
ముంబై: భారత క్రికెట్ జట్టుకు తాజాగా కరోనా సెగ తగిలింది. ఆటగాడికి కాకపోయినా... సహాయ సిబ్బందిలో ఒకరికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ఇదివరకు ఐపీఎల్‌లో కరోనా కేసులున్నాయి. కానీ టీమిండియా, సిబ్బందికి సంబంధించి మాత్రం ఇదే తొలి మహమ్మారి కేసు. దీంతో కరోనా బాధితుడు రవిశాస్త్రి బృందంతో పాటు దుబాయ్‌కి వెళ్లలేదు. ఆదివారం అక్కడికి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 సోకడంతో ‘అతడు’ 14 రోజుల క్వారంటైన్‌కు పరిమితమయ్యాడు. చికిత్స, రెండు వారాల ఐసోలేషన్ ముగిశాక నెగెటివ్ రిపోర్టు వస్తేనే అతడిని దుబాయ్ విమానం ఎక్కిస్తారు. (చదవండి: నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి)
దుబాయ్‌లో రవిశాస్త్రి...
ఆసీస్ పర్యటన కోసం భారత జట్టు ఐపీఎల్ ముగిసిన వెంటనే అక్కడి నుంచే ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, మేనేజర్ గిరీశ్ డోంగ్రేలతో పాటు టెస్టు స్పెషలిస్టులు హనుమ విహారి, చతేశ్వర్ పుజారా ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. తాజాగా వీరికి కోవిడ్ పరీక్షలు, ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో బయో బబుల్‌లోకి తీసుకున్నారు. పుజారా, విహారిలకు దుబాయ్‌లో ఉన్న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తారు. కొందరు ఆటగాళ్లు సుదీర్ఘ పర్యటన కోసం తమ భార్యలను వెంటతీసుకు వెళ్లేందుకు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు నెలలుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉండటంతో వారిని దుబాయ్‌కి రావాల్సిందిగా పలువు రు ఆటగాళ్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. (చదవండి: భారత టెస్టు స్పెషలిస్ట్‌లు దుబాయ్‌కి)