
సౌదీ అరేబియాలోని ఏసీ గుడారాలు
రియాద్: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా, ఇరాక్ తదితర ముస్లిం దేశాల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న శరణార్థులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ యూరప్ దేశాలను సౌదీ అరేబియా ఆడిపోసుకుంటోంది. ఈ నేపథ్యంలో ధనిక దేశమైన సౌదీ అరేబియా- శరణార్థుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటోందన్న సందేహం ఎవరికైనా రావడం సమంజసం.
అక్షరాల 40 లక్షల మంది శరణార్థులకు వసతి కల్పించేందుకు మీనా నగరంలో పది లక్షల అత్యాధునిక ఏసీ టెంట్లు ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్క శరణార్థికి కూడా సౌదీ అరేబియా ఆశ్రయం కల్పించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా జర్మనీ ఏటా ఐదు లక్షల మంది ముస్లిం సోదరులకు ఆశ్రయం కల్పిస్తే అక్కడ ఏటా 200 చొప్పున మసీదులు ఉచితంగా కట్టిస్తామని సౌదీ అరేబియా ఆఫర్ ఇస్తోంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి? (అంతర్యుద్ధం కారణంగా సిరియా నుంచి దాదాపు 40 లక్షల మంది ప్రజలు యూరప్ దేశాలకు వలసపోయారన్నది ప్రస్తుత అంచనాలు)
హజ్ యాత్రికుల కోసం మీనా నగరంలో 20 చదరపు కిలీమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల పొడువుగల పది లక్షల టెంట్లను సౌదీ అరేబియా 1990లో నిర్మించింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకుగాను వీటిని 1997లో ఆధునీకరించింది. వీటిలో ప్రత్యేక బాత్‌రూమ్‌లతోపాటు వంట చేసుకునేందుకు ప్రత్యేక గదిలాంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఏడాదికోసారి హజ్ యాత్రికులు కేవలం ఐదు రోజులపాటు బస చేసేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత ఏడాదిపాటు ఎడారి గుడారాల్లాగా ఖాళీగా ఉంటాయి. సిరియా తదితర ప్రాంతాల నుంచి శరణుకోరుతోంది ముస్లిం సోదరులేకదా! వారికి ఈ టెంట్లలో వసతి కల్పించినట్టయితే ఆ అల్లా కూడా సంతోషిస్తారుకదా!
ఇలాంటి విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తడంతో తాము 2011 నుంచే శరణార్థులకు ఆశ్రయిస్తున్నామని, ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి ఆశ్రయం ఇచ్చామని సౌదీ అరేబియా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, తమ దేశంలో పనిచేయడం కోసం చట్టపరంగా వీసాలిచ్చి తీసుకొచ్చుకున్న వారిని శరాణార్థుల లెక్కలో చూపేందుకు సౌదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సౌదీ ధోరణి చూస్తే సిరియాలో మానవ హననానికి పాల్పడుతున్న ఐఎస్‌ఐఎస్ టైస్టులకు అత్యాధునిక ఆయుధాలను సౌదీ అరేబియా అందిస్తోందన్న ఆరోపణలు ఇప్పుడు నిజమనుకోవాల్సి వస్తోందని పాశ్చాత్య పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఒక్క సౌదీ అరేబియా దేశమే కాకుండా ఖతార్, కువైట్ లాంటి సంపన్న గల్ఫ్ దేశాలేవీ కూడా సిరియా, ఇరాక్ శరణార్థులను సరిహద్దుల దరిదాపులకు కూడా రానీయడం లేదు.