'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'
లండన్: ప్రభుత్వంపై తిరుగుబాటుకు విఫలయత్నం చేసిన వారిని టర్కీ ప్రభుత్వం క్రూరంగా హింసిస్తోందా.. అవుననే అంటోంది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సైనిక తిరుగుబాటులో సహకరించిన 13,165 మందిని ఇప్పటివరకు టర్కీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వీరిలో సైనిక అధికారులు, లాయర్లు, జడ్జీలు, పోలీసు అధికారులు, పౌరులు ఉన్నారు. అయితే.. వీరందరిపట్ల టర్కీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని ఆమ్నెస్టీ వెల్లడించింది.
అదుపులోకి తీసుకున్న వారికి అహారం అందించకుండా, తీవ్రంగా కొడుతూ.. కొందరిపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆమ్నెస్టీ సంస్థ సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, మానవహక్కులను కాలరాయొద్దని ఆ సంస్థ టర్కీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఇవాళ ప్రభుత్వ మద్దతుదారులు రాజధాని ఇస్తాంబుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.
బంధీలను తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన విషయాలను టర్కీ ప్రభుత్వం తోసిపుచ్చింది. మానవహక్కులను కాలరాసే పనులను తమ ప్రభుత్వం చేయడంలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం చూస్తున్న తమ దేశం అనుచిత చర్యలకు పాల్పడదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.