60 ఏళ్లలో ఎత్తుపల్లాలెన్నో..
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
గాడ్ ఫాదర్స్ లేరు... వారసత్వం అంతకన్నా లేదు. అయినా ఒక్కో పునాది రాయి వేసుకుంటూ స్వయంకృషితో పైకెదిగి మెగాస్టార్ గా నీరాజనాలు అందుకున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. తర్వాత రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలు చూసిన కొణిదెల శివశంకర వరప్రసాద్ నేటితో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రస్థానం
చెన్నైలోని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో 'పునాది రాళ్లు' సినిమాలో తొలిసారి నటించాడు. కానీ 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది. 'పసివాడి ప్రాణం' చిత్రంలో తొలిసారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేశాడు. 2007 నుంచి అంటే ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు చిటికేసినా.. స్టెప్పులు వచ్చేస్తాయని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' సినిమాతో చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నాడు. అనంతరం గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. బప్పీలహరి అందించిన సంగీతానికి చిరంజీవి స్టెప్పులు తోడవడంతో గ్యాంగ్ లీడర్ బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది.
తారస్థాయికి..
9వ దశకం చివరిలో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని ఉంది' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. 2002లో ఇంద్ర, 2003లో ఠాగూర్ సినిమాలు తారాపథంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లాయి. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. అనంతరం వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిట్ టాక్ వచ్చినా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ హీరోగా చిరంజీవికి చివరి చిత్రం. ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కానీ, ఏ పుట్టిన రోజున కూడా తన సినిమా విడుదల కాలేదు.
రాజకీయ రంగప్రవేశం
2008 ఆగస్టు 26న తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరు (ప్రజారాజ్యం), పతాకాన్ని ఆవిష్కరించారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణమైన ఫలితాలు చూసింది. 294 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా.. కేవలం 18 చోట్ల మాత్రమే గెలవగలిగారు. స్వయంగా చిరంజీవి కూడా రెండుచోట్ల పోటీ చేసినా, ఒకచోట.. అదీ తన సొంత జిల్లా పశ్చిమగోదావరిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2011 ఫిభ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ ఆ స్థాయి ప్రభావాన్ని రాజకీయాల్లో మాత్రం చూపించలేక పోయాడు.
కథను బట్టే డైరెక్టర్
చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా 150వ సినిమా ప్రకటన వస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పూరీ చెప్పిన ఆటోజానీ కథలో సెకండ్ హాఫ్ తనకు నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపాడు. కథను బట్టే డైరెక్టర్ తప్ప.. దర్శకుడిని బట్టి కథ కాదన్నాడు.
సత్కారాలు
2006 జనవరిలో భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మభూషణ్ పురస్కారం.. అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 1998, అక్టోబర్ 2న 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న సేవా సౌకర్యాలు. నాలుగేళ్లు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందుకొన్నాయి.
-దివిటి రాజేష్.