చెయ్యాలా?మానాలా? | layout permission go12 | Sakshi
Sakshi News home page

చెయ్యాలా?మానాలా?

Published Thu, Nov 3 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

చెయ్యాలా?మానాలా?

చెయ్యాలా?మానాలా?

పంచాయతీల పరిధిలో అనేక అనధికారిక లే అవుట్లు 
క్రమబద్ధీకరణకు ఫిబ్రవరిలోనే జీఓ నం: 12 విడుదల
స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని ప్రభుత్వం
ఆ ప్రక్రియకు జంకుతున్న పలువురు కార్యదర్శులు
క్రమబద్ధీకరిస్తున్న చోట దళారుల హవా
మండపేట : ‘తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావం’డన్న చందాన ఉంది సర్కారు తీరు. పంచాయతీల పరిధిలోని అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు జీఓ నం: 12 విడుదల చేసిన ప్రభుత్వం.. అందుకు అవసరమైన మార్గదర్శకాలపై స్పష్టతను విస్మరించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఏం చేయా లో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రమబద్ధీకరిస్తే ఏం కొంప మునుగుతుందోనని అధికశాతం మంది కార్యదర్శులు వెనుకడుగేస్తుండగా, కొందరు కార్యదర్శులు ధైర్యంగా క్రమబద్ధీకరణ చేసేస్తున్నారు. ఇదే అదనుగా దళారులు స్థలయజమానుల నుంచి కాసులు దండుకుంటున్నారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
జిల్లాలో 604 అనధికారిక లే అవుట్లు
లే అవుట్లు వేసేటప్పుడు నిబంధనల మేరకు 33 అడుగుల రోడ్డు, 10 శాతం కామన్‌ సైట్‌లను పంచాయతీకి రిజిస్ట్రేషన్‌  చేయించాలి. రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌ సదుపాయం యాజమాన్యమే కల్పించాలి. నిబంధనల అతిక్రమణ జరిగిన లేఅవుట్లను అనధికారిక లే అవుట్లుగా గుర్తిస్తారు. జిల్లావ్యాప్తంగా 604 అనధికారిక లేఅవుట్లు ఉన్నాయి. రాజమండ్రి డివిన్లోలో 156, కాకినాడ డివిజన్లో 177, అమలాపురం డివిజన్లో 170, పెద్దాపురం డివిజన్లో 101 అనధికారిక లేఅవుట్లను గుర్తించారు. పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు కల్పించేందుకంటూ అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఫిబ్రవరిలో ప్రభుత్వం జీఓ నం:12ను విడుదల చేసింది. అనధికారిక లే అవుట్లలో రిజిస్ట్రేష¯ŒSశాఖ నిర్ధారించిన విలువలో 14 శాతం అపరాధ రుసుముగా వసూలు చేయవచ్చని సూచించింది. నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాణాల స్థాయిని బట్టి అపరాధ రుసుం వసూలు చేయాలని, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో మాస్టర్‌ ప్లాన్‌ కు రూ.ఐదు వేల వరకు, తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.మూడు వేల వరకు ఫీజు వసూలు చేయొచ్చంది.
లిఖితపూర్వక ఆదేశాలు కరువు..
కాగా 14 శాతం అపరాధ రుసుము వసూలు చేసిన లే అవుట్లలో రోడ్ల విభజన తదితర నిబంధనల అమలుపై స్పష్టత లేకపోవడం, లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులు సూచనలు చేయకపోవడం కార్యదర్శులను అయోమయానికి గురిచేస్తోంది. పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌ తదితర వసతులు కల్పించాల్సి ఉండటంతో ఈ అపరాధ రుసుం సరిపోక పోగా పంచాయతీకి అదనపు భారం పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఓ ప్రకారం చేయమని సూచించడమే తప్ప లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడం లేదని కార్యదర్శులంటున్నారు. జీఓలో స్పష్టత లేకపోవడంతో తర్వాత ఏం ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళనతో క్రమబద్ధీకరణకు ఎక్కువమంది కార్యదర్శులు ముందుకు రావడం లేదు. 
భారీగా దళారుల వసూళ్లు, అధికారులకు వాటాలు..
జిల్లాలో కొందరు కార్యదర్శులు మాత్రం14 శాతం అపరాధ రుసుంతో క్రమబద్ధీకరణ చేసేస్తున్నారు. మండపేట, అనపర్తి, రాజమండ్రి రూరల్‌ తదితర ప్రాంతాల్లో పలు లే అవుట్లను క్రమబద్ధీకరించినట్టు సమాచారం. ఇదే అదనుగా దళారులు క్రమబద్ధీకరణ చేయిస్తామంటూ లే అవుట్లలోని స్థలాలు కొన్న వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోం ది. జీఓపై స్పష్టత ఇవ్వడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఇన్‌ చార్జి డీపీఓ పద్మను వివరణ కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement