
విడిపోయి 50 ఏళ్లు.. మళ్లీ ఇలా ఏకమయ్యారు!
రెండో ప్రపంచయుద్ధ సమయంలో యుక్తప్రాయంలో ఉన్న లీనా హెండర్సన్, రోనాల్డ్ డేవిస్ మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది కాలానికే విడాకులు తీసుకున్న ఈ జంట దాదాపు 50 ఏళ్ల తర్వాత ముదిమి ప్రాయంలో ఇప్పుడో మరోసారి మనువాడారు. 'ఇది జరిగి తీరుతుందని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ఇది ఎప్పుడూ నా మనస్సు అడుగున ఉండేది. మొత్తానికి మేం మళ్లీ కలుసుకోవడం సంతోషకరం' అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ మాజీ మిలిటరీ అధికారి అయిన డేవిస్ చెప్పాడు. ఆయన రెండో భార్య గత జనవరి నెలలో చనిపోయింది. ఇక రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వితంతువైన హెండర్సన్ తమ ప్రేమబంధాన్ని వివరించింది.
'మేం వేరయినప్పటికీ ఒకరి గురించి ఒకరం నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాం' అని ఆమె తెలిపింది. అమెరికా టెన్నిస్సెస్ రాష్ట్రంలోని చట్టనూగ పట్టణానికి చెందిన ఈ జంట అప్పట్లో ఎందుకు విడిపోయారో మాత్రం చెప్పడం లేదు. 1964లో విడాకులు తీసుకున్న తర్వాత వీరు ఒకరితో ఒకరు మాట్లాడుతూ స్నేహపూర్వకంగానే కొనసాగారు. ఈలోపు డేవిస్ ప్రపంచదేశాలను చుట్టివచ్చినా వీరి మధ్య అనుబంధం మాత్రం చెదరలేదు. అప్పుడప్పుడు డేవిస్ రెండో భార్య కూడా హెండర్సన్‌కు ఫోన్ చేసి ఆమె సలహా అడుగుతుండేది. చివరగా 1996లో కుటుంబంలో ఒకరు చనిపోతే.. అంత్యక్రియల సందర్భంగా ఇద్దరు కలుసుకున్నారు.
'వాళ్లిద్దరి మధ్య ఉన్నది స్నేహబంధమే. వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఇదే విషయం స్పష్టమయ్యేది' అని డేవిస్, హెండర్సన్ కూతురు రెనితా చాద్‌విక్ తెలిపింది. 'మా నాన్న గురించి అమ్మ ఎప్పుడూ పరుషమైన విషయాలు చెప్పలేదు. నాన్న కూడా అమ్మ గురించి ప్రేమపూర్వక మాటలే చెప్పేవాడు. వారి కథ ఎవరికైనా చెబితే వారు నవ్వడమో, ఏడ్వడమో చేసేవారు' అని ఆమె చెప్పింది.
మొత్తానికి ఈ జంట మళ్లీ ఏకమయ్యే సమయం రానేవచ్చింది. గత ఈస్టర్ పండుగ సందర్భంగా డేవిస్ ఫోన్ చేసి హెండర్సన్‌కు తన మనసులోని మాట చెప్పాడు. హెండర్సన్ చిర్నవుతో 'ఊ' కొట్టడంతో నిశ్చితార్థపు ఉంగరం ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా టీ-షర్ట్‌కు గుచ్చి తీసుకొచ్చాడు. ఇద్దరి కుటుంబాలకు చెందిన నాలుగు తరాల వారు చూస్తుండగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లిలైపోయి పిల్లలతో ఉన్న తమ పిల్లల సమక్షంలో ఓ చర్చిలో ఈ ఎవర్‌గ్రీన్ ప్రేమికులు మళ్లీ ఏకమయ్యారు. పెళ్లి తర్వాత విందు కూడా ఏర్పాటు చేశారు. కానీ మరోసారి హనీమూన్ ట్రిప్ కు మాత్రం ప్లాన్ చేసుకోలేదట. 'మేం మళ్లీ కలిశాం. ఎంతో ఆనందంగా ఉంది. ఇందుకు మేం కృతజ్ఞులం' అంటూ చివరగా డేవిస్ ఆనందబాష్పాలు రాల్చాడు.