పాట్నా: బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి కొండచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి భగీరధ ప్రయత్నంతో బిహార్‌కు చెందిన మరో వ్యక్తి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు.
ఆయన పేరు లంగీ భుయాన్. బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి. వర్షాకాలంలో ఆ ఊరి సమీపంలో ఉన్న కొండలపై కురిసిన వాన నీరు వృథాగా పోవడం గమనించిన లంగీ భుయాన్‌కు ఒక ఆలోచన వచ్చింది. వర్షం నీరు వ్యర్థంగా పోకుండా కాలువ తవ్వాలనే ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా ఒక కాలువ తవ్వి కొండ దగ్గర నుంచి దానికి మార్గం వేయాలనుకున్నాడు. 30 ఏళ్ల క్రితం కొండ కింద నుంచి కాలువ తవ్వడం మొదలుపెట్టి ఇన్నాళ్లకు పూర్తి చేశాడు. 3 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ ఉన్న పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. ఇన్నేళ్ల లంగీభుయాన్ ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దీని గురించి భుయాన్ మాట్లాడుతూ, ఎంతోమంది ఉపాధి కోసం పట్టణాలకు వెళుతున్నారు. నేను మాత్రం గ్రామాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. ఈ 30 ఏళ్లలో కాలువ తవ్వుతుంటే నాకు సాయం చేసినవాళ్లే లేకుండా పోయారు. పశువులను మేత కోసం రోజు కొండ ప్రాంతానికి తోలుకొని వెళ్లేవాడిని, ఆ సమయంలో కాలువ తవ్వే పనులను చేసేవాడిని ’ అని తెలిపారు. లంగీభుయాన్ కాలువ తవ్వడంతో స్థానిక నేతలు, గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment