మాస్కో/జెనీవా: సిరియా రసాయన ఆయుధాలను అంతర్జాతీయ నియంత్రణకు అప్పగించే విషయంపై ప్రయత్నాలు మొదలయ్యాయి. రష్యా, అమెరికా విదేశాంగ మంత్రులు ఈ మేరకు దీనిపై చర్చించేందుకు గురువారం జెనీవాలో సమావేశమయ్యారు. మరోపక్క ఈ సంక్షోభాన్ని నివారించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా మరోసారి అమెరికాకు విజ్ఞప్తిచేశారు. సిరియా సంక్షోభం నివారణ కోసం నాలుగు అంశాల ప్రణాళికపై అమెరికా, రష్యాల విదేశాంగ మంత్రులు జాన్ కెర్రీ, సెర్గెయ్ లావ్రోవ్‌లు జెనీవాలో చర్చలు ప్రారంభించారు. కాగా, మిత్రదేశం రష్యా ప్రతిపాదించినందు వల్లనే తాము రసాయన ఆయుధాలను అప్పగిస్తున్నామని, అమెరికాకు భయపడి మాత్రం కాదని గురువారం ఓ టీవీచానెల్ ఇంటర్వ్యూలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ వ్యాఖ్యానించారు.