టాప్ స్టోరీ: సొంత రాష్ట్రంలోని ఓ మంచి సంస్థలో పాతిక వేల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే సాదాసీదాగా బతుకుబండి లాగించేయొచ్చు- కాలేజీ నుంచి కాలు బయటపెట్టింది మొదలు కొందరి ఆలోచనలు ఇలానే సాగుతాయి! మరికొందరు మాత్రం ఎలాగోలా కాదు.. కొలువు అడుగులో ప్రత్యేకత ఉండాలి, డాలర్ల వర్షం కురిపించే విదేశీ ఉద్యోగం కావాలని కలలు కంటారు. ముఖ్యంగా ఎంతో ముందుచూపుతో ఆలోచించే హైదరాబాద్ యువత.. తమ కలలను నిజం చేసుకునేందుకు కాలేజీలో ఉండగానే ప్రయత్నాలు మొదలెడతారు. అసలు నవతరం కుర్రకారుకు ఏ దేశాల్లో, ఏఏ రంగాల్లో అవకాశాలున్నాయి? విదేశీ ఉద్యోగానికి ఆయా దేశాల్లో ‘వీసా’ విధానాలు, నిబంధనలపై స్పెషల్ ఫోకస్..
‘గో అబ్రాడ్.. జాబ్ అబ్రాడ్’.. లక్ష్యంగా నిర్దేశించుకుంటున్న యువత ఇటీవలి కాలంలో పెరుగుతోంది. నగరంలోని అధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్య పూర్తిచేస్తుండటం, ఐటీ రంగం విస్తృతమవుతుండటం ఈ ధోరణికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు మన యువతను నియమించుకునేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు, కష్టపడి పనిచేసే ఓర్పు, ఎలాంటి వాతావరణంలోనైనా ఇమిడిపోగల నేర్పు తెలుగు విద్యార్థుల సొంతం. అందుకే మన యువతను విదేశీ సంస్థలు సాదరంగా ఆహ్వానిస్తున్నాయి.
వీసాల కోసం విశ్వ ప్రయత్నం:
విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వీసా కోసం ఔత్సాహికులు చేయని ప్రయత్నమంటూ ఉండదు. గుళ్లూ, గోపురాల చుట్టూ కూడా తిరుగుతారు. ‘వీసా వచ్చేలా ఆశీర్వదించాలని’ మనసారా కోరుకుంటారు. వీసా ఇచ్చేందుకు దేశాలు వివిధ నిబంధనలను నిర్దేశిస్తాయి. వీటిలో కొన్ని ప్రత్యేకంగా కనిపిస్తాయి. వివిధ దేశాల వీసా నిబంధనలను పరిశీలిస్తే..
అమెరికా:
అమెరికా వీసాలలో ప్రముఖమైంది హెచ్1-బి వీసా. ఇది ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్, మెడిసిన్ వంటి ప్రత్యేక రంగాలకు చెందిన వివిధ దేశాల నిపుణులు యూఎస్‌లో పనిచేసేందుకు వీలుకల్పిస్తుంది. అమెరికా కంపెనీ.. తాను నియమించుకోబోయే వ్యక్తి వీసా కోసం యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంటుకు దరఖాస్తు చేయాలి. ఐటీ బూమ్ నేపథ్యంలో.. ఈ వీసాకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. హెచ్1-బీ వీసా పొందడంలో తీవ్ర ఇబ్బంది లేకున్నా, అన్ని దేశాలకూ కలిపి ఆర్థిక సంవత్సరానికి జనరల్ కేటగిరీకి 65వేల పరిమితి ఉండటం నిరాశ కలిగించే అంశం. అమెరికా పౌరసత్వం, ప్రవాస సేవల విభాగం కంప్యూటర్ ద్వారా లాటరీ తీస్తుంది. అందుకే వీసా రావడానికి అదృష్టం తోడుకావాలని అంటారు. హెచ్1-బీ వీసాను ప్రాథమికంగా మూడేళ్లకు మంజూరు చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు.
యూరోపియన్ యూనియన్:
వీసా పొందేందుకు నాలుగు నుంచి 8 వారాలు పడుతుంది. సెంగెన్ వీసా అనేది ఒక విజిటర్ వీసా. దీని సహాయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) పరిధిలో ఉన్న 22 దేశాలతో పాటు మరో మూడు ఇతర దేశాల్లో పర్యటించవచ్చు. ఒకే పర్యటనలో 25దేశాలను సందర్శించేందుకు ఈ వీసా ఉపకరిస్తుంది. కానీ, యూరోపియన్ యూనియన్ వర్క్ వీసాకు సంబంధించి ఇలాంటి ఏర్పాట్లు లేవు. ఏ దేశంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నామో ఆ దేశానికి విడిగా వర్క్ వీసా కోసం దరఖాస్తు చేయాల్సిందే! ఉదాహరణకు ఒక కంపెనీకి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీలో కార్యాలయాలు ఉన్నాయనుకుంటే.. వాటిలో పనిచేయాలంటే విడివిడిగా బహుళ ప్రవేశ (మల్టీ ఎంట్రీ) వీసాలు ఉండాల్సిందే. దీన్నుంచి కొంత వరకు ఉపశమనం కలిగించేందుకు ఈయూ ఇంట్రా కార్పొరేట్ ట్రాన్స్‌ఫ్రీ వీసాను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో ఈయూలోని ఏ దేశంలోనైనా 90 రోజుల వరకు పనిచేయొచ్చు.
దక్షిణాఫ్రికా:
ఓ అభ్యర్థి వీసా కోసం తాను పనిచేసిన అన్ని దేశాల నుంచి పోలీసు సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. తాను పనిచేసిన ప్రాంతంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్న విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేశారు. ఉదాహరణకు ఐదేళ్ల కింద ఓ వ్యక్తి బెల్జియంలో ఆర్నెల్లు పనిచేస్తే ఇప్పుడు ఆయన దక్షిణాఫ్రియా వీసా పొందాలంటే బెల్జియం పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకొని సమర్పించాలి.
సింగపూర్:
సింగపూర్‌లోని ఏదైనా కంపెనీ.. విదేశీ ఉద్యోగులను నియమించుకుంటే, వారికి స్థానిక ఉద్యోగుల కంటే 15 శాతం నుంచి 20 శాతం మేర అధిక వేతనాలు చెల్లించాలి. విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకోవడం తగ్గించి, స్థానికులకు అవకాశాలు పెరిగేలా చేయడం దీని ఉద్దేశం. సింగపూర్‌లో వర్క్ పర్మిట్ ప్రక్రియను మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ చూస్తుంది. సింగపూర్‌లో రకరకాల వర్క్ పర్మిట్లు ఉన్నాయి. ఇవి జీతం, ఉద్యోగం, నైపుణ్యాలు, పని అనుభవం ఆధారంగా ఉంటాయి. ఎంప్లాయ్‌మెంట్ పాస్, ఎస్ పాస్, వర్క్ పర్మిట్ అనేవి ఉంటాయి. వీటికోసం దరఖాస్తు చేసుకోవాలి.
బ్రెజిల్:
వర్క్ వీసా కంటే టూరిస్టు వీసాతో పర్యటించడం తేలిక. వర్క్ పర్మిట్ తీసుకునేందుకు మూడు నెలల వరకు పడుతుంది. పనికోసం తాత్కాలిక వర్క్ వీసా పొందాలంటే బ్రెజిల్‌కు చెందిన కంపెనీ, ప్రభుత్వ విభాగం లేదంటే బ్రెజిల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలో జాబ్ ఆఫర్ పొందాలి. సదరు ఉద్యోగి తరఫున కంపెనీ.. ఇమ్మిగ్రేషన్ డివిజన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్‌కు దరఖాస్తు చేయాలి. సరైన విద్యార్హతలు, పని అనుభవం, కంపెనీతో సరైన ఉద్యోగ ఒప్పందం, ఎలాంటి నేర నేపథ్యం లేదని చూపే పోలీసు నివేదిక, వైద్య పరీక్షల నివేదికలు వంటివి సంతృప్తికరంగా ఉంటేనే వర్క్ వీసా లభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతుంది.
ఆస్ట్రేలియా
నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు, అక్కడ గుర్తింపు ఉన్న సంస్థలో ఉద్యోగం చేసేందుకు ‘457 వీసా ప్రోగ్రామ్’ వీలుకల్పిస్తుంది. దీని పూర్తి పేరు.. ‘ది టెంపరరీ వర్క్(స్కిల్డ్) వీసా (సబ్ క్లాస్ 457). ఈ వీసా ఆధారంగా నాలుగేళ్ల వరకు పనిచేయొచ్చు. ఒక ఆస్ట్రేలియా సంస్థ ఇతర దేశానికి చెందిన వ్యక్తిని ఉద్యోగిగా నియమించుకునే ముందు స్థానికంగా ఓ ప్రకటన విడుదల చేయాలి. ఏ నైపుణ్యం కలిగిన వ్యక్తిని ఇతర దేశాల నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారో అందులో వివరించాలి. స్థానికంగా సంబంధిత నిపుణులు లేకపోతేనే విదేశీయులను నియమించుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఈ ప్రక్రియను లేబర్ మార్కెట్ టెస్టింగ్ (ఎల్‌ఎంటీ)గా వ్యవహరిస్తారు. దీనికి కనీసం మూడు నెలలు పడుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎల్‌ఎంటీ నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్నుంచి ఐటీ నిపుణులను మినహాయించేందుకు నాస్కామ్ లాబీయింగ్ చేసింది.
అన్ని దేశాల్లోనూ అవకాశాలు
శ్రీజాబ్స్ అబ్రాడ్ ఔత్సాహికులకు అమెరికా, కెనడా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్.. ఇలా అన్ని దేశాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. ఇతర విభాగాలతో పోల్చి తే సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు ఇవి మరింత ఎక్కువే. ఫ్రెషర్స్ కంటే మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యువత ఎక్కువగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఉద్యోగాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగ అన్వేషణకు అభ్యర్థులకు రెం డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి నేరుగా తమ అనుభవానికి తగిన గమ్యాన్ని నిర్దేశించుకుని జాబ్ సెర్చ్ ఇంజిన్ సైట్ల ద్వారా తెలుసుకోవడం. రెండోది కన్సల్టెన్సీల ద్వారా ముందుకెళ్లడం. ఉద్యోగం ఖరారయ్యాక సదరు సంస్థ ఇచ్చే స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా వర్క్ పర్మిట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వర్క్ పర్మిట్ వీసాల నిబంధనల గురించి ఆందోళన అనవసరం. సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్ లెటర్ ఉంటే.. ఏ దేశమైనా వర్క్ పర్మిట్ వీసా రెండు నుంచి నాలుగు వారాల్లోపు మంజూరుచేస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు చేయాల్సిందల్లా అత్యున్నత నాణ్యతతో కూడిన రెజ్యూ మెను సిద్ధం చేసుకోవడం, కంపెనీలకు అవసరమైన స్కిల్స్ గురించి తెలుసుకుని వాటిపై అవగాహన పెంచుకోవడం.్ణ
- ఎ. జయలలిత, డెరైక్టర్, వై-యాక్సిస్ ఓవర్‌సీస్ కెరీర్స్
ఆ దేశాలంటే మక్కువెక్కువ!
విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే సిటీ యువత జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉంటున్నాయి. అయితే ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఇటీవలి కాలంలో కొత్త కంపెనీలు ఎక్కువగా ఏర్పాటవుతుండటం.. ఉన్న వ్యాపారాలను విస్తృతం చేస్తుండటం వల్ల ‘గ్లోబల్ మేధస్సు’ కోసం అన్వేషణ అధికమైంది. ఆఫ్రికా దేశాల్లో ఆయిల్, గ్యాస్, మైనింగ్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ), టెలికాం, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిపుణులకు అధిక డిమాండ్ ఉన్నట్లు నియామక కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ఫైనాన్స్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిటైల్ రంగాల్లో భారతీయ నిపుణులకు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇక్కడి యువత ప్రయత్నిస్తోంది.
విదేశీ ఉద్యోగానికి ఓ ‘వీసా’!
Published Sat, Aug 2 2014 12:55 AM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM
Advertisement
Advertisement