సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్‌లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు.
క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్‌కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు.
Comments
Please login to add a commentAdd a comment