త్రీడీలో జగదేక వీరుడు... అతిలోక సుందరి | Megastar Chiranjeevi Jagadeka Veerudu Athiloka Sundari Movie Re Release In 3D Print, Deets Inside | Sakshi
Sakshi News home page

త్రీడీలో జగదేక వీరుడు... అతిలోక సుందరి

May 6 2025 12:31 AM | Updated on May 6 2025 12:03 PM

jagadeka veerudu athiloka sundari movie re release in 3d print

జగదేక వీరుడు... అతిలోక సుందరి ఈసారి త్రీడీలో కనిపించి, అలరించనున్నారు. 1990లో ఈ ఇద్దరూ చేసిన సందడిని అప్పటి ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. నేటి తరం ప్రేక్షకులనూ ఈ ఇద్దరూ ఆకట్టుకుంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ 1990 మే 9న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించింది. ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు.

2డీ ఫార్మాట్‌తోపాటు 3డీలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయాలని  దాదాపు ఏడేళ్ల క్రితమే అనుకున్నారట. 2018లో ఈ చిత్రం నెగటివ్‌ రీల్‌ కోసం వెతకడం మొదలుపెట్టిందట చిత్రనిర్మాణ సంస్థ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏదైనా థియేటర్లో ఈ రీల్‌ ఉందేమో అని వాకబు చేశారు. కొన్ని చోట్ల లభ్యమైనా నాణ్యత లోపించింది. చివరికి  2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్‌ రీల్‌ ఒకటి దొరికిందని చిత్రబృందం పేర్కొంది. అయితే అది కూడా దుమ్ము... దూళితో నిండిపోయి మసకబడిపోయిన స్థితిలో ఉండగా.. చిత్రయూనిట్‌ ఎంతో కష్టపడి పునరుద్ధరణ ప్రారంభించింది. 

రీల్‌ కట్‌ అయిన చోట మరమ్మతు చేసి, జాగ్రత్తగా స్కాన్‌ చేయించి, ఫ్రేమ్‌ వారీగా ఉన్న డిజిటల్‌ స్క్రాచెస్‌ను తొలగించారు. తర్వాత ఈ చిత్రాన్ని 8కె రెజల్యూషన్ లో డిజిటలైజ్‌ చేసి, 4కె అవుట్‌పుట్‌గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, ఈ చిత్రాన్ని 3డీ రూపంలోకి మార్చే సాహసం చేశామని యూనిట్‌ అంటోంది. ప్రసాద్‌ కార్పొరేషన్‌ సహకారంతో, ప్రైమ్‌ ఫోకస్‌ సాయంతో 3డీలోకి మార్చారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నాటి తరంలో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు, ఈ తరం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఈ చిత్రాన్ని పునరుద్ధరించారు. అన్నట్లు... ఈ చిత్రాన్ని ఈ విధంగా మలచడానికి ‘మహానటి, కల్కి’ చిత్రాల ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కృషి చాలా ఉందని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement