
సగంమంది భారతీయుల్లో ఆర్థిక స్థితిపై ఆందోళన
పొదుపు, ఆర్థికావసరాలకు పొంతన ఉండటం లేదని ఆవేదన
తల్లిదండ్రులు, పిల్లల అవసరాలు తీర్చటంలో ఇబ్బందులు
35–54 ఏళ్ల లోపువారిలోనే భవిష్యత్ భయాలు అధికం
యూ గౌ, ఎడిల్‌వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ అధ్యయనంలో వెల్లడి
ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పిల్లల ఫీజులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు ఏటా తడిసి మోపెడవుతున్నాయి. నిత్యావసరాల ధరలు సరేసరి.. కానీ, ఆ స్థాయిలో ఆదాయాలు పెరగటంలేదు. వచ్చే సంపాదనలోనే ఎంతో కొంత భవిష్యత్ కోసం పొదుపు చేస్తున్నా.. అవి ఏమూలకూ సరిపో వటంలేదు.. ఇదీ నేడు సగం మంది భారతీయుల ఆవేదన.
ముఖ్యంగా 35 – 54 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పొదుపు, ఖర్చులపై యూ గౌ, ఎడిల్‌వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్
అధ్యయనంలోని కీలకాంశాలు..
» దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని 4,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 94 శాతం మంది భవిష్యత్ కోసం సవివరమైన ఆర్థిక ప్రణాళిక లేదా ఒక మోస్తరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
» సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిపైగా తాము చేస్తునపొదుపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని ఆందోళన వ్యక్తంచేశారు.
» పక్కా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్నా చివరకు అది పూర్తిస్థాయిలో అక్కరకు రావడం లేదని తెలిపారు.
» వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వయసు పెరుగుతున్న పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడంలో నిమగ్నమైన 35–54 ఏళ్ల లోపువారిలో 60 శాతం మంది తమ పొదపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని అంగీకరించారు.
» వివిధ రూపాల్లో ఎదురయ్యే అత్యవసరాలను ఎదుర్కొనే విషయంలో పొదుపు సొమ్ము సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది చెప్పారు.
» అనారోగ్య సమస్యలు, విద్య, ఇంటికి మరమ్మతులు వంటివాటికి అన్నిరకాల రుణాలను వినియోగించుకుంటుండటంతో దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేర్చుకునే విషయంలో ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు.
» భవిష్యత్ అవసరాలకు పనికి వస్తుందనే ఆశతో పలు మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నా.. అది అవసరానికి చేతికి రావటంలేదని కొంతమంది పేర్కొన్నారు.
» భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్న 35 – 54 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగంమందికి పైగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు జీవిత బీమా వంటి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రెండు రకాల సవాళ్లు
రెండు తరాలవారిని (తల్లి దండ్రులు, పిల్లలు) ఆదుకోవాల్సిన బాధ్యతల మధ్య ‘సాండ్‌విచ్ జనరేషన్’ (35 – 54 ఏళ్ల మధ్యవారు) నలిగిపోయే పరిస్థితి ఎదురవుతోంది. పెద్దలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినపుడు తగిన విధంగా ఖర్చు చేయడం, పెరుగుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం వీరికి సవాల్‌గా మారుతోంది. –సుమిత్ రాయ్, ఎండీ–సీఈవో, ఎడిల్‌వీస్ లైఫ్ ఇన్సూరెన్స్.
Comments
Please login to add a commentAdd a comment