ఈ ఫొటో జర్నలిస్టు హృదయాలు కదిలించాడు
డెమాస్కస్: హృదయాన్ని కదిలించే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. చాలా తక్కువమంది మాత్రమే అలాంటివాటికి స్పందిస్తుంటారు. ఈరోజుల్లో అయితే జరుగుతున్న విషయాన్ని పట్టించుకోకుండా కూసింత సాయం చేయకుండా దానిని వీడియో తీయడమో, ఫొటోలో తీయడమో చేసి సోషల్ మీడియాలో పెట్టి క్రేజ్ సంపాధించుకోవాలనుకుంటారు. కానీ, సిరియాలో ఓ ఫొటో జర్నలిస్టు మాత్రం తన వృత్తిధర్మాన్ని పక్కకు పెట్టి మానవత్వాన్ని ముందుకు తెచ్చాడు.
తనముందు జరిగిన సంఘటనను చూసి చలించిపోయి కాసేపు నిశ్చేష్టుడిగా మారి అనంతరం మేలుకొని నిజమైన వ్యక్తిలా కదిలాడు. రక్తం కారుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తన చుట్టూ అక్కడక్కడ పడి ఉన్న చిన్నారులపై వైపు చూసి గుండెలు పగిలేలా రోధించాడు. కెమెరా ఉండగానే రెండు చేతుల్లోకి ఓ చిన్నారిని తీసుకొని అంబులెన్స్ వైపు పరుగులు తీశాడు. ఇదంతా సిరియాలో అనూహ్యంగా వారం కిందట చోటు చేసుకున్న బాంబుదాడి జరిగినప్పుడు చోటు చేసుకున్న దృశ్యమాలిక.
పశ్చిమ అలెప్పోలోని రషిదిన్‌ల స్వాధీనంలో ఉన్న పలు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఓ చిప్స్ ప్యాకెట్స్ పట్టుకొని కారు దగ్గర నిల్చున్న వ్యక్తి చిన్నారులను దగ్గరకు పిలుస్తున్నాడు. అక్కడే ఫొటో గ్రాఫర్ల బృందం కూడా ఉంది. ఆలోగా అనూహ్యంగా ఓ భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. క్షణాల్లో 126మంది బలయ్యారు. వారిలో 80మందికి పైగా చిన్నారులు ఉన్నారు. ఫొటో గ్రాఫర్లలో ఒకరైన అబ్ద అల్కదేర్ హబాక్ అనే వ్యక్తి ఆ సంఘటనను చూసి కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే తేరుకొని తన మిగితా ఫొటో గ్రాఫర్లకు ఆదేశాలు ఇచ్చి ఫొటోలు తీయడం ఆపేసి సహాయక చర్యలకు దిగాడు.
ఎటు చూసిన విగత జీవులై పడి ఉన్న చిన్నారులను రోదించాడు. హబాక్ తొలిసారి ఓ చిన్నారి వద్దకు వెళ్లగా అతడు చనిపోయి ఉన్నాడు. మరో రెండడుగులు వేయగా కొన ఊపిరితో ప్రాణంకోసం ఓ బాలుడు అల్లాడుతున్నాడు. దాంతో కన్నీటి పర్యంతమైన హబాక్ అతడిని చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే మరో చిన్నారి వద్దకు వెళ్లి చూడగా ప్రాణాలుకోల్పోయి కనిపించాడు. ఇలా అంతా చనిపోయి ఉండటం చూసి మొకాళ్లపై కూలబడి కుమిలికుమిలి ఏడ్చాడు. ఈ చిత్రాలను అతడి సహచర ఫొటో గ్రాఫర్లు తీసి ఆన్‌లైన్‌లో పెట్టగా లక్షల మంది వీక్షించారు. అతడు చూపించిన జాలి ప్రేమపట్ల నెటిజన్లు శబాష్ ఫొటో జర్నలిస్టు అంటున్నారు.