భారత్‌కు గాయాల బెడద!
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించాడు. కీలకమైన ఓపెనింగ్ స్థానంలో ఆడుతూ అతను పదే పదే విఫలం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపిస్తోంది. మరి ముక్కోణపు వన్డే సిరీస్‌లో అతడిని పక్కన పెట్టవచ్చు కదా అనేది సగటు అభిమాని భావన. కానీ టీమిండియాలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక వైపు ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండగా, మరో వైపు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేకపోవడం కూడా ధోని సేనకు ఇబ్బందిగా మారింది.
ఇషాంత్ సాధన, రోహిత్ డుమ్మా
భారత జట్టు తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో సోమవారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఒక రోజు విశ్రాంతి తర్వాత శుక్రవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ముగ్గురు మినహా దీనికి ఆటగాళ్లంతా హాజరయ్యారు. రోహిత్ శర్మ, కోహ్లి, అశ్విన్ సాధన చేయలేదు. తొడ కండరాల గాయంతో ఇంకా కోలుకోకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్‌కు రాలేదు.
తొలి వన్డేలో చక్కటి సెంచరీతో విదేశీ గడ్డపై కూడా ఓపెనింగ్‌లో చెలరేగగలడని నిరూపించుకున్న రోహిత్... తర్వాతి మ్యాచ్‌కే దూరమయ్యాడు. అతను ఎప్పటికి ఫిట్‌గా మారతాడో ఇంకా చెప్పలేని పరిస్థితి. మోకాలి నొప్పితో నాలుగో టెస్టు ఆడని ఇషాంత్... ఆ తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సాధన చేయలేదు. ప్రస్తుతం ప్రపంచ కప్ జట్టులో నలుగురు ప్రధాన పేసర్లు మాత్రమే ఉండటంతో అతను త్వరగా కోలుకోవడం జట్టుకు అవసరం.
జడేజా కూడా...
గత ప్రపంచ కప్‌కు, ఈ సారి టోర్నీకి మధ్య భారత జట్టులో ఎంతో ఎదిగిన ఆటగాడు రవీంద్ర జడేజా. వన్డేల్లో ఏడో స్థానంలో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవల కెప్టెన్ ధోని కూడా అవసరం ఉన్నా, లేకపోయినా జడేజా గురించే మాట్లాడుతూ, అతను లేకపోవడం జట్టుపై ప్రభావం చూపిస్తోందంటూ పదే పదే అతడి ప్రాధాన్యతను గుర్తు చేస్తూ వస్తున్నాడు.
భుజం గాయంతో చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతను శుక్రవారం కొద్దిగా ఎక్కువ సేపు బౌలింగ్ చేయగలిగాడు. అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు. ప్రస్తుత జట్టులో రాయుడు ఒక్కడే రిజర్వ్ బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉన్నాడు. గత మ్యాచ్‌లో అతడిని ఆడించారు. ఒక వేళ ధావన్‌ను తప్పించాలని భావించినా, మరో అవకాశం లేదు. జడేజా వస్తే పరిస్థితిలో మార్పు రావచ్చు. రోహిత్ ఫిట్‌గా లేకపోతే సోమవారం మ్యాచ్‌లో కూడా ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.