
నిజమైన కృతజ్ఞుడు..!
బెర్లిన్: కీడు చేసినవారిని మరిచిపోయినా పర్వాలేదుగానీ.. మంచి చేసినవారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. అవకాశం వచ్చినప్పుడల్లా వారిపట్ల చేతనైనంత కృతజ్ఞత చూపించుకోవడం ప్రతి మనిషికి ఉండాల్సిన విజ్ఞత. అదే విషయాన్ని నిరూపించుకున్నాడు ఓ సిరియన్ శరణార్థి. కట్టుబట్ట సొంతగూడు వదిలేసి అకస్మాత్తుగా తమ దేశాన్ని విడిచి వచ్చిన తమను అక్కున చేర్చుకున్న జర్మనీ దేశంపట్ల సిరియా శరణార్థి అలెక్సా అస్సాలి రుణం తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించి అందరిచేత ప్రశంసలు అందిపుచ్చుకున్నాడు.
కన్నీళ్లు నింపుకొని, కన్నవారిని చేతపట్టుకొని వచ్చిన తమకు జర్మనీ ఆశ్రయం ఇచ్చిన తీరు మరవలేమని అందుకే తన ఈ ఉడతా భక్తి సాయం అంటూ ఓ వీధిలో నిల్చుని స్వయంగా ఆహారం వండి ఉచితంగా జర్మన్ ప్రజలకు పంచిపెడుతూ వారి మనసులు కొల్లగొట్టేశాడు. అలెక్సా అస్సాలి అనే సిరియా శరణార్థి గత నెలలో జర్మనీకి వలస వచ్చాడు. ఆ సమయంలో జర్మనీ తనను అక్కున చేర్చుకున్న విధానానికి ముగ్గుడైపోయాడు.
తాను ఆశ్రయం పొందిన వెంటనే సేద తీరకుండా తమకు సాయం చేసిన జర్మనీకి ఏదో చేయాలన్న తహతహతో బెర్లిన్ లోని అలెగ్జాండ్రాప్లాట్స్ స్టేషన్ వద్ద వేడివేడిగా వంట చేసి అక్కడ ఉన్న ఆశ్రయం లేనివారికి, పేదలకు ఉచిత ఆన్నదానం చేయడం ప్రారంభించాడు. దీన్నంతటిని వీడియో తీసిన కొందరు ఇంటర్నెట్ లో పెట్టగా కొద్ది సమయానికే 27లక్షల మంది వీక్షించారు.