శిథిలాల మధ్య.. కన్నీటి పాట!
'శిథిల విలాపం'.. అంటే శిథిలాలు విలపించడం కాదు. నివాస స్థలాలు ధ్వంసమై శిథిలాలుగా మారిన చోట.. అప్పటికే కన్నీళ్లు ఇంకిన హృదయాలు మళ్లీ గుండెలవిసేలా ఏడవటం! అక్కడుంటే ఘోరమైన చావు తథ్యమని తెలిసీ.. ఆ శిథిలాల వీధుల్లోనే పియానో వాయిస్తూ.. ప్రతి మనిషికి ప్రాథమిక వాంఛ అయిన 'ఎలాగైనాసరే బతకాలనే' సందేశాన్ని ప్రకటిస్తాడు అయిహమ్- అల్- అహ్మది.
అతనిది యర్మౌక్ పట్టణం. సిరియా ప్రధాన నగరం డమాస్కస్ను ఆనుకుని ఉన్న ఆ పట్టణం.. ఆసుపత్రులు, పాఠశాలలకు పెట్టింది పేరు. ఇప్పుడు మాత్రం.. సిరియా సైన్యం, తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులు విడివిడిగానో, కలిసికట్టుగానో సాగిస్తున్న దమనకాండకు ప్రత్యక్ష సాక్షి.
ఆ విషాద వీధుల్లో పియానో సంగీతానికి లయబద్ధంగా అహ్మదీ పాడే పాటల్ని పిల్లలు, పెద్దలూ చుట్టూ చేరి వింటూ స్వాంతన పొందేవాళ్లు. పరిస్థితులు రోజురోజుకూ గడ్డువైపోయాయి. అప్పటికే సరుకులు నిండుకున్న దుకాణాలన్నీ బాంబు దాడుల్లో దెబ్బతిన్నాయి. యర్మౌక్ పట్టణానికి పాల సరఫరా కూడా నిలిచిపోయింది. విషాదగీతాలతో అందరినీ అలరించే అహ్మదీని.. ఇంట్లో కొడుకులు పెట్టే ఆకలి కేకలు తీవ్రంగా కలిచివేశాయి. తన కొడుకు లాంటి ఆయలాన్ కుర్దీ (టర్కీ తీరంలో శవమై తేలిన సిరియా బాలుడు) మరణంతో తెరుచుకున్న యూరప్ ద్వారాలకేసి నడవాలనుకున్నాడు.. సిరియా నుంచి టర్కీ గుండా యూరప్లోకి తన ప్రయాణాన్ని ఇలా వివరించాడు..
'పిల్లలకు కనీసం పాలు పట్టలేని దుస్థితి. డబ్బులున్నా అమ్మేవాళ్లు లేరు. మేముండే పట్టణానికి ఆహార పదార్థాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బతకడానికి వేరేచోటికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే నేను గమ్యం చేరతానా, ఎక్కడో ఒక చోట కాల్పుల్లో చచ్చిపోతానా లేక పడవలో వెళ్తూ వెళ్తూ సముద్రంలో మునిగిపోతానా అనేది అస్పష్టం. చూస్తూ చూస్తూ నా పిల్లల్ని చంపుకోలేను. అందుకే మొదట నేను బయలుదేరాను.. ఓ గూడు దొరికాక వాళ్లను తిరిగి తెచ్చుకోవాలని నా ఆలోచన.
నాతోపాటు శరణార్థుల బృందం ఓ బోటు మాట్లాడుకున్నాం.. మధ్యదరా గుండా గ్రీస్కు చేరడం మా గమ్యం. కిక్కిరిసిన చిన్న పడవలో రోజుల కొద్దీ ప్రయాణం. రొట్టె ముక్క కాదు కనీసం నీళ్లూ లేవు. చివరికి గ్రీస్ తీరానికి చేరాం. అదృష్టవశాత్తూ కోస్ట్ గార్డులకు మేం దొరకలేదు. ఎన్నాళ్ల నుంచో దూరమైన ప్రశాంతతను పడవ దిగగానే అనుభవించడం నాకింకా గుర్తుంది. నాతోపాటు ప్రయాణించిన వాళ్ల ముఖాల్లోనూ సన్నటి ఆనందాన్ని గుర్తించాను. గ్రీస్ నుంచి జర్మనీకి వెళ్లడం, చిన్నదైనా సరే, అక్కడో ఇంటిని సాధించడం నా తక్షణ లక్ష్యాలు. ఆ వెంటనే యర్మౌక్కు వెళ్లి నా భార్యాబిడ్డలను తీసుకొచ్చుకుంటా' అంటూ ముగించాడు అహ్మదీ.
కల్లోల యర్మౌక్ పట్టణ వీధుల్లో అహ్మదీ పియానో వాయిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. యూరప్లో అతనికి కొత్త జీవితం దొరకాలని, అతి త్వరలోనే తన కుటుంబాన్ని అక్కడికి తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు నెటిజన్లు. మనమూ అదే కోరుకుందాం..
- మధు కోట