అనుకొన్నదొకటి! అయినదొకటి! | Sakshi Editorial on Russia Situation and Finland Sweden Ready to Join in NATO | Sakshi
Sakshi News home page

అనుకొన్నదొకటి! అయినదొకటి!

Published Wed, May 18 2022 12:09 AM | Last Updated on Wed, May 18 2022 12:11 AM

Sakshi Editorial on Russia Situation and Finland Sweden Ready to Join in NATO

అవును. ఉక్రెయిన్‌ విషయంలో రష్యాకు ఎదురైన అనుభవం ఇదే! పొరుగింటి ఉక్రెయిన్‌ ‘నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌’ (నాటో)కు దగ్గరవుతుండడంతో, భద్రతకు ముప్పు ఉందంటూ రష్యా యుద్ధానికి దిగింది. అమెరికా అగ్రాధిపత్య బాహువుల్లోకి పొరుగు దేశాలు చేరకుండా తమ సైనికచర్య అడ్డుకుంటుందని రష్యా భావించింది. తీరా అందుకు సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది. ఉక్రెయిన్‌ లొంగకపోగా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నుంచి తటస్థంగా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్‌ సైతం ‘నాటో’కు దగ్గరవుతున్నాయి. ఆ దేశాల ప్రకటనలు, వాటి సభ్యత్వానికి పెరుగుతున్న మద్దతు చూస్తే– రష్యా అభీష్టానికి భిన్నంగా ‘నాటో’ బలపడుతోందన్న మాట. యుద్ధాన్ని ఆపాల్సిన పాశ్చాత్య దేశాలేమో చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేయకపోగా, ఉక్రెయిన్‌కు మరింత ఆయుధ సంపత్తి తరలిస్తూ, అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. వెరసి, సులభంగా నివారించదగ్గ యుద్ధం ఓ అంతులేని కథగా, పలు ఆర్థిక పర్యవసానాలతో ప్రపంచానికి వ్యధగా మారింది. 

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు 2004 లోనే ‘నాటో’లో చేరాయి. 200 ఏళ్ళుగా సైనిక కూటములకు దూరంగా, తటస్థంగా ఉన్న స్వీడన్‌ సైతం ఇప్పుడు ‘నాటో’కు వెలుపల ఉంటే, రష్యా నుంచి భద్రతకు ముప్పనే పరిస్థితికి వచ్చింది. ఫిన్లాండ్, ఆ వెంటనే స్వీడన్‌ ‘నాటో’ వైపు మొగ్గడంతో కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనట్టు ఈ సైనిక కూటమి విస్తరిస్తోంది. నిజానికి, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ 2019లో ‘నాటో’ బ్రెయిన్‌డెడ్‌ అవుతోందని వ్యాఖ్యానించారు. ‘నాటో’ దేశాలకు రష్యా నుంచి రక్షణ అవసరమైతే ట్రంప్‌ సారథ్యం లోని అమెరికాను నమ్మలేమనే భయాల మధ్య ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. తీరా మూడేళ్ళలో పరిస్థితి మారిపోయింది. ‘నాటో’లోని 30 దేశాల్లో 8 మాత్రమే నిరుడు తమ జీడీపీలో 2 శాతాన్ని రక్షణకు ఖర్చు చేశాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాలన్నీ రక్షణ వ్యయాన్ని బాగా పెంచేశాయి. స్వీడన్‌ ప్రధాని అన్నట్టు – ఈ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టడానికి ముందు ‘నాటో’ వేరు. ఇప్పుడు వేరు. మాస్కోకు భయపడి ఏళ్ళ తరబడి చేతులు ముడుచుకు కూర్చున్న పొరుగు దేశాలు రెండూ రష్యాకు తగిలిన తాజా ఎదురుదెబ్బలతో ఇప్పుడు ధైర్యంగా రెక్కలు చాస్తున్నాయి.  

