![AP Cabinet Approves Bandaru Port DPR Tenders In Two Months - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/6/bandaru-port-dpr.jpg.webp?itok=iEsP8hv9)
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తొలిదశలో రూ.5,834.51 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం చేపట్టనుంది. రైట్స్ సంస్థ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈపీసీ విధానంలో రెండునెలల్లో టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్.రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తొలిదశలో మొత్తం ఆరుబెర్తులు (1 కోల్ బెర్త్, 1 కంటైనర్ బెర్త్, 4 జనరల్ కార్గో బెర్తులు) నిర్మించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం వద్ద సముద్రం లోతు తక్కువగా ఉండటంతో భారీనౌకలు వచ్చేవిధంగా 200 మీటర్ల వెడల్పు, 16.80 మీటర్ల లోతుతో 12.7 కి.మీ. దూరం అప్రోచ్ చానల్ తవ్వనున్నారు.
దీంతోపాటు దక్షిణ దిశ వైపు రెండువేల మీటర్లు, ఉత్తరం వైపు 260 మీటర్ల మేర మొత్తం 2.32 కి.మీ. బ్రేక్ వాటర్ పనులు, 44.81 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లు, ఇతర ప్రాజెక్టు నిర్మాణపనుల పర్యవేక్షణకు ప్రాజెక్టు కన్సల్టెంట్‌గా ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్)ను ఎంపిక చేశారు. 2 నెలల్లో టెండరు డాక్యుమెంట్లు తయారు చేసి, జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రామకృష్ణారెడ్డి వివరించారు. 2023–24 నాటికి ఏడాదికి 35.12 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించే విధంగా మౌలిక వసతులు కల్పిస్తారు. ఇందుకు 800 నుంచి వెయ్యి ఎకరాలు అవసరమవుతుంది. మరో 155 ఎకరాలు పోర్డు బేసిన్, డ్రెడ్జింగ్ కోసం వినియోగిస్తారు. మిగిలిన 2వేల ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల అవసరాలకు వినియోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment