pianist
-
శిథిలాల మధ్య.. కన్నీటి పాట!
'శిథిల విలాపం'.. అంటే శిథిలాలు విలపించడం కాదు. నివాస స్థలాలు ధ్వంసమై శిథిలాలుగా మారిన చోట.. అప్పటికే కన్నీళ్లు ఇంకిన హృదయాలు మళ్లీ గుండెలవిసేలా ఏడవటం! అక్కడుంటే ఘోరమైన చావు తథ్యమని తెలిసీ.. ఆ శిథిలాల వీధుల్లోనే పియానో వాయిస్తూ.. ప్రతి మనిషికి ప్రాథమిక వాంఛ అయిన 'ఎలాగైనాసరే బతకాలనే' సందేశాన్ని ప్రకటిస్తాడు అయిహమ్- అల్- అహ్మది. అతనిది యర్మౌక్ పట్టణం. సిరియా ప్రధాన నగరం డమాస్కస్‌ను ఆనుకుని ఉన్న ఆ పట్టణం.. ఆసుపత్రులు, పాఠశాలలకు పెట్టింది పేరు. ఇప్పుడు మాత్రం.. సిరియా సైన్యం, తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులు విడివిడిగానో, కలిసికట్టుగానో సాగిస్తున్న దమనకాండకు ప్రత్యక్ష సాక్షి. ఆ విషాద వీధుల్లో పియానో సంగీతానికి లయబద్ధంగా అహ్మదీ పాడే పాటల్ని పిల్లలు, పెద్దలూ చుట్టూ చేరి వింటూ స్వాంతన పొందేవాళ్లు. పరిస్థితులు రోజురోజుకూ గడ్డువైపోయాయి. అప్పటికే సరుకులు నిండుకున్న దుకాణాలన్నీ బాంబు దాడుల్లో దెబ్బతిన్నాయి. యర్మౌక్ పట్టణానికి పాల సరఫరా కూడా నిలిచిపోయింది. విషాదగీతాలతో అందరినీ అలరించే అహ్మదీని.. ఇంట్లో కొడుకులు పెట్టే ఆకలి కేకలు తీవ్రంగా కలిచివేశాయి. తన కొడుకు లాంటి ఆయలాన్ కుర్దీ (టర్కీ తీరంలో శవమై తేలిన సిరియా బాలుడు) మరణంతో తెరుచుకున్న యూరప్ ద్వారాలకేసి నడవాలనుకున్నాడు.. సిరియా నుంచి టర్కీ గుండా యూరప్‌లోకి తన ప్రయాణాన్ని ఇలా వివరించాడు.. 'పిల్లలకు కనీసం పాలు పట్టలేని దుస్థితి. డబ్బులున్నా అమ్మేవాళ్లు లేరు. మేముండే పట్టణానికి ఆహార పదార్థాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బతకడానికి వేరేచోటికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే నేను గమ్యం చేరతానా, ఎక్కడో ఒక చోట కాల్పుల్లో చచ్చిపోతానా లేక పడవలో వెళ్తూ వెళ్తూ సముద్రంలో మునిగిపోతానా అనేది అస్పష్టం. చూస్తూ చూస్తూ నా పిల్లల్ని చంపుకోలేను. అందుకే మొదట నేను బయలుదేరాను.. ఓ గూడు దొరికాక వాళ్లను తిరిగి తెచ్చుకోవాలని నా ఆలోచన. నాతోపాటు శరణార్థుల బృందం ఓ బోటు మాట్లాడుకున్నాం.. మధ్యదరా గుండా గ్రీస్‌కు చేరడం మా గమ్యం. కిక్కిరిసిన చిన్న పడవలో రోజుల కొద్దీ ప్రయాణం. రొట్టె ముక్క కాదు కనీసం నీళ్లూ లేవు. చివరికి గ్రీస్ తీరానికి చేరాం. అదృష్టవశాత్తూ కోస్ట్ గార్డులకు మేం దొరకలేదు. ఎన్నాళ్ల నుంచో దూరమైన ప్రశాంతతను పడవ దిగగానే అనుభవించడం నాకింకా గుర్తుంది. నాతోపాటు ప్రయాణించిన వాళ్ల ముఖాల్లోనూ సన్నటి ఆనందాన్ని గుర్తించాను. గ్రీస్ నుంచి జర్మనీకి వెళ్లడం, చిన్నదైనా సరే, అక్కడో ఇంటిని సాధించడం నా తక్షణ లక్ష్యాలు. ఆ వెంటనే యర్మౌక్కు వెళ్లి నా భార్యాబిడ్డలను తీసుకొచ్చుకుంటా' అంటూ ముగించాడు అహ్మదీ. కల్లోల యర్మౌక్ పట్టణ వీధుల్లో అహ్మదీ పియానో వాయిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. యూరప్‌లో అతనికి కొత్త జీవితం దొరకాలని, అతి త్వరలోనే తన కుటుంబాన్ని అక్కడికి తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు నెటిజన్లు. మనమూ అదే కోరుకుందాం.. - మధు కోట -
సామాన్యుల దరికి సంగీతం
స్ఫూర్తి ఈమధ్య చెన్నైలో అద్భుతమైన కర్ణాటక సంగీతకచేరి ఒకటి జరిగింది. చెన్నైలోని మున్సిపల్ స్కూళ్ళలో చదివే పేద పిల్లల సంగీత కచ్చేరి అది. ఆ పిల్లలను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతుంటే అనిల్ శ్రీవాస్తవన్ కళ్లు ఒకింత గర్వంగా మెరిసాయి. ఎవరీయన? పియానిస్ట్‌గా చేయి తిరిగిన చెన్నైవాసి అనిల్ శ్రీవాస్తవన్ అమెరికాలో చదువుకున్నారు. నిజానికి ఆయన మనసంతా సంగీతమే. మూడు సంవత్సరాల వయసులో పియానో ప్రేమలో పడిన శ్రీవాస్తవన్ దాన్ని వాయించడంలో మెలకువలు నేర్చుకున్నాడు. స్కూల్లో అతనికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది పియానో. సంగీతమే శ్వాస అనుకున్న శ్రీవాస్తవన్ పదిహేడు సంవత్సరాల వయసులో సంగీతానికి దూరం కావాల్సి వచ్చింది. నాన్న అనారోగ్యంతో ఇంటిని ఆర్థికసమస్యలు చుట్టుముట్టాయి. ‘‘కుటుంబ పరిస్థితి చూస్తున్నావు కదా...పియానో మీద కాదు చదువు మీద దృష్టి పెట్టు’’ అని చెప్పింది అమ్మ. దీంతో తన సంగీత స్వప్నాలను వెనకకుర్చీలో కూర్చో పెట్టక తప్పింది కాదు. ఎకనామిక్స్‌లో మంచి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ముంబయిలో పనిచేశాడు. కొంత కాలం తరువాత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యంబిఏ చేశాడు. జీవన ప్రయాణంలో పరుగులు పెడుతూనే ఉన్నాడు. అయితే తన జీవితంలో సంగీతం లేదని గుర్తుకొచ్చినప్పుడల్లా బాధగా ఉంది. టర్నింగ్ పాయింట్1 ఒకసారి సెలవులకు ఇండియాకు వచ్చినప్పుడు మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్‌లను కలుసుకున్నాడు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తనలోని సంగీతాన్ని ఎవరో తట్టిలేపినట్లు అనిపించింది. అలా మళ్లీ సంగీతానికి దగ్గరయ్యాడు. రాజేష్‌తో కలిసి ‘ఇన్ టు ది లైట్’ ఆల్బమ్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది తన జీవితానికి టర్నింగ్ పాయింట్. కొలంబియాలో పీహెచ్‌డి చేస్తున్నప్పుడు ఎక్కువ సమయం మ్యూజిక్ డిపార్ట్మెంట్లోనే గడిపేవాడు. అక్కడ కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఒకానొక రోజు ‘‘సంగీతం కోసం పిహెచ్డి వదిలేస్తున్నాను’’ అని అమ్మకు మెసేజ్ పెట్టాడు. స్కూల్లో తన కంటే జూనియర్ గురుచరణ్‌ను ఒకానొక సందర్భంలో కలుసుకోవడం కూడా శ్రీవాస్తవన్ త్వరగా సంగీతం వైపు రావడానికి కారణమైంది. గురుచరణ్‌కు కూడా సంగీతం అంటే ప్రాణం. అతనితో కలిసి చేసిన ‘మదిరాక్షి’ అనే ఆల్బమ్‌కు మంచి స్పందన లభించింది. ‘‘ఆల్బమ్‌కు వచ్చిన స్పందన పద్నాలుగు సంవత్సరాల బాధను మాయం చేసింది’’ అంటాడు శ్రీవాస్తవన్. ఎందరో ప్రముఖులతో కలిసి ఆల్బమ్‌లు రూపొందించిన శ్రీవాస్తవ త్వరలో ‘కీ టు ఇండియా’ అనే ఆల్బమ్‌ను విడుదల చేయనున్నాడు. టర్నింగ్ పాయింట్2 పిల్లలంటే ఇష్టపడే శ్రీవాస్తవన్... వాళ్లతో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాడు. అలా ఒకసారి తిరువరూర్లో ప్రభుత్వపాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న క్రమంలో సంగీతానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు వారిని అడిగాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యిందేమిటంటే, పిల్లలకు సినిమా జ్ఞానం తప్ప సంగీతజ్ఞానం బొత్తిగా లేదని. ఇది శ్రీవాస్తవన్ను బాధకు గురి చేసింది. ‘పాఠశాలలో సంగీతానికి ప్రాధాన్యత లేదు’ ‘సంగీత పట్టభద్రులకు ఉద్యోగాలు లేవు’ బాధగా అనుకున్నాడు తనలో తాను. సంగీతాన్ని, సంస్కృతిని పిల్లలకు చేరువ చేయాలనే ఆలోచనతో ఇరవై రెండు లక్షల రూపాయలతో ‘రాప్సోడీ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ’ని స్థాపించాడు. గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లి మ్యూజిక్‌ను ఒక సబ్జెక్ట్‌గా చేర్చి, దానికి సంబంధించిన విద్యావిధానానికి రూపకల్పన చేస్తుంది రాప్సోడీ. రాప్సోడీ నుంచి ఉపాధ్యాయులు ప్రభుత్వపాఠశాలలకు వెళ్లి సంగీత పాఠాలు బోధిస్తుంటారు. ‘మ్యూజిక్ అండ్ ది మైండ్’ పేరుతో డా.సుధా రాజాతో కలిసి పాఠ్యప్రణాళికను రూపొందించాడు శ్రీవాస్తవన్. ‘‘గణితం, భూగోళశాస్త్రం, చరిత్ర, సైన్స్‌లాగే సంగీతాన్ని కూడా ఒక సబ్జెక్ట్‌గా పరిగణించాలి’’ అనేది ఆయన కోరిక. విశేషం ఏమిటంటే సైన్స్ పాఠాలను పాటలుగా రూపొందించి పిల్లలతో పాడిస్తున్నారు. దీంతో సంగీతం వచ్చినట్లు ఉంటుంది, సబ్జెక్ట్ వచ్చినట్లూ ఉంటుంది. ఆర్థికసమస్యల వల్ల సంగీతం నేర్చుకోవడం అనేది ఒకప్పుడు పేదపిల్లలకు కష్టమైన పని కావచ్చు. కాని శ్రీవాస్తవన్ కృషి వల్ల ఇప్పుడు సంగీతం అనేది పేదపిల్లలను వెదుక్కుంటూ మరీ వస్తుంది. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులకు సంగీతాన్ని చేరవేయాలనేది శ్రీవాస్తవన్ కల. ఆ దిశగా ఆయన అభినందన పూర్వకమైన ప్రయత్నం చేస్తున్నారు.