ఫిన్లాండ్, స్వీడన్‌ల చేరికతో బాల్టిక్‌ సముద్ర ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ‘నాటో’ బలం పెరుగుతుంది. అక్కడ రష్యా బలగాలకు కేంద్రమైన కలినిన్‌గ్రాడ్‌ దిగ్బంధమైనట్లవుతుంది. నిజా నికవి ఇప్పటి దాకా కూటమిలో చేరలేదన్న మాటే కానీ, సన్నిహిత భాగస్వాములుగా మెలిగాయి. కూటమిలో చేరిక వల్ల ఒప్పందంలోని 5వ ఆర్టికల్‌ కింద సభ్యదేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా, అన్నింటి పైనా జరిగినట్టే భావించి, ఇతర దేశాలన్నీ రక్షణకు కదలి వస్తాయి. అయితే, దీనికి కొన్ని బాలారిష్టాలు లేకపోలేదు. ‘నాటో’ సభ్యదేశమైన టర్కీ కొత్తగా ఈ రెండు దేశాలకు సభ్యత్వమివ్వ డాన్ని వ్యతిరేకిస్తోంది. తీవ్రవాద సంస్థలకు స్వీడన్‌ పెంపుడు కేంద్రమని ఆరోపిస్తోంది. కూటమి విస్తరణపై జర్మనీ, ఫ్రాన్స్‌లు ఆచితూచి మాట్లాడుతుంటే, రష్యాతో అనుబంధమున్న హంగరీ తన వైఖరి స్పష్టం చేయలేదు. అలాగని రష్యాను బలహీనపరచడానికి అంది వచ్చిన అవకాశాన్ని అమెరికా, దాని అనుంగు దేశాలు అంత తేలిగ్గా వదులుకోవు. అలా ‘నాటో’ బలోపేతం కావడానికి రష్యా పరోక్ష కారణమవుతోంది. ‘నాటో’ విస్తరణ ఇప్పటికే ఐరోపాలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది.

ఇన్ని రోజులుగా యుద్ధం చేస్తున్నా, ఉక్రెయిన్‌ గడ్డపై రష్యా ఘన విజయాలను నమోదు చేయలేకపోయింది. రాజధాని కీవ్‌ ఇప్పటికీ చేజిక్కలేదు. కీలకమైన ఖార్కివ్‌ పట్టణ శివారు ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించినా, గత వారం అక్కడ నుంచీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం డాన్‌బాస్‌ ప్రాంతంలో తన పట్టును విస్తరించడానికి చూస్తున్నా, ఉక్రెయిన్‌కు అందుతున్న అపార ఆయుధ సంపత్తితో అదెంత వరకు సాధ్యమో చెప్పలేం. ‘నాటో’ పైనా ఊహించినదానికి విరుద్ధంగా జరగడంతో, రష్యా తన స్వరం మార్చుకోక తప్పలేదు. ఫిన్లాండ్, స్వీడన్‌ల నిర్ణయం నేరుగా ముప్పు అనుకోవట్లేదని అనాల్సి వచ్చింది. కాకపోతే – ఆ దేశాల్లో గనక ‘నాటో’ మిలటరీ మౌలిక సదుపాయాలను విస్తరిస్తే, తప్పకుండా తగురీతిలో జవాబిస్తామని బింకం చూపింది. బాల్టిక్‌లో అణ్వస్త్రాలను మోహరిస్తామంటూ మాస్కో బెదిరిస్తోంది కానీ, అసలు యుద్ధమంతా సైబర్‌ దాడులు, తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారానే జరిగే సూచనలున్నాయట. 

మూడు నెలల క్రితం మొదలుపెట్టిన యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక రష్యా అస్తుబిస్తు అవుతుంటే, 1949లో ఆరంభమైన ‘నాటో’కూ కొన్ని సమస్యలున్నాయి. ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీ పట్ల అమెరికన్‌ పార్లమెంట్‌లో  భిన్నస్వరాలు వచ్చాయి. రష్యా నుంచి నాటో దేశాలను రక్షించేది లేదని గతంలో అన్న ట్రంప్‌ లాంటి వారెవరో ఈసారి దేశానికి 47వ అధ్యక్షులైతే ఇబ్బందే. గత నెల ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మరైన్‌ లీ పెన్‌ ఓడినా, ఐరోపాలో నాటో వ్యతిరేకత ఇంకా తగ్గనే లేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన ఇటలీలో సైతం ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపాలనీ, రక్షణ వ్యయం పెంచాలనీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అధిక శాతం ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే, రష్యాను అడ్డుకోవాలి అనుకుంటున్న ‘నాటో’ ముందుగా అంతర్గత బలహీనతలపైన దృష్టి పెట్టక తప్పదు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఉక్రెయిన్‌ పుణ్యమా అని ‘నాటో’ పునరుజ్జీవనం ఐరోపాలోనూ, ప్రపంచంలోనూ పెద్ద పరిణామమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement