Economic status
-
‘హోదా’తోనే వృద్ధి సాధ్యం
రాష్ట్ర విభజనానంతరం రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారింది. రాబడికన్నా ఖర్చు రెండింతలకు పైగా పెరిగింది. ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం గ్రాంట్ల రూపంలో భారీగా నిధులను, పన్నుల మినహాయింపులను ఇస్తే తప్ప పరిస్థితి చక్కబడదు. నత్తనడక నడుస్తున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి నడిపించగలగడం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యం. అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర అత్యుత్తమాంధ్రగా ఎదుగుతుంది. కోస్తాంధ్ర వృద్ధి చెందుతుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రాష్ట్ర వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు ప్రధానంగా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. విభజనకు ముందు 2012-13 కాలంలో రాష్ట్ర రాబడి రూ.70,548 కోట్లు. అందులో హైదరాబాద్ వాటానే రూ.34,000 కోట్లు. విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు రాబడి లోటు ఉంది. గత ఆరునెలల కాలానికి రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కేవలం రూ.19,372 కోట్లు. ఇతరత్రా వచ్చిన ఆదాయం రూ.1,911 కోట్లు. గతంలో ఉన్న ఆర్థిక లోటు రూ.1,699.51 కోట్లు. ద్రవ్య లోటు రూ.8,452.38 కోట్లు. గత నెల సెప్టెంబర్ వరకూ ప్రభుత్వ ఖర్చు మాత్రం రూ.53,681.13 కోట్లు. రాబడికన్నా వ్యయం రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్ప మరో మార్గం లేదు. ప్రత్యేక హోదా ఎవరికి? ఎలా? అవసరమైన నిధులు సమకూర్చుకోలేని, తక్కువ వనరులు, ఆర్థికలోటు ఉన్న రాష్ట్రాలకు చేయూతనందించడం తన బాధ్యతగా భావించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇస్తుంది. దీనివల్ల పన్నుల్లో రాయితీ వస్తుంది. పదేళ్లపాటు 90 శాతం నిధులు ఉచితంగా వస్తాయి. ఈ రకంగా వచ్చిన గ్రాంటును తిరిగి చెల్లించనవసరం లేదు. కేవలం 10 శాతం మాత్రమే అప్పుగా తిరిగి వడ్డీతో చెల్లించవచ్చు. ఈ వెసులుబాటు 1969లో తొలిసారిగా అస్సాం, జమ్మూ కశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు దక్కింది. అనంతరం దశలవారీగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, సిక్కింలు సహా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లభించింది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే అధికారం జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ)కి ఉంటుంది. అందులో ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికాసంఘం (ఇప్పుడు నీతి ఆయోగ్) సభ్యు లు. అయితే ప్రధానమంత్రి నిర్ణయమే ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రత్యేక హోదాకు ప్రణాళికా సంఘం కొన్ని అర్హతలను కూడా నిర్దేశించింది. 1. కొండ లతో కూడిన నైసర్గిక పరిస్థితులుండి, పంటలు పండించే వసతులు పెద్దగా లేని ప్రాంతాలు, 2. ఆర్థిక, మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రాలు, 3. జన సాంద్రత తక్కువగా ఉండి, నాగరికతకు దూరంగా విసిరివేయబడినట్టుండే ఆదివాసీ ప్రాంతాలు అధికంగా ఉన్నవి. 4. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు దేశాల ఆటుపోట్లకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు, 5. రాష్ట్ర వార్షిక స్థూల ఆదాయం తక్కువగా ఉండి గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అందించలేని ఆర్థికలోటు ఏర్పడినపుడు ప్రత్యేకహోదా ఇస్తారు. విభజనతో పెరిగిన ఆర్థికమాంద్యం... రాష్ట్ర విభజనానంతరం రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారింది. రాబడికన్నా ఖర్చు రెండింతలకు పైగా పెరిగింది. దీనికితోడు జనసాంద్రత ఒక్కసారిగా పెరిగింది. ఉద్యోగరీత్యా రాజధాని ప్రాంతానికి వలస వచ్చినందువల్ల నివాసం, విద్యుత్, నీరు, నిత్యావసర వస్తువుల ఖర్చు విపరీతంగా పెరిగింది. సామాన్యుడు జీవించలేని పరిస్థితి కనిపిస్తోంది. దినసరి వేతన కూలీలను సరైన ఆదాయం రాకపోగా ఉన్నది చాలక పస్తులుండే స్థితికి ఈ కాలం నెట్టేస్తోంది. ఈ స్థితిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదవారి పేదరికం మరింత పెరిగింది. సాధారణంగా ప్రతి రాష్ట్రంలోనూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు 87 శాతం ఉంటారు. ఈ ఉభయ మధ్యతరగతుల ప్రజల జీవనం పంటిబిగువున సాగే స్థాయికి నేడు రాష్ట్రం దిగజారింది. రాష్ట్రంలో 970 కి.మీ. తీరప్రాంతం ఉంది. శ్రీకాకుళం, విశాఖ నుంచి నెల్లూరు, తడ వరకూ తీర ప్రాంత రక్షణ ఒక సవాలుగా ఉంది. తీర ప్రాంత నౌకాదళం ప్రతిక్షణం అప్రమత్తంగా రాష్ట్రాన్ని కాపాడుతూనే ఉంది. అడపాదడపా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, చైనా నుంచి ముష్కరమూ కల దొంగచాటు రాకపోకలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దొంగ రవాణా పెరిగి జాతీయ వాణిజ్యాన్ని, రాష్ట్ర వాణిజ్యాన్ని రకరకాలుగా దెబ్బతీస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా లభించడం తీర రక్షకదళం పటిష్టమై రాష్ట్ర భద్రతతో పాటు దేశ భద్రతకు కూడా మార్గం సుగమం కాగలదు. ప్రత్యేకహోదాతో అభివృద్ధి... నేడు రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం మినహా మరో భారీ పరిశ్రమ లేదు. కోస్తా, రాయలసీమలోనూ అంతటి భారీ పరిశ్రమల అవసర ముంది. ప్రత్యేక హోదాతో పరిశ్రమల స్థాపనకు అవకాశం కలుగుతుంది. రాష్ట్రానికి పన్ను రాయితీ, ఎక్సైజ్ డ్యూటీలో వంద శాతం మినహాయింపు లభిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయొచ్చు. పరిశ్రమలతో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. సగటు తలసరి ఆదాయం రూ.60 వేల నుంచి రూ.3-4 లక్షల వరకు పెరుగుతుంది. నిరుద్యోగ నిర్మూలనలో రాష్ట్రం ముందు వరసలో ఉంటుంది. యువత జవసత్వాలను, తెలివిని రాష్ట్రం సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. గ్రామాలు పట్టణాలుగా, అవి నగరాలుగా ఎదుగుతాయి. ప్రజల జీవనస్థాయి పెరుగుతుంది. రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేది రైతు. రైతు చల్లగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రత్యేక హోదా రైతులకు నీటిప్రాజెక్టుల రూపంలో భరోసానిస్తుంది. కరువు పరిస్థితులు తగ్గిపోయి ఏటా సక్రమంగా ఇంటికి పంటలు వస్తాయి. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడతారు. బలవన్మరణాలు ఆగిపోతాయి. విద్య, వైద్యంలో నాణ్యమైన సేవలు... విద్యారంగం ఉన్నతపథంలో నడిచే దేశం, రాష్ట్రం అత్యున్నత స్థాయికి చేరుతుందన్న జార్జి వాషింగ్టన్ మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. విద్యారంగం నేడు ప్రైవేటు సంస్థలు, కార్పొరేటు సంస్థల చేతుల్లో బందీగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు అరకొర వసతులతో కునారిల్లుతున్నాయి. ప్రత్యేక హోదాతో ఐఐటీ, ఐబీఎం వంటి జాతీయ సంస్థలు ఏర్పడటమే కాదు, ప్రభుత్వ విద్యావ్యవస్థకు జవసత్వాలు సమకూరుతాయి. ప్రపంచ స్థాయి మేధావి వర్గానికి మన రాష్ట్రం కేంద్రం అవుతుంది. ఫార్మారంగం కూడా వృద్ధి చెందితే మందుల ధరలు వెసులుబాటు కాగలవు. వైద్యరంగంలో పేదలకూ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. స్త్రీ స్వయంశక్తి, స్వయం పోషక విధానంతో కుటుంబ జీవితంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తా యనటంలో ఆశ్చర్యం లేదు. జాతీయ సగటు ఆదాయంలో వృద్ధి కలుగు తుంది. ఇందుకు మన పొరుగునున్న కేరళ రాష్ట్రం మంచి ఉదాహరణ. మహి ళా శిశు మరణాలు చాలావరకు తగ్గిపోతాయి. జాతీయ ఆయుర్దాయం సగటు పెరుగుతుంది. ప్రజల జీవన విధానంలో ప్రస్ఫుటమైన మార్పు వస్తుంది. రాజకీయంగా జరిగిందేమిటి? యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ మనుగడ కోసం తెలుగు రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా, అర్ధ రాత్రివేళ రాష్ట్ర విభజన జరిగిందనిపించారు. అప్పటి రాజకీయ నాటకంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు ఐదేళ్ల హోదా ఏ మాత్రం చాలదు...పదేళ్లు ఇవ్వాలని గట్టిగా వాదించి, బీజేపీతోపాటూ రాష్ట్ర ప్రజల అభినందనలు అందుకున్నారు. దీన్ని యూపీఏ ప్రభుత్వం సహేతుకంగా నిర్ధారిస్తూ మాటలతో మభ్యపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రమాణపూర్వకంగా పదేళ్లపాటు హోదా ఇస్తామని నినదించాయి. రోజుకో మాటతో దాటవేత... తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ, నాటి హామీని కార్యరూపంలో పెట్టే విషయాన్ని రోజుకో మాట చెబుతూ దాటేస్తుండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. డాక్టర్ గాడ్గిల్ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నపుడు 1992-97 మధ్య కాలంలో పన్నుల దామాషా ప్రకారం 25 శాతం, భూభాగం ప్రకారం 10 శాతం, జనావాసం, ఆవాసయోగ్య జనాభాను బట్టి 47.5 శాతం ఆయా రాష్ట్రాలకు పన్నుల రాయితీనిచ్చారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ఇవ్వాలి. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో మినహాయింపునివ్వాలి. ఇప్పటికీ రాష్ట్రంలో పాలన నత్తనడక నడుస్తోంది. దీన్ని గాడిలో పెట్టి నడిపించే శక్తి ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యం. అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. ఉత్త రాంధ్ర అత్యుత్తమాంధ్రగా ఎదుగుతుంది. కోస్తాంధ్ర వృద్ధి చెందుతుంది. (వ్యాసకర్త ఉపకులపతి దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం, మొబైల్ : 98481 23655) - ప్రొ॥జి. కృపాచారి -
స్వేచ్ఛ ఇవ్వడం గొప్ప కాదు!
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... కౌమారంలోకి అడుగుపెట్టిన పిల్లలు తమ చుట్టూ ఉన్నదంతా మంచే అనుకుంటాను. ఎప్పుడూ సంతోషంలో మునిగితేలాలనుకుంటారు. మంచీ, చెడు తెలియని దశను సవ్యమైన మార్గంలో పెట్టడానికి నేటి కాలపు అమ్మనాన్నల ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. పదిహేనేళ్ల తన కుమారుడి గురించి ఓ తల్లి ఆందోళన చెందిన విధం ఇది... రెండు నెలల క్రితం... ‘‘మా అబ్బాయి అభినవ్ 9వ తరగతి చదువుతున్నాడు. పదిహేనేళ్లుంటాయి. నేనూ మావారు ఇద్దరం ప్రైవేటు ఉద్యోగస్తులమే. మాకు ఒక్కగానొక్క బిడ్డ అభినవ్. వాడి మీదే మా ఆశలన్నీ. వాడి భవిష్యత్తు బాగుండాలని, ఇద్దరం కష్టపడుతున్నాం. గత ఏడాది వరకు వాడి పెంపకం మాకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించలేదు. ఈ మధ్యే వాడి ప్రవర్తనకు తీవ్రంగా భయపడుతున్నాం. ఏమైపోతాడో అని దిగులుగా ఉంటోంది. పదిహేనేళ్ల పిల్లవాడు డ్రగ్స్ వాడుతున్నాడని తెలిస్తే ఏ తల్లిదండ్రికైనా ఎంత షాక్!! అలా నివ్వెరపోయేలా మా అబ్బాయి చేశాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఎదురు తిరుగుతుంటే వయసు అలాంటిదిలే అని సరిపెట్టుకున్నాను. అబద్ధాలు చెబుతున్నాడు అని తెలిస్తే కోప్పడేదాన్ని. కానీ, మార్కెట్లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా, ట్యాబ్ వచ్చినా అది కావాలనేవాడు. ఇవ్వకపోతే చచ్చిపోతాను అని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బెదిరింపులు. హెయిర్‌స్టైల్ మార్చాలంటాడు. డ్రెస్సులు ఫ్యాషన్‌గా లేవంటాడు. ఫ్రెండ్స్‌తో తిరుగుళ్లు ఎక్కువయ్యాయి.. తన కన్నా వయసులో పెద్దవారితో స్నేహాలు. కాస్త మందలించినా ఎదురుగా ఉన్న వస్తువులను టీవీ, ఫ్రిజ్.. ఏదుంటే అది పగలకొట్టేంతవరకు వెళ్లింది. నాకు తెలియకుండా మా వారి దగ్గర, ఆయనకు తెలియకుండా నా దగ్గర బుక్ పోయిందనో, పెన్ను కావాలనో, ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అనో.. డబ్బులు అడుగుతూనే ఉంటాడు. ఇవ్వకపోతే దొంగతనం కూడా చేసేవాడు. కోప్పడ్తే ‘నువ్వింతే, నా మీద నీకు నమ్మకం లేదు’ అనేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే మార్కులు బాగా తగ్గిపోయాయి. చెప్పింది అస్సలు వినడు అని స్కూల్లో టీచర్ల కంప్లయింట్. ఒక్కగానొక్క కొడుకు. ఏమైనా అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటాడో... అని భయం. అలాగని వదిలేస్తే ఏమైపోతాడో అని దిగులు. ఎవరి సలహా అయినా తీసుకుందామంటే ఇంట్లో ఉండేది మేం ముగ్గరమే! పెద్దవాళ్లు ఊళ్లో ఉంటారు. పిల్లవాడు బాగయ్యేదెలా?! చేస్తున్న ఉద్యోగం మానేయనా?! ఆర్థిక స్థితి అంతంతమాత్రమే. కుటుంబం గడిచేదెలా?! ఈ తరహా ఆందోళన నాలో ఎక్కువై ఆరోగ్యం కూడా దెబ్బతింది.’ - వసుధ (అభినవ్ తల్లి) నిజాలు ఇలా..! అభినవ్ని తీసుకొని తల్లీదండ్రి వచ్చినప్పుడు పిల్లవాడి స్థితి మామూలగానే ఉన్నట్టు అనిపించింది. తల్లితండ్రి చెబుతున్నట్టుగా ఏమీ లేడని, ఈ దశలో పిల్లల పట్ల ఉండే సహజమైన ఆందోళనే ఈ తల్లిదండ్రిలోనూ ఉందనుకున్నాను. అభినవ్‌తో ఒంటరిగా మాట్లాడి, క్రమం తప్పకుండా కొన్ని సేషన్స్కు అటెండ్ అయితే ఎన్నో విషయాలు తేటతెల్లమయ్యాయి. అభినవ్ కళ్లలో కొద్దిగా ఎరుపు జీర కనిపించింది. ఆకలి ఎక్కువగా ఉంటుందనీ చెప్పాడు. అప్పటికే కొన్ని మెడికల్ టెస్ట్‌లు కూడా చేయించడం వల్ల వాటిలో మందు, పొగ, మాదకద్రవ్యాలకు అప్పుడప్పుడే అలవాటుపడ్డాడని అర్థమైంది. అదే విషయం అడిగితే ‘ స్నేహితుల బలవంతమ్మీద వాటిని తీసుకుంటున్నా’నని చె ప్పాడు. ఇంకొన్నాళ్లు ఇలాగే వదిలేస్తే నిజంగానే అభినవ్ పూర్తిగా చదువుమానేసేవాడే! తల్లిదండ్రుల ఆందోళ మరింత పెరిగేదే! ఈ వయసులో... సాధారణంగా టీనేజ్ పిల్లల్లో బిహేవియరల్ సమస్యలను కనుక్కోవడం కష్టం. పేరెంట్స్ మధ్యలో గొడవలుంటే ఆ ప్రభావం పిల్లల మీధ అధికంగా పడుతుంది. వారి మనస్తత్వంలో తీవ్ర మార్పులు వస్తాయి. ఇద్దరూ ఉద్యోగస్తులు అవడంతో తల్లిదండ్రులు తమ తీరికలేని పనులలో నిమగ్నమై ఉంటారు.. పిల్లలతో కొంత సమయం కూడా గడపకపోవడం వల్ల బయటి స్నేహితులను వెతుక్కుంటారు. స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలు చెప్పింది వినకపోయినా, మానసిక సమస్యలున్నా, తెలివితేటల్లో పురోభివృద్ధి లేకపోయినా.. అవే పెరుగుతాయిలే అని పెద్దలు మిన్నకుండిపోతారు. దీంతో పట్టించుకునేవారు ఎవరూ లేరులే అనే నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది. ఇవి తప్పక పాటించాలి... ముఖ్య సమస్యలపైన ముందుగా దృష్టి పెట్టాలి.ఇంట్లో సమస్యలు పిల్లల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి. స్కూల్లో ఏ తరహా సమస్యలున్నాయో కనుక్కోవాలి. కొన్నిసార్లు టీచర్లు ఇద్దరు ముగ్గురు పిల్లలనే ‘పాయింట్ ఔట్’ చేసి కించపర చడం, దండించడం వంటివి చేస్తుంటారు. అలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. స్నేహితులు కూడా ఇంటి నుంచి ఏమైనా తీసుకురమ్మని డిమాండ్ చేస్తుంటారు. అలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో కనుక్కోవాలి. తల్లిదండ్రులు టీచర్లతో సమయానుసారం తమ పిల్లల పోగ్రెస్, వ్యక్తిత్వం ఎలా ఉందో సంభాషిస్తూ ఉండాలి. మార్పు రావడానికి మంచి - చెడు కారణాలు ఏమున్నాయో చూడాలి. ఎన్ని పనులున్నా... రోజులో కొంత సేపు పిల్లలతో సంభాషించాలి. డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వకుండా వస్తువుల రూపేణా భర్తీ చేయాలి. పిల్లవాడి చుట్టూ ఉన్న స్నేహితుల ప్రవర్తననూ పరిశీలించాలి. చాలామంది ‘మా పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ’ ఇస్తాం అని గొప్పగా చెబుతుంటారు. అంత స్వేచ్ఛ కూడా ఈ వయసులో మంచిది కాదు. స్వేచ్ఛకు కొన్ని పరిధులు ఉంటాయని తెలుసుకునేలా పెద్దల ప్రవర్తన ఉండాలి. అలాగని క్రమశిక్షణ పేరుతో అతిగా నియమాలు పెట్టకూడదు. అతి క్రమశిక్షణ పిల్లలను ఎదురు తిరిగేలా చేస్తుంది. కొంతమంది తమ పిల్లలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటామని గొప్పగా చెబుతారు. స్నేహితులుగా అనేది కూడా కొంతవరకే అని తల్లిదండ్రి గ్రహించాలి.స్తబ్దుగా, మౌనంగా పిల్లలు ఉంటే అలాగే వదిలేయకుండా తగిన కారణం తెలుసుకొని వెంటనే పరిష్కరించాలి.తమ ఈడు పిల్లలతో ‘పోలిక’ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. తప్పు పట్టకుండా సాధ్యాసాధ్యాలను వివరించాలి. రెండు నెలలుగా... ఇవన్నీ పాటించి, అభినవ్‌లో వచ్చిన మార్పులు చూసి తల్లీదండ్రీ సంతోషించారు. ‘ఇవే జాగ్రత్తలను పాటిస్తూ ఉండండి’ అనే సూచన వారి ముగ్గురి జీవితాల్లోనూ మార్పును తీసుకువచ్చింది. - డా. చెరుకూరి రమణ, సైకియాట్రిస్ట్ -
కెరీర్ ఛేంజ్.. ఆలోచించి అడుగేయండి!
ఒక కొలువు/వృత్తిలో కొనసాగుతున్నవారు అవసరాన్ని బట్టి మధ్యలో మరో రంగంలోకి మారాలని యోచిస్తుంటారు. అంటే కెరీర్‌ను మార్చుకోవాలని కోరుకుంటారు. ఆ రంగంపై వ్యక్తిగత ఆసక్తి, అందులో అవకాశాలు, ఆదాయం అధికంగా ఉండడం వంటివి కెరీర్ ఛేంజ్ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. కెరీర్‌ను మార్చుకోబోయే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. కెరీర్ ఛేంజ్‌పై నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాటిని తెలుసుకుంటే జాగ్రత్తగా అడుగు ముందుకేయొచ్చు. పరిశోధించాలి ఇష్టంలేని రంగంలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేరు. భావోద్వేగాలకు లొంగిపోయి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మారాలనుకుంటున్న ఉద్యోగం/వృత్తి గురించి ముందుగానే క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇందుకు తగిన పరిశోధన సాగించాలి. కొత్త కొలువు మీ అభిరుచి, ఆసక్తులకు తగినదో కాదో గుర్తించాలి. అందులోని సాదకబాధకాలను గమనించాలి. ఇప్పటికే సదరు కొలువు/రంగంలో స్థిరపడినవారిని సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి. కారణమేంటి? మరో రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు అనగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కారణాలు తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీరిచ్చే సమాధానంలో స్పష్టత, నిజాయతీ ఉండాలి. డబ్బుదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేకపోయినా మీరు చెప్పే కారణం దానికంటే ముఖ్యమైనదై ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో సానుకూలమైన కారణం అవసరం. ఆర్థిక స్థితిపై అంచనా మీ నిర్ణయం జీవితాన్ని మార్చేసేది అయినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, ఇతర విషయాలను అంచనా వేసుకోవాలి. భవిష్యత్తును, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీ నిర్ణయానికి కారణాలు తర్కానికి నిలిచేవిగా ఉండాలి. వాస్తవిక దృక్పథం అవసరం. స్కిల్స్ పెంచుకోవాలి కొత్త రంగంలోకి వెళ్తున్నారంటే అందులో రాణించడానికి తగిన నైపుణ్యాలు కావాలి. కాబట్టి స్కిల్స్ తప్పనిసరిగా పెంచుకోండి. అవసరమైతే స్వల్పకాలిక కోర్సులో చేరి సర్టిఫికేషన్ పూర్తి చేయొచ్చు. సీనియర్ల సలహాలు తీసుకోండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కూడా ఉపయోగపడతాయి. నిదానమే ప్రధానం కెరీర్ ఛేంజ్ విషయంలో ముఖ్యమైన అంశం.. ప్రస్తుతం చేస్తున్న కొలువును ఎప్పుడు వదులుకోవాలి? కొత్త కొలువులో ఎప్పుడు చేరాలి? అతివేగం అస్సలు పనికిరాదు. నిజంగా వెంటనే మారాల్సిన అవసరం ఉందా? అనేది సమీక్షించుకోవాలి. ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే వెంటనే వెళ్లిపోవచ్చు. వ్యాపారానికి గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్ అనేవి ఉండవు. కానీ, ఉద్యోగం చేస్తూ ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి సమయం, సందర్భం చూసుకోవాలి. ఆచితూచి అడుగేయాలి.