విజయనగరం మున్సిపాలిటీ: అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని సొంతిల్లు నిర్మించుకుకోవాలనే తపనతో రియల్ ఎస్టేట్లలో స్థలా లు(ప్లాటు) కొనుగోలు చేస్తున్న పేద, మద్య తరగతి ప్రజలు ఇప్పుడు పాట్లు పడుతున్నారు. ఏవి అధికారిక లే అవుట్‌లో..ఏవి అనధికారకంగా వెలిసిన లే అవుట్‌లో తెలియక కొనుగోలు చేసిన వారి పరిస్థితి ప్రస్తుతం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మా రింది. అనధికారికంగా వెలసిన లేవుట్‌లను నివారించి..సదరు యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయంలో చేతులెత్తేసి... ఆ లేవుట్‌లలో కొనుగోలు చేసిన భూముల్లో (ప్లాట్లలో) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమంటూ తెగేసి చెబుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లా పంచాయతీ శాఖ అధికారిక లెక్కల ప్రకారం అధికారికంగా వేసిన లే అవుట్‌లు 2463.76 ఎకరాల్లో 263 ఉండగా..అనధికారికంగా వేసిన లేవుట్‌లు 1955.06 ఎకరాల్లో విస్తీర్ణంలో 276 వరకు ఉన్నాయి. గత ఏడాది విజెలెన్స్ అధికారులు కేవలం డెంకాడ మండల పరిధిలో16 అక్రమ లే అవుట్‌లు గుర్తించి, వాటి ద్వారా రూ.12 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నట్లు తేల్చారు. ఈ ఒక్క మండలంలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడితే జిల్లా వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. వాస్తవానికే పంట భూములను లే అవుట్‌లుగా మార్చాలంటే ముందుగా సదరు ధృవపత్రాలు రెవెన్యూ డివిజనల్ అధికారికి ల్యాండ్ కన్వర్జేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
అందుకోసం లే అవుట్ మొత్తం విలువలో 9 శాతం ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. అలా ఆర్డీఓ కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్న తరువాత ఏ గ్రామ పంచాయతీలో లే అవుట్ వేస్తున్నారో సదరు పంచాయతీ అనుమతి పొందాలి. అనుమతి ఇచ్చే ముందు సదరు లే అవుట్‌లో ప్లాట్‌కు తగిన రహదారి, వీధి దీపాలు, నీటి సౌకర్యాలు ఉన్నాయా లేవా..అన్నది పరిశీలించిన అనంతరం ఆ లేవుట్‌లో 10 శాతం భూమిని పంచాయతీకి అప్పగించాలి. అయితే ఇవేవీ చేయకుండానే పలువురు యజమానులు లే అవుట్ వేయటంతో పాటు వాటిని విక్రయాలు జరిపి చేతులు దులుపుకు న్నారు. ప్రస్థుతం ఇటువంటి లే అవుట్‌లలో నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ శాఖ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలు అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
క్రిమినల్ చర్యలకు అవకాశం ఉన్నా ప్రయోజనం శూన్యంః
ఇలా ప్రజలను మభ్యపెట్టి అనధికారిక లే అవుట్‌లలో భూములు విక్రయించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఈ వ్యాపారం జిల్లాలో సాగుతుండగా.. అప్పట్లో అధికారుల ఉదాసీన వైఖరితో అటువంటి లే అవుట్‌ల వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదు. అనంతర కాలంలో నిబంధనలకు విరుద్ధమైన లే అవుట్‌లో భూములు కొనుగోలు చేశామని కోనుగోలు దారులు గుర్తించి లోకాయుక్తను ఆశ్రయించగా.. సదరు కమిషనర్ అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే అనధికారిక లే అవుట్‌ల యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు ప్రారంభించగా... వారి అడ్రస్‌లు సక్రమంగా లేక ఆ నోటీసులు అందకుండా పోయాయి.
జిల్లాలో వందల సంఖ్యలోనే అక్రమ లేవుట్‌లు
జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లే అవుట్‌లపై అటు ఉడా అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఏళ్ల తరబడి దృష్టి సారించిన దాఖలాలు లేవు.లేవుట్‌లు 1955.06 ఎకరాల్లో విస్తీర్ణంలో 276 వరకు ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే ఆసరాగా తీసుకుంటున్న అక్రమార్కులు కొద్ది పాటి భూమిని కొనుగోలు చేసి పక్కనే ఉన్న ప్రభుత్వ బంజరు భూములు, చెరువులు, గుంతలను కలుపుకుని లే అవుట్ వేసేస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధనల మేరకు లే అవుట్‌లో పది శాతం భూమిని అప్పగించకుండా, కన్వర్షన్ రుసుం చెల్లించకుండా లే అవుట్‌లు వెలుస్తున్నాయి. ఇవేవీ తెలియని ప్రజలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా డబ్బులు ఉన్నప్పుడే రెండు ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే మంచిదన్న ఆత్రుతతో వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అక్రమ లే అవుట్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
అనుమతులిచ్చేది లేదు
అనధికారిక లే అవుట్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారికి భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేది లేదు. అది నిబంధనలకు విరుద్ధం. అనధికారిక లే అవుట్‌లు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుందామంటే వారెక్కడున్నారో తెలియని పరిస్థితి. గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.
-ఎస్.సత్యనారాయణరాజు,
జిల్లా పంచాయతీ అధికారి. విజయనగరం.
ప్లాటు పాట్లు
Published Fri, Feb 26 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement
Advertisement