Sakshi Editorial Telugu Special Story On NATO Members - Sakshi
Sakshi News home page

ఈ విస్తరణ మంచిదేనా?

Published Tue, Jul 18 2023 2:40 AM | Last Updated on Fri, Jul 21 2023 6:16 PM

Sakshi Editorial On NATO Members

అనేక సందర్భాల్లో ఆగి ఆలోచించడం, జరిగిన కథను సింహావలోకనం చేసుకోవడం అత్యవసరం. వివిధ దేశాల అంతర్‌ ప్రభుత్వ సైనిక కూటమి ‘నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌’ (నాటో) సభ్యులు గత వారం లిథువేనియాలో ఆ పనే చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి 500 రోజులు పూర్తయిన వేళ బాధితదేశానికి తామిస్తున్న ఆర్థిక, సైనిక సహకారాలను పరిశీలించడానికి సమావేశ మయ్యారు. ‘నాటో’లో స్వీడన్‌ చేరేందుకు టర్కీ, ఆ వెంటనే హంగరీ అంగీకరించడం తాజా సమా వేశంలోని కీలక పరిణామం.

అదే సమయంలో ఉక్రెయిన్‌ చేరికపై మాత్రం నిర్ణీత కాలవ్యవధి ఏదీ ఈ కూటమి ప్రతిపాదించ లేదు. అమెరికా అధ్యక్షుడు సాంత్వన వచనాలు పలికినా, ఇది ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీలో నిరుత్సాహం రేపింది. వెరసి, యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్‌ ఎదురుదాడి నిదానించిందేమో కానీ, ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన పాశ్చాత్య కూటమి బలోపేతమవుతోంది. రష్యాను చక్రబంధంలో ఇరికించే ప్రయత్నం నిరంతరాయంగా సాగుతోంది.

మొన్నటి దాకా స్వీడన్‌ చేరికను వీటో చేస్తూ టర్కీ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఎత్తివేతతో స్వీడన్‌కు ఇక అన్ని అవరోధాలూ తొలగిపోయినట్లే! అటు రష్యాతో సుదీర్ఘమైన సరిహద్దున్న ఫిన్లాండ్, అలాగే ఇటు బాల్టిక్‌ సముద్రంలోని కీలకమైన గాట్లాండ్‌ తన చేతుల్లో ఉన్న స్వీడన్‌... రెండూ నాటో వైపు మొగ్గడం రష్యాకు చీకాకు పెంచే విషయమే.

అసలైతే... ఫిన్లాండ్, స్వీడన్లు సాంప్రదాయికంగా సైనిక వ్యవహారాల్లో ఏ కూటమి వైపూ మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించినవే. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అవి తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. 2022 మేలోనే ఫిన్లాండ్‌తో పాటు స్వీడన్‌ కూడా సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంది. మొన్న ఏప్రిల్‌లో ఫిన్లాండ్‌ ‘నాటో’లో 31వ దేశ సభ్యదేశం కాగా, త్వరలోనే స్వీడన్‌ 32వది కానుందన్న మాట.

తాజా పరిణామాలతో ఒక విషయం అర్థమవుతోంది. బెలారుస్, ఉక్రెయిన్, జార్జియా మినహా పడమటి సరిహద్దులంతా ఇక నాటో బలగాల ఉనికితో రష్యా సర్దుకుపోక తప్పదు. అంతా అనుకు న్నట్టు జరిగి నాటో ఇలాగే విస్తరిస్తూపోతే, యూరోపియన్‌ ప్రపంచ భద్రతా వలయంలోనూ మరిన్ని మార్పులు తథ్యం. దశాబ్దాలుగా రక్షణ వ్యయంపై వైముఖ్యం ప్రదర్శించిన దేశాలు సైతం ఇప్పటికే తమ సైనిక సన్నద్ధతకు పదును పెట్టుకుంటున్నాయి.

‘నాటో’ను విస్తరించబోమంటూ సోవియట్‌ పతనకాలంలో వాగ్దానం చేసిన అమెరికా ఆ మాట తప్పి, ఉక్రెయిన్‌ను చేర్చుకొనేందుకు ఉత్సాహప డడమే సమస్యకు మూలమనేది రష్యా ఆరోపణ. నాటో విస్తరణతో తనకు భౌగోళిక, వ్యూహాత్మక ప్రమాదాలున్నాయనేది దాని వాదన. అందుకే కీవ్‌పై దాడికి తెగబడింది. ఈ రష్యా దురాక్రమణ వైఖరిని అటుంచితే దాని భయసందేహాలు సమంజసమే. ఆ సంగతి పాశ్చాత్యప్రపంచానికీ తెలుసు. 

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇటు పాశ్చాత్య ప్రపంచ ‘నాటో’ ఏర్పాటు, అటు దానికి ప్రతిగా సోవి యట్‌ యూనియన్‌ కూటమి ‘వార్సా’ ఒప్పందం గత చరిత్ర. సోవియన్‌ యూనియన్‌ విచ్ఛిత్తితో ‘వార్సా’నే రద్దయ్యాక, ఇప్పుడు నాటో ప్రాసంగికత, దాన్ని విస్తరించాలనే అమెరికా ఆకాంక్ష దేనికి చిహ్నమనేది కొందరి ప్రశ్న. అయితే, రష్యాతో యుద్ధం ముగిసేవరకు ‘నాటో’లో ఉక్రెయిన్‌ చేరిక అసాధ్యమే.

స్వీయభద్రత సాకుతో రష్యా దండెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు అధికారికంగా సభ్యత్వమిచ్చి, మరింత కోపం తెప్పించడం తెలివైన పని కాదు. అది పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయవచ్చు. అందుకే  పాశ్చాత్య లోకం కీవ్‌కు కావాల్సిన ఆర్థిక, సైనిక సహకారమిస్తూనే సాంకేతికంగా కూటమిలో చేర్చుకోకుండానే కథ నడిపించే పనిలో ఉంది. నాటో భేటీ అదే ధ్రువీకరించింది. 

మరోపక్క ఉక్రెయిన్‌పై దాడితో... నాటో వైపు చూస్తున్న పొరుగు దేశాలను దారికి తేవచ్చను కున్న రష్యా అధినేత పుతిన్‌ అంచనాలూ తప్పాయి. నాటోలో సంఘీభావాన్ని బలహీనపరచడం, రష్యా సరిహద్దుల వైపు నాటో మరింత విస్తరించకుండా ఆపడమనే లక్ష్యంలో ఆయన విఫల మయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు నాటోతో రష్యా భూ సరిహద్దు 754 మైళ్ళే. ఇవాళ అది 1584 మైళ్ళయింది. రేపు ఉక్రెయిన్‌ కూడా ఆ కూటమిలో చేరితే, అది మరింత పెరుగుతుంది.

పెనునష్టం తెచ్చిపెట్టిన యుద్ధంతో ఉక్రెయిన్‌ భూభాగంలో 17 నుంచి 18 శాతం రష్యా కలుపుకో గలిగింది. ఈ  కలుపుకొన్న కొద్ది ప్రాంతం సాంకేతికంగా లాభదాయకమే కానీ, అంతకన్నా విశ్వ వేదికపై వ్యూహపరంగా రష్యాకు జరిగిన నష్టమే అధికం. ఒక్కమాటలో పుతిన్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసు కున్నారు. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు తప్పవని తీవ్రంగా హెచ్చరించినా, ఇప్పటికే ఫిన్లాండ్, త్వరలోనే స్వీడన్‌ నాటోతో జట్టు కడుతున్నాయి. ఇక పుతిన్‌ ఏం చేస్తారో?  

వాస్తవానికి, ఉక్రెయిన్‌ యుద్ధంతో నిరంతర నాటో విస్తరణ రాజకీయ వ్యూహ అనివార్యతగా తయారైంది. కానీ, ఇది రెండంచులా పదునైన కత్తి. ఈ చర్య రష్యా పొరుగుదేశాలకే చేటు తేవచ్చు. నిత్యం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, వివాదాలు ఏదో ఒక సమయంలో యుద్ధానికి దారి తీయ వచ్చు. పొరపాటున అది ప్రపంచ యుద్ధమైనా ఆశ్చర్యం లేదు. నిర్ణీత ప్రాంతంలో భద్రత, సుస్థిరత కోస మంటూ సైనిక కూటములలో చేరుతున్నామంటారు.

తీరా ఆ కూటములు మరింత అస్థిరతకూ, భావి యుద్ధాలకు పునాదులు వేస్తున్నాయనిపిస్తుంది. నాటో విస్తరణతో ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా, ఐరోపా మాత్రం వ్యూహాత్మక సుస్థిరతను అందుకుంటున్న దాఖలాలైతే లేవు. పైపెచ్చు, అది దీర్ఘకాలిక అస్థిరత, నిరంతర అభద్రత వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అనుమానాల రీత్యా చూస్తే, నాటో సభ్య దేశాలు పెరగడం పాశ్చాత్య ప్రపంచానికి నిజంగా శుభప్రదమేనా అన్నది ప్రశ్న. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement