19 నుంచి 26 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు 195 దేశాల నేతల హాజరు కానున్నారు.
ఐక్యరాజ్యసమితి: సెప్టెంబరు 19 నుంచి 26 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు 195 దేశాల నేతల హాజరు కానున్నారు. 86 దేశాల నుంచి నేరుగా దేశాధినేతలే సమావేశాలకు వస్తారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సహాయ మంత్రి ఎంజే అక్బర్ వెళ్తారు. సుష్మ సెప్టెంబరు 26న ప్రసంగిస్తారు. సిరియాలో అంతర్యుద్ధం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, శరణార్థుల కష్టాలు, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు తదితరాలను ముఖ్యంగా చర్చించనున్నారు.
ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల పదవీ కాలం త్వరలో ముగియనున్నందున వారికి ఇవే చివరి సమావేశాలు. 71వ సర్వసభ్య సమావేశాల అధ్యక్షుడు పీటర్ థామ్సన్ తన తొలి ప్రసంగంలో మాట్లాడుతూ భద్రతా మండలిలో సంస్కరణలపై తాను ప్రధానంగా దృష్టి పెడతానని చెప్పారు.