెరుగుపడుతున్నాయా అనే ఇతర ముఖ్యమైన అంశాలపై ఈ సర్వేలో కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయి. శరణుకోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్న దేశాలలో 85 పాయింట్లతో చైనా అగ్రస్థానం ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ(2), యూకే(3), కెనడా(4), ఆస్ట్రేలియా(5), స్పెయిన్(6), గ్రీస్(7), జోర్డాన్(8), అమెరికా(9), చిలీ(10) ఉండగా.. భారత్ 12వ స్థానంలో నిలిచింది. ప్రతి వంద మందిలో 80పైగా వ్యక్తులకు ఆశ్రయమిస్తున్న దేశాలు కేవలం మూడు మాత్రమే ఉండటం గమనార్హం.