బినామీల ‘బడా’ దోపిడీ!
► రాజధాని గ్రామాల లేఔట్ల పనుల టెండర్లలో గోల్‌మాల్
► నెక్కల్లు, శాఖమూరు లేఔట్లలో మౌలిక సదుపాయాలకు రూ.666.18 కోట్లతో టెండర్
► బడా సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్
► బినామీలకు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడ
► మిగతా 27 గ్రామాల లేఔట్లకు రూ.13,500 కోట్లతో అంచనాలు సిద్ధం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం కింద కేటాయించిన ప్లాట్లకు మౌలిక సదుపాయాల పనులను బినామీలకు కట్ట బెట్టి భారీ ఎత్తున కమీషన్లు నొక్కేయడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. గుంటూరు జిల్లా నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు ఇచ్చిన లేఔట్(జోన్–1)లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.666.18 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ పద్ధతిలో ఈ నెల 5న సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులు సింగపూర్ కన్సార్టియం (అసెండాస్–సిన్‌బ్రిడ్జ్–సెమ్బ్‌కార్ప్), ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ వంటి బడా సంస్థలకే దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ఆ సంస్థలకు పనులు దక్కాక తమ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి, కమీషన్లు కొట్టేయాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగం. ఇదే రీతిలో మిగతా 27 గ్రామాల లేఔట్లకు మౌలిక సదుపాయాలను కల్పించే పనులను రూ.13,500 కోట్లతో చేపట్టి, కమీషన్లు దండుకోవడానికి వ్యూహం రచించారు. ఈ మేరకు అంచనాలు సిద్ధం చేసినట్లు సమాచారం.
రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలకు నివాస, వాణిజ్య స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం లేఔట్‌లు ఏర్పాటు చేసింది. ఉండవల్లి, పెనుమాక మినహా మిగతా 27 గ్రామాల రైతులకు లేఔట్లలో ఇప్పటికే ప్లాట్లు కేటాయించారు. ఆ లేఔట్లకు రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి కాలువలు, భూగర్భ విద్యుత్ లైన్లు, ఇంటర్నెట్ కేబుల్ లైన్లు, వరద నీటి కాలువలు, సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించా లని సర్కారు నిర్ణయించింది. తొలుత నెక్కల్లు, శాఖమూరు గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయిం చిన లేఔట్లకు మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్‌లోనే తిరకాసు
టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేవలం బడా కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు విధించారు. ఆ నిబంధనలు..
► 2007–08 నుంచి 2016–17 వరకూ ఇదే రకమైన (ఇండస్ట్రియల్ పార్కులు, టౌన్‌షిప్‌లు, సెజ్‌లు, ఐటీ పార్క్‌లు, రోడ్లు, ఎయిర్‌ఫీల్డ్స్, పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సరఫరా, సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లువంటి పనులు) ఏటా రూ.111.03 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి ఉం డాలి. జాయింట్ వెంచర్లలో ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన వారు ఇదే రీతిలో పనులు పూర్తి చేసి ఉండాలి.
► గత పదేళ్లలో ఏటా రూ.293 కోట్ల విలువైన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ఉండాలి.
► గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లపాటు వరుసగా లాభాలు గడించి ఉండాలి. బ్యాంకుల్లో రూ.74 కోట్ల నగదు నిల్వలు ఉండాలి.
► గత ఐదేళ్లలో సీడీఆర్ (కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చర్), ఎస్‌డీఆర్ (స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చర్) అమలు చేసి ఉండకూడదు.
► గత పదేళ్లలో ఏటా కనీసం రూ.12,420 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రహదారులు, సీసీ రోడ్ల పనులు చేసి ఉండాలి. వంద మీటర్ల వ్యాసార్ధంతో తాగునీరు, మురుగునీటి పైపులైన్ వ్యవస్థ ఏటా కనీసం 27.50 కి.మీ.లు వేసి ఉండాలి. 200 మీటర్లు, అంతకన్నా ఎక్కువ వ్యాసార్ధంతో కూడిన హెచ్‌డీపీఈ పైపులైన్ వ్యవస్థను ఏటా కనీసం ఎనిమిది వేల మీటర్లు వేసి ఉండాలి. విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ పనులు కనీసం 180 కి.మీ. పూర్తి చేసి ఉండాలి. ఏటా రోజుకు 3 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యంతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మించి ఉండాలి.
► గత పదేళ్లలో ఆర్థికమాంద్యం వల్ల నిర్మాణ రంగం కుదేలైపోయింది. దేశీయ కాంట్రాక్టు సంస్థలు ఎస్‌డీఆర్, సీడీఆర్ అమలు చేశాయి. భారీ ఎత్తున పనులు చేసిన దాఖలాలు లేవు. వీటిని పరిశీలిస్తే బడా సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్పష్టమవుతోంది.
నెక్కల్లు గ్రామ పంచాయతీ లేఔట్