కెరీర్ ఛేంజ్.. ఆలోచించి అడుగేయండి!
ఒక కొలువు/వృత్తిలో కొనసాగుతున్నవారు అవసరాన్ని బట్టి మధ్యలో మరో రంగంలోకి మారాలని యోచిస్తుంటారు. అంటే కెరీర్‌ను మార్చుకోవాలని కోరుకుంటారు. ఆ రంగంపై వ్యక్తిగత ఆసక్తి, అందులో అవకాశాలు, ఆదాయం అధికంగా ఉండడం వంటివి కెరీర్ ఛేంజ్ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. కెరీర్‌ను మార్చుకోబోయే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. కెరీర్ ఛేంజ్‌పై నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాటిని తెలుసుకుంటే జాగ్రత్తగా అడుగు ముందుకేయొచ్చు.
పరిశోధించాలి
ఇష్టంలేని రంగంలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేరు. భావోద్వేగాలకు లొంగిపోయి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మారాలనుకుంటున్న ఉద్యోగం/వృత్తి గురించి ముందుగానే క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇందుకు తగిన పరిశోధన సాగించాలి. కొత్త కొలువు మీ అభిరుచి, ఆసక్తులకు తగినదో కాదో గుర్తించాలి. అందులోని సాదకబాధకాలను గమనించాలి. ఇప్పటికే సదరు కొలువు/రంగంలో స్థిరపడినవారిని సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి.
కారణమేంటి?
మరో రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు అనగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కారణాలు తెలుసుకోవాలని వారు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీరిచ్చే సమాధానంలో స్పష్టత, నిజాయతీ ఉండాలి. డబ్బుదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేకపోయినా మీరు చెప్పే కారణం దానికంటే ముఖ్యమైనదై ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో సానుకూలమైన కారణం అవసరం.
ఆర్థిక స్థితిపై అంచనా
మీ నిర్ణయం జీవితాన్ని మార్చేసేది అయినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, ఇతర విషయాలను అంచనా వేసుకోవాలి. భవిష్యత్తును, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీ నిర్ణయానికి కారణాలు తర్కానికి నిలిచేవిగా ఉండాలి. వాస్తవిక దృక్పథం అవసరం.
స్కిల్స్ పెంచుకోవాలి
కొత్త రంగంలోకి వెళ్తున్నారంటే అందులో రాణించడానికి తగిన నైపుణ్యాలు కావాలి. కాబట్టి స్కిల్స్ తప్పనిసరిగా పెంచుకోండి. అవసరమైతే స్వల్పకాలిక కోర్సులో చేరి సర్టిఫికేషన్ పూర్తి చేయొచ్చు. సీనియర్ల సలహాలు తీసుకోండి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు కూడా ఉపయోగపడతాయి.
నిదానమే ప్రధానం
కెరీర్ ఛేంజ్ విషయంలో ముఖ్యమైన అంశం.. ప్రస్తుతం చేస్తున్న కొలువును ఎప్పుడు వదులుకోవాలి? కొత్త కొలువులో ఎప్పుడు చేరాలి? అతివేగం అస్సలు పనికిరాదు. నిజంగా వెంటనే మారాల్సిన అవసరం ఉందా? అనేది సమీక్షించుకోవాలి. ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే వెంటనే వెళ్లిపోవచ్చు. వ్యాపారానికి గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్ అనేవి ఉండవు. కానీ, ఉద్యోగం చేస్తూ ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి సమయం, సందర్భం చూసుకోవాలి. ఆచితూచి అడుగేయాలి.