భారత సైన్యాన్ని కించపరిచేలా కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని జే.సీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ బెంగళూరులోని థియోలాజికల్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొంతమంది యువకులు ‘కాశ్మీర్‌లోని భారత సైన్యం వల్ల అక్కడి పండిట్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వెంటనే భారత సైన్యం అక్కడి నుంచి వెళ్లి పోవాలి’ అని నినదించారు. దీంతో అక్కడ కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఈ ఘటనపై ఏబీవీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొంటూ జే.సీ నగర్‌లో ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, భారత సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యాలను చేసింది బెంగళూరులో ఉంటూ చదువుకుంటున్న కొంతమంది కాశ్మీర్ యువకులని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన కాశ్మీర్ యువత ఇలాంటి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని రాజ్యసభ విపక్ష నేత గులాంనబీఆజాద్ ఢిల్లీలో వాఖ్యానించారు.