
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఎంత..? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్‌లోనూ విడుదల కానుంది.
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్ వండర్ వెనక చాలామంది ఛాంపియన్స్ ఉన్నారు. ఇళయరాజా అందించి ట్యూన్స్, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్, డీఓపీ విన్సెంట్, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్ , ఓ హిస్టారికల్ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.
మే 9న రీ-రిలీజ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు. ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి.