‘రిపీటయిందో.. ఇక మీ డిఫెన్స్ ధ్వంసమే’
జెరూసలెం: సిరియాకు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి అవిగ్దార్ లైబర్‌మాన్ నేరుగా హెచ్చరించారు.
ఇటీవల సిరియా తమ యుద్ధ విమానాలను కూల్చివేసే ప్రయత్నం చేసిందని, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తమ యుద్ధ విమానాలపైకి ప్రయోగించిందని ఆయన గుర్రుమన్నారు. ‘మరోసారి సిరియా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టంను మా విమానాలపైకి ప్రయోగిస్తే మేం ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఆ వ్యవస్థను ధ్వంసం చేసి పారేస్తాం’ అని లైబర్‌మాన్ ఘాటుగా హెచ్చరించారు.