the Indian Army
-
రాహుల్ ‘సర్జికల్’ వ్యాఖ్యలపై చర్యలేమిటి?
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత ఆర్మీ చేసిన సర్జికల్ దాడుల వాస్తవికతను ప్రశ్నించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆరుగురు వ్యక్తులపై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదుకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటారో వచ్చే ఏడాది ఫిబ్రవరి 5లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఓ సిటీ కోర్టు ఆదేశించింది. రాహుల్ తదితరులు ఆర్మీ, దేశ గౌరవాన్ని దెబ్బతీశారంటూ ప్రవేశ్ కుమార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. -
సైన్యాన్ని కించపరిచారని కశ్మీరీ యువకులపై కేసు
భారత సైన్యాన్ని కించపరిచేలా కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని జే.సీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ బెంగళూరులోని థియోలాజికల్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొంతమంది యువకులు ‘కాశ్మీర్‌లోని భారత సైన్యం వల్ల అక్కడి పండిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే భారత సైన్యం అక్కడి నుంచి వెళ్లి పోవాలి’ అని నినదించారు. దీంతో అక్కడ కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఈ ఘటనపై ఏబీవీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొంటూ జే.సీ నగర్లో ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, భారత సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యాలను చేసింది బెంగళూరులో ఉంటూ చదువుకుంటున్న కొంతమంది కాశ్మీర్ యువకులని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన కాశ్మీర్ యువత ఇలాంటి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని రాజ్యసభ విపక్ష నేత గులాంనబీఆజాద్ ఢిల్లీలో వాఖ్యానించారు. -
పృథ్వీ-2, ధనుష్ క్షిపణుల పరీక్షలు సక్సెస్
బాలాసోర్(ఒడిశా): అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న పృథ్వీ-2, ధనుష్ క్షిపణులను భారత సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వీటిని సాధారణ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఒడిశా తీరంలో వేర్వేరుగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల పరీక్షలు విజయవంతం కావడంతో భారత బలగాల రక్షణ సన్నద్ధత బలోపేతమైంది. పృథ్వీ-2ను చాందీపూర్ దగ్గర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోని మొబైల్ లాంచర్ నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రయోగించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు మోసుకెళ్లే ఈ క్షిపణి 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. పృథ్వీకి నేవీ వెర్షన్ అయిన ధనుష్‌ను రాత్రి 7.40కు బంగాళాఖాతంలో ఓ నౌకపై నుంచి ప్రయోగించి, లక్ష్యాన్ని ఛేదించారు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే ధనుష్ కూడా 350 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేదిస్తుంది.