12 నెలల్లో 175 మందికి ఉరి
దుబాయి : గడిచిన 12 నెలల్లో దాదాపు 175 మందికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరి శిక్ష వేసింది. ఈ మేరకు ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ మంగళవారం వెల్లడించింది. అందుకు సంబంధించి కిల్లింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జస్టిస్ : ద డెత్ పెనాల్టీ ఇన్ సౌదీ అరేబియా పేరిట 43 పేజీల పేజీల నివేదికను ఈ సందర్భంగా విడుదల చేసింది. 1985 జనవరి నుంచి 2015 జూన్ వరకు 2,208 మందికి దేశంలో ఉరిశిక్షను అమలు చేసినట్లు అందులో పేర్కొంది. అయితే ఉరిశిక్ష పడిన ప్రతి ఒక్కరి పేరు ఆ నివేదకలో పొందుపరచబడిందని పేర్కొంది.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 109 మందికి ఉరిశిక్షలు అమలయ్యాయని పేర్కొంది. అదే 2014 సంవత్సరంలో ఇదే కాల వ్యవధిలో 83 మందికి ఉరిశిక్ష పడినట్లు తెలిపింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అత్యాచారాలు, హత్యలను సౌదీ అరేబియా ఉక్కుపాదంతో అణివేసేందుకు కఠినతరమైన శిక్షలు అమలు చేస్తున్న విషయం విదితమే.