టెండర్లలో గోల్‌ మాల్‌కు తెర | Fully Transparent Process In Tenders Through Judicial Preview In AP | Sakshi
Sakshi News home page

టెండర్లలో గోల్‌ మాల్‌కు తెర

Published Mon, Aug 31 2020 8:02 AM | Last Updated on Mon, Aug 31 2020 8:28 AM

Fully Transparent Process In Tenders Through Judicial‌ Preview In AP - Sakshi

సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అవుతోంది. రివర్స్‌ టెండర్లు, గత సర్కారు నిర్ణయాలపై పునఃసమీక్షల ద్వారా గతేడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు రూ.4 వేలకు కోట్లకుపైగా ఆదా కావడం దీన్ని రుజువు చేస్తోంది. గత సర్కారు హయాంలో ఏ టెండర్‌ ఎవరికి ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకుని వారికే దక్కేలా నిబంధనలు రూపొందించారు. కొన్నిసార్లు ఎలాంటి టెండర్లు పిలవకుండానే నామినేషన్‌పై అప్పగించారు. పరిపాలన అనుమతులు లేకుండానే నోటి మాటతో నామినేషన్‌పై ఆర్టీజీఎస్‌లో టెండర్‌ను అప్పగించారు. వీటికి పూర్తి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టెండర్‌ విధానాలను ప్రక్షాళన చేయడమే కాకుండా జ్యుడిషియల్‌ ప్రివ్యూ ద్వారా పూర్తి పారదర్శక విధానాన్ని అమల్లోకి
తెచ్చింది. 

ప్రివ్యూకు 45 ప్రాజెక్టులు..
► టెండర్ల ప్రక్రియలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిరోధం, పోటీతత్వం పెంపు, బిడ్డింగ్‌లో పారదర్శకంగా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర
ప్రభుత్వం గతేడాది జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టాన్ని తెచ్చింది. 
► గతేడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు 45 ప్రాజెక్టులకు సంబంధించి రూ.14,286 కోట్ల విలువైన పనుల టెండర్లను జ్యుడిషియల్‌
ప్రివ్యూకు ప్రభుత్వం పంపింది. రూ.100 కోట్లు, అంతకు మించిన పనులన్నీ జ్యుడిషియల్‌ ప్రివ్యూకు వెళ్తున్నాయి. 
► రివర్స్‌ టెండరింగ్‌తోపాటు గత సర్కారు నిర్ణయాలను సమీక్ష చేయడం ద్వారా
ఇప్పటివరకు రూ.4,000 కోట్లకుపైగా ప్రజాధనాన్ని ఆదా చేయగలిగారు. సాధారణ టెండర్‌లో 7.7 శాతం ప్రజాధనం ఆదా కాగా రివర్స్‌ టెండర్లకు వెళ్లడంతో 15.01 శాతం ఆదా కావడం గమనార్హం.
(చదవండి: కూలీల ‘ఉపాధి’నీ అడ్డుకుంటున్నారు..)

గత సర్కారు హయాంలో నామినేషన్‌పై రూ.13 వేల కోట్ల పనులు..
► గత ప్రభుత్వం నీరుచెట్టు పేరుతో అస్మదీయులకు ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై పందేరం
చేసింది. ఇందులో 90 శాతం నిధులను టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారు. పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీకి చెందిన రూ.180 కోట్ల విలువైన పనులను చంద్రబాబు చెప్పారంటూ
మాజీ ఆర్థిక మంత్రి బంధువుకు నామినేషన్‌పై ఇచ్చేశారు. 
► ఆర్టీజీఎస్‌లో పరిపాలన అనుమతి లేకుండా రూ.185 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టారు. 
► సీఆర్‌డీఏలో టెండర్లలో
గోల్‌మాల్‌కు అంతే లేదు. ఐదారుగురు కాంట్రాక్టర్లకు భారీగా అంచనాలు పెంచి అప్పగించారు.  

ఇప్పుడు పారదర్శకంగా టెండర్లు, పనులు..
► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫర్నీచర్‌తోపాటు
సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులకు కూడా టెండర్లను పిలవడమే కాకుండా రివర్స్‌ టెండరింగ్‌ను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 
► మన బడి నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి స్కూళ్లలో
ఫర్నీచర్‌తో పాటు గ్రీన్‌బోర్డులు, అల్మారాలకు కూడా టెండర్లను పిలవడమేగాక రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను చేపట్టారు.
రూ.కోటి విలువైన పనులతోపాటు కొనుగోళ్లు, సేవలకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 
(చదవండి: శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement