యుద్ధం ఓడిపోయింది | Losing battle | Sakshi
Sakshi News home page

యుద్ధం ఓడిపోయింది

Published Mon, Nov 21 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

యుద్ధం ఓడిపోయింది

యుద్ధం ఓడిపోయింది

 చరిత్ర

పెద్దలకు దేవుడిచ్చే కానుక పిల్లలు. పిల్లలకు పెద్దలు ఇవ్వవలసిన కానుక ప్రేమ. వాస్తవానికి పిల్లలకు పెద్దలకు ఇచ్చే ప్రేమ.. ‘ఇచ్చే ప్రేమ’ కాదు. ‘తీసుకునే ప్రేమ’. పిల్లల సందడి లేకపోతే ఈ ప్రపంచం బోర్ కొట్టేస్తుంది. ‘ఎందుకు బతుకుతున్నాంరా.. దేవుడా’ అనిపిస్తుంది. పిల్లలంటే.. కడుపున పుట్టిన పిల్లలు మాత్రమే కాదు, పుడమిన పుట్టిన పిల్లలందరూ! ఆలోచించండి.. ఏదైనా పిల్లలుంటేనే ఆనందాన్నిస్తుంది. పూల తోట బాగుంటుంది. పిల్లలు తూనీగల్లా ఆ తోటలో పరుగులు తీస్తుంటే ఇంకా బాగుంటుంది. జాబిల్లి బాగుంటుంది. పిల్లలు ఆ జాబిల్లిని చూస్తూ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఇంకా బాగుంటుంది. పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకుంటాం, వాటి మెట్లు పిల్లలెక్కి దిగుతుంటేనే అవి ప్రాణమున్న నిర్మాణాలు.

ఫ్లైట్‌లో ఎగిరిపోతుంటాం, పిల్లలు మన సీటెక్కి తొక్కుతుంటేనే విమానం ఎక్కిన ఫీలింగ్.  విహారం, వినోదం, సంస్కృతి, సంప్రదాయం.. ఏదైనా పిల్లల నవ్వులు వినిపిస్తేనే పరిపూర్ణం అయినట్టు. పండగైనా.. పిల్లలు పీకి పందిరేస్తేనే బాగా జరిగినట్టు.  పసితనంలోని ‘పవర్ ఆఫ్ హీలింగ్’ ఇదంతా. పిల్లలు ఏదీ దాచుకోరు. బాధనీ, సంతోషాన్నీ! ప్రతిదీ దాచుకుంటాం కదా... అందుకే పిల్లంటే మనకంత ఆపేక్ష. అంత ప్రేమ. అంత వాత్సల్యం.

ఈ చిన్నారిని చూడండి. ఆ నవ్వు చూడండి. ఆ క్షణంలో వాడికి ఇంకేం అక్కర్లేదు.. గుండెకు హత్తుకున్న ఆ కొత్త షూ తప్ప. యుద్ధంలో అమ్మ తప్పిపోయింది. నాన్న తప్పిపోయాడు. యుద్ధం వీడిని అనాథను చేసింది. ఓ ఆశ్రమం చేరదీసింది. వీడు ఏడుస్తున్నాడు. వాళ్లు ఓదారుస్తున్నారు. ఏడాది గడిచింది. ఇంతలో క్రిస్మస్ వచ్చింది. కానుక తెచ్చింది. కొత్త షూ! వీడి కళ్లు మెరిశాయి. ఏడుపు మానేశాడు. యుద్ధం జరిగినన్నాళ్లూ కొత్త అన్నదేదీ వీడు చూడలేదు. అందుకే ఆ మెరుపు. ‘లైఫ్’ మ్యాగజీన్ ఫొటోగ్రాఫర్ ఆ మెరుపును ఫొటో తీశాడు. యుద్ధంతో చితికిపోయి ఉన్న ప్రపంచ దేశాలకు ఈ చిన్నారి నవ్వు మళ్లీ ప్రాణం పోసింది. యుద్ధం ఓడిపోయింది. ఆరు కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న యుద్ధానికైనా... ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు - సిగ్గుతో చితికి చావడానికి.

రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అనాథ అయిన ఎంతో మంది బాలల్లో ఈ చిన్నారి ఒకడు. పేరు వెర్ఫెల్. దేశం ఆస్ట్రియా. అక్కడి యామ్ హిమ్మెల్ అనాథాశ్రమంలో ఇతడు పెరిగాడు. 1946 డిసెం బర్‌లో రెడ్‌క్రాస్ సంస్థ కానుకగా ఇచ్చిన కొత్త షూ జతను ఆ చిన్నారి పట్టలేని ఆనందంతో గుండెకు హత్తుకోవడం అక్కడున్న వాళ్లకు కన్నీళ్లు తెప్పించిందని ై‘లెఫ్’ పత్రిక రాసింది. ప్రపంచంలోని అరుదైన ఫొటోలలో ఇది ఒకటి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement