సెక్స్ బానిసత్వంపై పరిష్కారం దిశగా..!
సియోల్: రెండో ప్రపంచయుద్ధ కాలంనాటి సెక్స్ బానిసత్వం అంశాన్ని పరిష్కరించే దిశగా జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఏకాభిప్రాయం దిశగా ఓ ముందడుగు వేశాయి. ఈ విషయమై గత మూడేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించి.. మళ్లీ అధికారికంగా చర్చలు ప్రారంభించాయి. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆసియాకు చెందిన వేలాది మంది మహిళలును సెక్స్ బానిసలుగా జపాన్ మిలటరీ నడిపే బ్రోతల్ కేంద్రాలకు తరలించారు. వారిలో అత్యధికులు దక్షిణాకొరియాకు చెందిన మహిళలు. వీరిని 'సౌఖ్యం అందించే మహిళలు'గా పేర్కొంటూ సైనికులు శృంగారానికి వాడుకున్నారు. ఈ అరాచకంపై జపాన్ గతంలో పలుసార్లు క్షమాపణలు చెప్పింది.
అయితే అప్పడు సెక్స్ బానిసలుగా పనిచేసిన మహిళల బాధ్యత జపాన్‌దేనని దక్షిణకొరియా చెబుతోంది. ఆనాటి బాధితులకు గతంలో ప్రకటించిన పరిహారం, ఇతర సహాయక చర్యలు తగిన విధంగా లేవని, వారికి సరైన పరిష్కారం చేయాలని ఆ దేశం కోరుతోంది. ఈ విషయమై ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న చర్చలకు 2012లో జపాన్ ప్రధానిగా షింజో అబె బాధ్యతలు చేపట్టడంతో బ్రేక్ పడింది. ఆయన తన పూర్వ ప్రధానుల కన్నా తీవ్రమైన జాతీయవాద దృక్పథాన్ని అవలంబించడంతో ఇరుదేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొరియా ద్వీపకల్పంలో 1910-1945 మధ్యకాలంలో జపాన్ సాగించిన అరాచక సామ్రాజ్యవాద పాలనను పునరుద్ధరించాలని షింజో అబె భావిస్తున్నారని దక్షిణ కొరియా ఆరోపించింది.
ఈ నేపథ్యంలో మూడేళ్లుగా మూలన పడిన సెక్స్ బానిసల సమస్య పరిష్కారం అంశంలో ఎట్టకేలకు ఇన్నాళ్లకు మళ్లీ కదలిక వచ్చింది. అయితే ఇప్పుడు చర్చల దిశగా ముందడుగు మాత్రమే పడిందని, ఇంకా సరైన పరిష్కారం దిశగా కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పరిశీలకులు భావిస్తున్నారు.