
మనదేశ ఉద్యోగ, కార్మికులకు విదేశాల్లో పెరుగుతున్న అవకాశాలు
పశ్చిమాసియా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియాలో మంచి మార్కెట్
2030 కల్లా 30 లక్షల మందికి ఉపాధి దొరకవచ్చని కేంద్రం అంచనా
సీఐఐతో కలిసి నైపుణ్యాల గుర్తింపునకు కేంద్ర కార్మికశాఖ ‘ఫ్రేమ్‌వర్క్’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్నదేశం మనదే. అత్యధికంగా ఉద్యోగ, కార్మిక శక్తి లభ్యత ఉన్న దేశం కూడా భారతే. ఈ భారతీయ వర్క్‌ఫోర్స్‌ను ఇప్పుడు కొన్ని దేశాలు కళ్లకద్దుకొని ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారత ఉద్యోగ, కార్మిక శక్తికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
అమెరికా వద్దన్నా..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత అమలుచేస్తున్న కఠిన నిబంధనలతో ఆ దేశంలో భారతీయులకు ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ఆసియా, యూరప్‌లో మనవాళ్లకు అవకాశాలు పెరుగుతున్నట్లు కేంద్ర కార్మికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారత కార్మిక శక్తికి ఇప్పటికే పశ్చిమాసియా అతిపెద్ద జాబ్ మార్కెట్‌గా ఉంది.
సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాల్లో లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ దేశాల్లో 30 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు లభించవచ్చని కేంద్ర కార్మికశాఖ అంచనా వేసింది.
ఒక్క సౌదీ అరేబియాలోనే పదేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు ఉపాధి లభించవచ్చని పేర్కొంది. ఆ దేశంలో నిర్మాణ, రిటైల్, రవాణా, స్టోరేజీ, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో భారతీయులకు మంచి డిమాండ్ ఉన్నట్టు గుర్తించారు.
సీఐఐతో కలిసి ‘ఫ్రేమ్‌వర్క్’ తయారీ
సౌదీ, ఖతార్, ఒమన్, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియాలో భారత వర్క్‌ఫోర్స్‌కు అవకాశాలు పెంచేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)తో కలిసి కేంద్ర కార్మికశాఖ ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. కార్మికుల నైపుణ్యాలు, విద్యార్హతలను గుర్తించి పై దేశాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చటం ఈ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమని అధికారవర్గాలు తెలిపాయి.
ఒమన్‌లో ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఖతార్‌లో ఆతిథ్యం, ఏవియేషన్, స్పోర్టింగ్ ఈవెంట్లతో ముడిపడిన పరిశ్రమలు.. జపాన్‌లో నర్సింగ్, ఆతిథ్యం, ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్టేషన్, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) రంగాల్లో భారతీయులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. టర్కీ, దక్షిణాఫ్రికా, కువైట్, గుయానా, కెనడా, మలేసియాలలో కూడా భారత వర్కర్లకు అవకాశాలు పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
యూఏఈ అతిపెద్ద మార్కెట్
వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. మనదేశంలో అందుబాటులో ఉన్న వర్క్‌ఫోర్స్ తదితర అంశాలపై విశ్లేషణ కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్‌లో నమోదైన డేటాను కేంద్ర కార్మికశాఖ విశ్లేషించింది. దీని ప్రకారం యూఏఈ భారత వర్కర్లకు అతిపెద్ద గమ్యస్థానంగా నిలుస్తున్నట్టు వెల్లడైంది. 2023–24లో ఇజ్రాయెల్‌లో భారత వర్కర్లకు గణనీయంగా ఉద్యోగాలు లభించాయి.
నిపుణులకు జర్మనీ ఆహ్వానం
జర్మనీలో వచ్చే ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల మంది భారతీయ వర్కర్లకు ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. జర్మనీ ఎకనమిక్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2035 నాటికి ఆ దేశంలో 70 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత ఏర్పడనుంది.
ఆస్ట్రేలియాలో నర్సులు, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఫిన్లాండ్‌లో హెల్త్‌కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య, ఉత్పత్తి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం భారతీయులకు కాంట్రాక్టు, ప్రాజెక్టు ఆధారిత ఉపాధి అధికంగా ఉంది. కానీ, ఫుల్‌టైమ్ ఉద్యోగాల కల్పనకు మనదేశం మొగ్గుచూపుతున్నట్టు కార్మికశాఖ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment