online dating
-
హస్తినలో ‘అమర’ ప్రేమికుడు!
ఏడాది కింద మొదలైన ఆన్లైన్ పరిచయం ప్రేమకు దారితీసింది. కానీ చిన్న వివాదం ఈ ప్రేమ కథలో అంతులేని విషాదం మిగిలి్చంది. రోమియో, జూలియట్ తరహా ఉదంతానికి ఢిల్లీ వేదికగా నిలిచింది. పట్టరాని ఆగ్రహంతో ప్రాణాలు తీసుకోబోయిన ప్రేమికురాలిని కాపాడబోయి ప్రేమికుడు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు ఢిల్లీలోని జగత్పురీలో 23 ఏళ్ల అరుణ్ నందాకు ఏడాది క్రితం ఆన్లైన్లో ఒకమ్మాయి పరిచయమైంది. లా స్టూడెంటైన ఆ అమ్మాయికి చదువంటే ప్రాణం. నిత్యం పారీ్టలు, స్నేహితులంటూ తిరిగే అరుణ్‌కు, ఆమెకు ఇటీవల చిన్నపాటి మనస్పర్థలొచ్చాయి. శుక్రవారం రాత్రి అరుణ్ బంధువుల్లో ఒకరు ఆ అమ్మాయితో గొడవకు దిగారు. దీన్ని అవమానంగా భావించి ఆమె ఇంటికెళ్లి కత్తితో మణికట్టు కోసేసుకుంది. అందులోంచి చిమ్ముతున్న రక్త ధారలను వీడియో తీసి వాట్సాప్‌లో అరుణ్‌కు షేర్ చేసింది. అది చూసి అరుణ్ హుతాశుడయ్యాడు. ప్రేమికురాలు రక్తపుమడుగులో పడుంటంతో ఆమె తల్లికి ఫోన్ చేసి అప్రమత్తంచేశాడు. వెంటనే వాళ్ల ఇంటికెళ్లి ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాడు. వైద్యులు, నర్సులకు విషయం చెప్పి ఆమెనెలాగైనా బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. ఈ క్రమంలో నర్సుతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్యులు స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చేలోపే అరుణ్ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. మధ్యలో స్పృహలోకి వచ్చి కూడా, ‘ఆమెను కాపాడండి. లేదంటే చనిపోతుంది’ అంటూ ప్రాధేయపడ్డట్టు సిబ్బంది చెప్పారు! గుండెపోటుతోనే అతను మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రేమికురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. – న్యూఢిల్లీ -
ఆసీస్‌లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్‌కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు. -
వార్నీ! సొంత తండ్రితోనే సినీ నటుడి ఆన్లైన్ డేటింగ్..
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు, దర్శకుడు జేమ్స్ మోరొసినికి వింత సమస్య వచ్చి పడింది. ఆయన గత కొన్ని రోజులుగా ఫేస్బుక్లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా 31 ఏళ్ల జేమ్స్ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది. అభిరుచులు, అలవాట్లు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్లైన్ డేటింగ్‌కు దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో మనోడు డేటింగ్, చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్తున్నవాటితో సరిపోలడంతో అతనికి డౌట్కొట్టింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్లైన్లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు. అయితే, తన తండ్రి ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్‌తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కుదుటపడ్డాడు. (చదవండి: మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్లైన్ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. ఆన్లైన్ యుగంలో సైబర్ నేరాలకు కొదవే లేకుండా పోయింది. గుడ్డిగా నమ్మి మోసపోయినవారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల డిజిటల్ వ్యవహారాలపట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా! (చదవండి: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు!) -
మొదట డేటింగ్..ఆపై ఇంటికి రప్పించుకుని.. నగ్నంగా మార్చి..
న్యూఢిల్లీ: ఆన్లైన్లో డేటింగ్ పేరిట పురుషులను ట్రాప్ చేసి, ఆపై వారిని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న కిలాడీలను కటకటాల వెనక్కి నెట్టారు ఢిల్లీ పోలీసులు. ఈ డేటింగ్ బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో చోటుచేసుకుంది. తాజాగా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మహిళను ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిందితులు మొదట ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా బాధితులతో స్నేహం చేసి, తర్వాత వారిని తమ ఇంటికి రప్పించుకుంటారు. అలా వచ్చని వారికి మత్తుమందు కలిపిన నీరు లేదా కూల్‌డ్రింక్స్ ఇస్తారు. అది తాగి స్పృహ కోల్పోయిన తరువాత వారిని మహిళతో చనువుగా ఉన్నట్లు ఫోటోలు తీయడంతో పాటు అభ్యంతకరమైన ఫోటోలు తీసి బెదిరింపుల పర్వాన్ని మొదలుపెడతారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ వ్యాపారికి ప్లై బోర్డు కావాలని ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది. దీంతో అతను అక్టోబర్ 21న జనక్‌పురి ప్రాంతంలోని నిందితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తాగడానికి ఒక గ్లాసు మంచినీరు ఇవ్వగా దాన్ని తాగిన వెంటనే అతను స్పృహతప్పి పడిపోయాడు. వ్యాపారి స్పృహలోకి వచ్చినప్పుడు నగ్నంగా మంచం మీద ఉన్నాడు. కళ్లు తెరచి చూడగా చూట్టూ ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతనిపై దాడి చేసి, తన వద్ద ఉన్న సుమారు 16 వేల రూపాయల నగదు, చేతి గడియారం, బంగారు ఉంగరం లాక్కున్నారు. అంతే కాకుండా మరో రూ.7 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి తాము కొన్ని ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. గత రెండేళ్లలో ఈ ముఠా దాదాపు 40 మంది పురుషుల నుంచి విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. చదవండి: భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం -
లవ్ ఆర్ట్స్ పేరుతో కాల్ సెంటర్.. డేటింగ్ ఆఫర్స్
సాక్షి, సిటీబ్యూరో: ఎదుటివారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుంటూ ఆన్లైన్లో డేటింగ్ సైట్ పేరుతో రిజిస్టర్ చేయడంతో పాటు ఫోన్‌కాల్స్ ద్వారానూ ఎర వేసి, బెదిరింపులకు పాల్పడి, అందినకాడికి దండుకుంటున్న ముఠా గుట్టును సిటీ సైబర్ క్రైమ్‌పోలీసులు రట్టు చేశారు. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న కాల్ సెంటర్‌పై దాడి చేసిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో 16 మంది నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన సోమ రోక అక్కడ ‘లవ్ ఆర్ట్స్’ పేరుతో ఓ కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో అర్నబ్‌సూర్ డెవలపర్‌గా, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్ డెవలపర్‌గా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు మరో 16 మంది యువతులను టెలీ కాలర్స్‌గా నియమించుకున్నారు. వీరికి నెలవారీ జీతాలు చెల్లిస్తూ ఫోన్లు చేయించడం, వచ్చిన కాల్స్‌ను రిసీవ్ చేసుకుని మాట్లాడటం వంటి బాధ్యతలు అప్పగించారు. వీరు పాటించాల్సిన అంశాలకు సంబంధించి ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) సైతం సోమ ఏర్పాటు చేసింది. వీళ్లు ఆన్లైన్ డేటింగ్ సర్వీస్ ఇస్తామంటూ ఇంటర్నెట్లో పొందుపరిచారు. దీంతో పాటు వివిధ మార్గాల్లో పలువురి సెల్‌ఫోన్ నెంబర్లు సంగ్రహించి కాల్స్ చేస్తున్నారు. ఈ ఫోన్లకు స్పందించిన వారితో పాటు ఆన్లైన్లో తమ నెంబర్లు చూసి కాల్ చేసిన వారితోనూ టెలీకాలర్స్ మాట్లాడతారు. తాము ఆన్లైన్లో డేటింగ్ సేవలు అందిస్తామంటూ చెప్తారు. అవతలి వ్యక్తులు ఆసక్తి చూపితే వారి నుంచి ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1025 ఆన్లైన్లో కట్టించుకుంటున్నారు. ఆపై తాము ప్లాటినం, గోల్డ్, సిల్వర్ పేర్లతో స్కీములు నిర్విహిస్తున్నామని చెప్తారు. రూ.3500 కట్టి సిల్వర్ స్కీమ్‌లో చేరితే యువతులతో చాటింగ్ చేసే అవకాశం, రూ.5500 కట్టి గోల్డ్‌లో చేరితో చాటింగ్‌తో పాటు ఫోన్‌కాల్స్, రూ.10,500 కట్టి ప్లాటినం స్కీములో సభ్యుడిగా మారితే ఆయా యువతుల్ని కలిసే అవకాశం కూడా ఉంటుందని ఎర వేస్తున్నారు. ఈ మొత్తాలు కట్టడానికి సిద్ధమైన వారికి బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తి నుంచి ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఫొటో, చిరునామా అందించాలని కోరి...అలా చేస్తే మీరు నివసించే ప్రాంతానికి సమీపంలో ఉండే యువతి ఫోన్ నెంబర్లు ఇస్తామంటూ చెప్తున్నారు. స్కీముల్లో చేరి, డబ్బుకట్టి, కోరిన వివరాలు పంపిన వారికి కొన్ని ఫోన్ నెంబర్లు సైతం పంపిస్తున్నారు. వాస్తవానికి ఇవి తమ కాల్సెంటర్లో పని చేసే టెలీకాలర్ల వద్దే ఉంటాయి. ‘కస్టమర్లు’ ఫోన్/చాటింగ్ చేసినప్పుడు మాత్రం తమ వద్ద ఉన్న డేటా బేస్ ఆధారంగా వారు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసుకుంటారు. దీని ఆధారంగా తాము ఆ సమీపంలో ఉంటామని చెప్పి నమ్మించి మాట్లాడటం, చాటింగ్ చేయడం చేస్తూ పూర్తిగా బుట్టలో పడేస్తున్నారు. ఆపై మళ్లీ సంప్రదించే టెలీకాలర్లు ఈసారి తాము ఇన్కమ్, ఎంజాయ్ పేర్లతో రెండు గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. నిర్ణీత మొత్తం చెల్లించి వీటిలో చేరవచ్చని... ఇన్కమ్లో చేరితో అవతలి వ్యక్తుల్ని కలిసి అవకాశం ఉన్నప్పుడు వారి నుంచి డబ్బు సైతం తీసుకోవచ్చని, అలా వచ్చిన మొత్తంలో 20 శాతం తాము తీసుకుని 80 శాతం ఇస్తామని చెప్తున్నారు. ఎంజాయ్ గ్రూప్‌లో కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇదంతా అయ్యాక ఆ కాల్‌సెంటర్ నిర్వాహకులు అసలు కథ మొదలు పెడుతున్నారు. వీరే కస్టమర్ల వివరాలను వివిధ రకాలైన డేటింగ్ వెబ్‌సైట్స్‌లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత కాల్‌సెంటర్ నుంచే తాము పోలీసులమని కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారు. ఫలానా సైట్లో మీ పేరు రిజిస్టరై ఉందని, అది నేరం కావడంతో కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలంటూ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తమ బలహీనత బయటపడి పరువు పోతుందనే ఉద్దేశంతో అనేక మంది బాధితులు తాము మోసపోయామన్న విషయాన్నీ బయటకు చెప్పుకోవట్లేదు. ఈ పంథాలో సోమ అండ్ గ్యాంగ్ నగరానికి చెందిన ఒకరి నుంచి రూ.1.2 లక్షలు, మరొకరి నుంచి రూ.12 వేలు కాజేశారు. వీరి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. దారుణంగా మోసాలు చేస్తున్న ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి నిర్ణయించుకున్న అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్లు ఎన్.మోహన్‌రావు, గంగాధర్‌లతో కూడిన బృందం కోల్‌కతా వెళ్లి కాల్‌సెంటర్‌పై దాడి చేసింది. సోమ, అర్నబ్‌సూర్, ఇమ్రాన్‌లను అరెస్టు చేసింది. టెలీకాలర్స్‌గా పని చేస్తున్న మరో 16 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ కాల్‌సెంటర్ టర్నోవర్ నెలకు రూ.50 లక్షల వరకు ఉందని, ఇలాంటి సెంటర్లు అక్కడ అనేకం ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించడానికి వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలు వేరే వారి పేర్లతో, బోగస్ వివరాలతో ఉంటున్నాయని చెప్తున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల్నీ కోల్కతాలోకి కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
డేటింగ్ పేరుతో ‘డ్యాష్’
సాక్షి,సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు నగర యువకుడికి డేటింగ్ పేరుతో ‘డ్యాష్’ ఇచ్చారు... ఓ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో యువతితో ఫోన్ చేయించి ఎర వేశారు... వివిధ దఫాల్లో మొత్తం రూ.4.08 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సోమవారం ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్‌పల్లికి చెందిన అభిషేక్ ఉద్యోగం కోసం ఆన్లైన్లో అనేక వెబ్సైట్లను పరిశీలిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి కన్ను డ్యాషీడేటింగ్.ఇన్ వెబ్‌సైట్‌పై పడింది. ఆ సైట్లోకి ప్రవే«శించిన అతను తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి సెల్‌కు ఓ మహిళ కాల్ చేసి తన పేరు పూనంగా పరిచయం చేసుకుంది. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నందున రూ.1000 తమ ఖాతాలో డిపాజిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆపై డేటింగ్‌కు అవకాశాలు వస్తాయని చెప్పింది. దీంతో అభిషేక్ ఆమె చెప్పిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశాడు. ఆపై మరోసారి కాల్ చేసిన పూనం రూ. 20,800 డిపాజిట్ చేయాలని కోరడంతో అలానే చేశాడు. ఇలా పలుమార్లు ఆమె నుంచి ఫోన్లు కావడంతో అభిషేక్ డబ్బు డిపాజిట్ చేసుకుంటూ పోయాడు. ఇలా వివిధ దఫాలుగా మొత్తం రూ.4,08,798 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. ఇంత మొత్తం చెల్లించినా డేటింగ్ కోసం వెబ్సైట్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అనుమానించిన అభిషేక్ వారిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. పూనం కాల్ చేసిన సెల్ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించాడు. నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభిషేక్ డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాల సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎమ్మెల్సీ’ కేసు దర్యాప్తు ముమ్మరం... క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు నుంచి రూ.58 వేలు కాజేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు గత నెల 31న ఓ వ్యక్తి ఫోన్ చేసి తన పేరు రవిగా పరిచయం చేసుకుని తాను ఆర్బీఎల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌నని, మీ క్రెడిట్ కార్డు గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుందని అప్డేట్ చేసుకోవాలంటూ సూచించాడు. అతని మాటలు నమ్మిన ఎమ్మెల్సీ తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కార్డు నెంబర్లు, వాటి గడువు తేది, సీవీవీ నెంబర్లు చెప్పేశారు. మరుసటి రోజు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.58 వేలు డ్రా అయినట్లు సమాచారం అందడంతో తాను మోసపోయినని గుర్తించిన ఆయన ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. నిందితుడు వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్‌తో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చచ్చి బట్టకట్టారు
థీమ్.. త న న బతకడం కోసం చనిపోయిన వాళ్లు వీళ్లంతా! అంటే... బతకలేక చనిపోయారా? కాదు. బతకడానికి చనిపోయారు! ఇల్లు గడవక ఒకరు, అప్పులకు తాళలేక ఒకరు, భార్యను ప్రేమించలేక (!) ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో చనిపోయారు. చచ్చి బతుకుదామనుకుని చనిపోయారు! చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించాలని చూశారు. అబ్బే.. వీళ్ల.. చావు తెలివితేటలు వర్కవుట్ కాలేదు. లార్డ్ ల్యుకాన్ అసలు పేరు రిచర్డ్ జాన్ బింఘామ్. 1974 నవంబర్ 7 రాత్రి ఇతడు తన భార్యను హత్య చేయబోయి పొరపాటున పనిమనిషి శాండ్రా రివెట్‌ను చంపేశాడు! తనెంత ఘోరమైన పొరపాటు చేశాడో తెలుసుకున్న వెంటనే తన ఫ్రెండ్ ఇంటికి పారిపోయాడు. పోలీసుల భయంతో మర్నాడు తన కారుని న్యూహావెన్ ఒడ్డున వదిలేసి, సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రపంచాన్ని నమ్మించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్లలో అతడు అనేకసార్లు అనేక మందికి కనిపించినా ఎవరూ అనుమానించలేదు! అదృశ్యం అయ్యేనాటికి ల్యుకాన్ వయసు 39 ఏళ్లు. ఇప్పటివరకు ఇతడి ఆచూకీ ఎవరికీ తెలియదు. లార్డ్ ల్యుకాన్ బ్రిటిష్ దేశస్థుడు. పోలీసు రికార్డుల్లో ల్యుకాన్ది అనుమానాస్పద మరణం అని నమోదై ఉంది. యానా గ్రే యానా గ్రే అనే అమ్మాయికి ఆన్లైన్ డేటింగ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే కొన్ని రోజుల తర్వాత యానా బ్రేకప్ కాదలచుకుంది. ఓ రోజు సడన్‌గా అబ్బాయి నుంచి యానాకు మెసేజ్ వచ్చింది.. ‘ఇవాళ నైట్‌కి మనం కలుసుకోవాలి. అరగంటలో మీ ఇంటి బయట ఉంటాను’ అని. అన్నా భయపడిపోయింది. అతడిని వదిలించుకోవాలనుకుంది. తన చెల్లెలి పేరుతో అతడికి రిప్లైయ్ ఇచ్చింది. యానా తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఆసుపత్రిలో అడ్మిట్ అయింది’ అని మెసేజ్ పంపింది. ‘యానాను నేను కలవాల్సిందే’ అని పట్టుపట్టాడు. ‘కలవడానికి వీలుకాదు. ఎందుకంటే యానా చనిపోయింది’ అని తిరుగు మెజేస్ పెట్టింది యానా గ్రే. అలా వాళ్ల ఆన్లైన్ డేటింగ్ స్టాప్ అయింది. తర్వాత అతడు ఇంకో డైటింగ్ సైట్లో యానాను గుర్తుపట్టాడు కానీ ఆమెను కలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఒక సైనికుడి భార్య మిగిలిందీ, మిగుల్చుకున్నదీ ఏమీ లేకపోవడంతో రిటైర్డ్ ఆర్మీ అధికారి కెన్నె™Œ ఝాంగఝా చివరి రోజులలో కటిక పేదరికంలో గడపాల్సి వచ్చింది. ఇల్లు గడవడం కోసం అతడు ఓ ఆలోచన చేశాడు. భార్య పేరిట జీవిత బీమా పాలసీ ఉంది. ఆమె చనిపోతే వెయ్యి డాలర్లు వస్తుంది. గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తన భార్య చనిపోయిందని చెప్పి, ఆ గ్రామపెద్ద సంతకంతో మరణ ధృవీకరణ పత్రం సంపాదించాడు. బ్యాంకు అధికారి ఎడ్మండ్ మ్లంగాను కలిశాడు. ఎడ్మండ్ మిగతా పత్రాలను కూడా సిద్ధం చేసి బ్యాంకుకు సమర్పించబోతుండగా కెన్నెత్ కన్నీళ్లు పెట్టుకుని, ‘నా భార్య బతికే ఉంది. చనిపోయిందని అబద్ధం చెప్పాను’ అని బోరుమన్నాడు. ఆ తర్వాత జడ్జి అడిగితే, ‘చేతిలో డబ్బు లేక, ఆకలి బాధకు తట్టుకోలేక అలా చేశాను మిలార్డ్’ అని చెప్పాడు కెన్నెత్. ఈ ఘటన జింబాంబ్వేలో జరిగింది. గండారుబన్ సుబ్రహ్మణియమ్ సింగపూర్‌లో కార్లను అద్దెకిచ్చే బిజినెస్ చేస్తున్నాడు సుబ్రహ్మణియమ్. బిజినెస్ లాస్ వచ్చి, అప్పుల పాలై 1987లో షట్టర్ క్లోజ్ చేశాడు. తర్వాత సింగపూర్ నుంచి శ్రీలంక పారిపోయాడు. అక్కడ తను చనిపోయినట్లుగా నమ్మించేందుకు ఒక పథకం వేశాడు. శ్రీలంక అంతర్యుద్ధంలో జరిగిన ఒక కాల్పుల ఘటనలో తను చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సంపాదించి, 2,50,000 డాలర్ల బీమా డబ్బును కూడా క్లయిమ్ చేసుకున్నాడు! నకిలీ పాస్‌పోర్ట్‌ను సంపాదించి, తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆ పాస్‌పోర్ట్ ఉపయోగించి అనేక సార్లు సింగపూర్ కూడా వెళ్లొచ్చాడు. చివరికి 2007లో అతడిని పోలీసులు పట్టుకున్నారు. కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. విలియం గ్రో«ద్ విలియంకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దాని విలువ మిలియన్ డాలర్లు. ఆ మొత్తం కోసం భార్యతో కలిసి తన చావుకు తనే స్కెచ్ వేసుకున్నాడు. 2008 నవంబర్ 19న విలియం భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడి కోసం గాలించారు. నది ఒడ్డున వారికి విలియం లెదర్ జాకెట్టు, మనీ పర్సు కనిపించాయి. అది సరిపోదన్నట్లు విలియం తనకు తానుగా పోలీసులకు ఫోన్ చేసి తనే విలియంని చంపేసినట్లు చెప్పాడు. ఆ వాయిస్ ఆధారంగా చివరికి పోలీసులు విలియంను మిస్సోలాలో (యు.ఎస్.) పట్టుకున్నారు. తన చావును తనే ధృవీకరించబోయి, తన గోతిని తనే తవ్వుకుని ఇలా పోలీసులకు చిక్కాడు విలియం. అతడిని వెదకడానికి పోలీసులకు అయిన ఖర్చులకు గాను కోర్టు అతడి చేత 13,000 డాలర్లు కక్కించింది. ఆలిసన్ మతేరా ఫ్లారిడాలో ఆలిసన్, ఆమె స్నేహితురాళ్లు చర్చికి వెళ్లే విశ్వాసుల కూటమి చేరారు. అయితే ఆమెకు ప్రతిరోజూ చర్చికి వెళ్లడం, అక్కడి దైవక్రియలలో పాల్గొనడం ఇష్టం లేదు. వాటిని తప్పించుకోవడం కోసం తను త్వరలో క్యాన్సర్‌తో చనిపోతోందనీ, అనారోగ్యంతో ఉన్న కారణంగా చర్చికి రాలేదని పాస్టర్కు చెప్పించింది. ఆయన నమ్మారు. దాదాపు ఏడాది అలాగే గడిచింది. తనింకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నానని, ఆరోగ్యం కుదుట పడ్డాక చర్చికి వస్తానని ఆలిసన్ చెబుతూ వస్తోంది. చివరికి ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. అసలు తన క్యారెక్టర్‌నే లేకుండా చేస్తే.. అనుకుంది. 2007 జనవరి 18న ఒక నర్సు కాల్ చేసినట్టుగా పాస్టర్కి కాల్ చేసి, ‘పాపం.. ఆలిసన్ చనిపోయింది’ అని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ అబద్ధం బయట పడింది. మార్కస్ స్క్రెన్కర్ మార్కస్ ఫైనాన్షియల్ మేనేజర్. ఆయనపై మోయలేనన్ని లీగల్ కేసులు ఉన్నాయి. 2009 జనవరి 11న తన సొంత ఫ్లైట్‌లో ఇండియానా నుంచి ఫ్లారిడా బయల్దేరాడు. మార్గం మధ్యలో విమానాన్ని ఆటో పైలట్ మోడల్లో ఉంచి ప్యారాచూట్ లోంచి కిందికి దూకేశాడు. విమానం క్రాష్ అయి, తను చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు అతడు అలా చేశాడు. ప్యారాచూట్లోంచి అలబామాలో దిగి, పోలీసుల సహాయంతో అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లి అక్కడ తలదాచుకున్నాడు. ఇతడి కదలికలను అనుమానించి ఆ ఇంటి ఓనరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో డొంకంతా కదిలింది. ఇందంతా రెండ్రోజుల్లోనే జరిగిపోయింది. 2009 జనవరి 13న మార్కస్ అరెస్ట్ అయ్యాడు. చంద్ర మోహన్ శర్మ ఆర్.టి.ఐ. కార్యకర్త. లాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇతడి దాంపత్య జీవితం సంతృప్తిగా ఉండేది కాదంటారు. పొరుగింట్లో ఉండే ప్రీతి అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. శర్మ ఉండేది నోయిడాలో. అతడి పేరు మీద 3 లక్షల జీవిత బీమా ఉంది. అది కాకుండా, అతడు పని చేసే కంపెనీ నుంచి అతడు మరణించిన పక్షంలో అతడి కుటుంబానికి 36 లక్షల పరిహారం వస్తుంది. అందుకే తన చావుకు తనే కుట్ర పన్నుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ (ప్రీతి కాదు), తన బావమరిది సహాయంతో ఇల్లు లేని ఒక అనాథను చంపి, అతడి మృతదేహాన్ని తన కారులో కుక్కి, ఆ కారును మంటల్లో తగలబెట్టేశాడు. అంతా లాండ్ మాఫియానే శర్మను చంపిందనుకున్నారు. తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బెంగళూరు జంప్ అయ్యాడు. అక్కడి నుంచి ప్రీతి ఇంటికి ఫోన్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జాన్ డార్విన్ ఈయన టీచర్. ఇంగ్లండ్‌లోని హార్టిల్పూల్లో జైలు అధికారి. నెత్తిపైన వందలు వేల పౌండ్ల అప్పుంది. ఆ అప్పు నుంచి బయట పడేందుకు భార్యతో కలిసి తన చావుకు తనే ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం 2002 మార్చి 21న ‘చనిపోయాడు’. ఎలాగంటే.. ముందుగా జాన్ తన సొంత పడవలో సముద్రంలోకి వెళ్లాడు. అక్కడ నీళ్లలో మునిగి గల్లంతైనట్లు ప్రపంచానికి పిక్చర్ ఇచ్చాడు. దాంతో అతడి భార్యకు ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అప్పులన్నీ తీరిపోయాయి. భార్యాభర్తలు రహస్యంగా కొత్త జీవితం ప్రారంభించారు. అయితే అంతకాలం రహస్య జీవితం గడపలేక 2007 డిసెంబర్ 1న జాన్ బయటికి వచ్చి తను గతం మర్చిపోయానని, జరిగిందేమిటో తెలీదని చెప్పాడు. పోలీసులు నమ్మలేదు. అరెస్ట్ చేశారు. జాన్ స్టోన్‌హౌస్ జాన్ లేబర్‌పార్టీ రాజకీయ నాయకుడు. విలాసవం తమైన జీవితంతో అప్పుల పాలయ్యాడు. అప్పు లిచ్చినవాళ్లు మీద పడ్డారు. ‘ఛీ ఈ జీవితం వదు’్ద అనుకున్నాడు. తన భార్య షీలా బక్లీతో కలిసి ఫ్రెష్‌గా మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. 1974 నవంబర్ 20న ఈతకు వెళ్లినట్లుగా మయామీ బీచ్‌కి వెళ్లాడు. ఆ తర్వాత అదృశ్యం అయిపోయాడు. షార్క్‌లు తినేసి ఉంటాయనుకున్నారు అంతా. ‘పాపం.. మునిగిపోయి ఉంటాడు’ అని కొందరు. పోలీసులు కూడా జాన్ చనిపోయి ఉంటాడనే అనుకున్నారు. అదే ఏడాది క్రిస్మస్కి ఆస్ట్రేలియా తిరిగొచ్చాడు జాన్. కొంతకాలం అజ్ఞాతంగా గడిపాడు. అంతా తనను మర్చిపోయి ఉంటారని అనుకున్నాడు కానీ, పోలీసులు తన కోసం ఇంకా వెతుకుతూనే ఉండి ఉంటారని అనుకోలేకపోయాడు. 1976 ఆగస్టులో పోలీసులకు పట్టుపడ్డాడు. జాన్‌కి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. -
డేటింగ్ సైట్ పెద్దావిడ కొంపముంచింది
లండన్: బ్రిటన్‌లో డేటింగ్ సైట్ ఓ పెద్దావిడ కొంపముంచింది. డేటింగ్ చేస్తున్న వ్యక్తిని నమ్మి దాదాపు 1,40,000 పౌండ్లు(రూ.1,18,81,159.50) మోసపోయింది. మరో అవాక్కయ్యే విషయమేమిటంటే ఆమె ఒక తెలివైన ప్రొఫెసర్ కూడా.. బ్రిటన్‌లో విక్టోరియా డెర్బీషైర్ ప్రోగ్రామ్‌లో డేటింగ్ సైట్ స్కాముల్లో ఇరుక్కొని ఎంతమంది మోసపోతున్నారనే విషయాన్ని వివరించారు. గతంతో పోలిస్తే 2016లోనే ఈ సైట్ భారీనపడి చాలామంది మోసపోయారంట. ఈ డేటింగ్ సైట్ల అనుభవాన్ని వివరించేందుకు ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేస్తున్న జుడిత్ లాథ్లియాన్ ఆ టీవీ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె చెప్పిన వివరాలు పరిశీలిస్తే.. ఓ వ్యక్తితో ఆన్లైన్ డేటింగ్ చేద్దామని నిర్ణయించుకొని నిజాయితీ, నిబద్ధత, సిన్సియారిటీ అంటూ ప్రొఫైల్ కంటెంట్ పెట్టుకున్న వ్యక్తిని ఆమె ఎంచుకుంది. ఆ తర్వాత అతడితో ప్రేమలో పడింది. ఇరువురు పరస్పరం ప్రేమను చెప్పుకున్నారు. ఒకరు విడిచి ఒకరు ఉండలేనంతగా తయారయ్యారు. అనంతరం అవతలి వ్యక్తి తన కష్టాలు చెప్పుకోగానే కరిగిపోయన ఆప్రొఫెసర్ అతడికి దాదాపు రూ. కోటి 20లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత అవతలి వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి అనంతరం కేసు పెట్టింది. ఇలా గత ఏడాది 4000 మంది ఆన్లైన్ డేటింగ్ వ్యామోహంతో మోసగాళ్లబారిన పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది. -
ఆన్లైన్ ప్రేమకు... తాళి కట్టు!
‘తాళికట్టు శుభవేళ... మెడలో కల్యాణమాల...’ అన్నారో సినీకవి. కానీ, చదువు, సంపాదన - అన్నీ పెరిగిన ఆధునిక డిజిటల్ తరం ‘ప్రేమ పుట్టు శుభవేళే...’ మెడలో కల్యాణమాలకు సిద్ధం అంటోంది. అంతా పెద్దల చేతికే వదిలేయకుండా, అభిరుచులు కలసిన భాగస్వామి కోసం కొత్తగా స్మార్ట్‌ఫోన్‌లో ఆన్లైన్ డేటింగ్, మ్యాచ్ మేకింగ్ యాప్స్‌లో అన్వేషణ సాగిస్తోంది. పెరుగుతున్న ఆ యాప్‌లు, క్రమంగా వాటికి పెరుగుతున్న ఆదరణే అందుకు సాక్షి! అది 1980.... డిగ్రీ పూర్తి చేసిన లక్ష్మికి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజారావుకు కూడా తగిన వధువు ఎవరా అని వెతుకుతున్నారు. ఈ రెండు కుటుంబాలకూ ముడిపెడితే బాగుంటుందని... తెలిసిన దూరపు బంధువులు అనుకున్నారు. అంతే... అమ్మాయి ఇంట్లో పెళ్ళి చూపులు... పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు పెద్దల ఎదుటే మాట్లాడుకున్నారు. పెద్దలకే నిర్ణయం ఇచ్చేశారు. ఇంకేం... వెంటనే బాజా బజంత్రీలు... కట్ చేస్తే... 2010... ఈసారి రాజారావు, లక్ష్మి దంపతుల పెద్దమ్మాయి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. పెళ్ళి వయసుకొచ్చింది. కాలం మారింది. ఉమ్మడి కుటుంబాలు లేవు. వ్యష్టి కుటుంబాలొచ్చాయి. బంధుత్వాలు పలచబడ్డాక, పత్రికల్లో పెళ్ళిపందిళ్ళ ప్రకటనలు... మ్యారేజ్ బ్యూరోలతోనే పెళ్ళి సంబంధాలు కుదురుతున్నాయి. పెళ్ళిచూపుల్లో అబ్బాయి, అమ్మాయి కాసేపు విడిగా మాట్లాడుకున్నారు. తాము ఒకరికొకరం సరిజోడీ అనుకున్నారు. పెళ్ళికి ముందే అబ్బాయి కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశానికి అమ్మాయి వెళ్ళింది. అబ్బాయి, అమ్మాయి కలిసి షాపింగ్‌లకూ వెళ్ళొచ్చారు. ఒకరినొకరు మరింత తెలుసుకున్నారు. పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. మళ్ళీ కట్ చేస్తే... 2016... ఇప్పుడు రాజారావు, లక్ష్మి దంపతుల ఆఖరి అమ్మాయికి పెళ్ళి చేయాలి. వైఫై, వాట్సప్ తరంలో కొత్త ట్రెండ్స్ వచ్చేశాయి. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు, మ్యారేజ్ బ్యూరో పెళ్ళిళ్ళను కూడా దాటి... ఇప్పుడు ఆన్లైన్ వేదికలు వెలిశాయి. ఫేస్బుక్ ఛాట్లను మించి, మొబైల్ ఫోనుల్లో డేటింగ్ యాప్స్ వచ్చేశాయి. స్మార్ట్‌ఫోన్స్‌లోని ఆ యాప్స్ ద్వారా ఆన్లైన్లోనే అమ్మాయి, అబ్బాయి పరిచయమవుతున్నారు. పరిచయం పెరిగాక మరింత అర్థం కావడం కోసం కలసి తిరుగుతున్నారు. అన్నీ కుదిరాయి అనుకుంటేనే, పెళ్ళి పీటలెక్కుతున్నారు. లేదంటే... మరో పార్ట్నర్ కోసం ఆన్లైన్ అన్వేషణ! ఇదీ లేటెస్ట్ ట్రెండ్!! రాజారావు గారి అమ్మాయి మొబైల్ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్‌ల ఎలర్ట్ మెసేజ్‌లతో తరచూ ట్రింగ్... ట్రింగ్ అంటోంది. వెల్కమ్ టు ఆన్లైన్ డేటింగ్ యాప్స్... సరికొత్త ఆన్లైన్ ప్రేమ, పెళ్ళిసంబంధాల యాప్స్‌కు స్వాగతం! ఆర్థిక సరళీకరణ తరువాత... అంటే 1991 తరువాత పుట్టి, పెరిగిన భారతీయ యువతీ యువకులు ఇప్పుడు పెళ్ళీడుకొచ్చారు. ఈ తరం ఇప్పుడు పెళ్లి సంప్రదాయానికి సంబంధించి ఏళ్ళ తరబడిగా ఉన్న పద్ధతుల్ని తిరగరాస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ఎరేంజ్డ్ మ్యారేజ్‌ల వ్యవస్థ ఈ 21వ శతాబ్దంలో పూర్తిగా రూపం మార్చు కొంటోంది. ఈ సరికొత్త మేకోవర్ గురించి తెలుసుకుందాం.. తరం మారుతోంది... స్వరం మారుతోంది! నిజానికి, మన దేశంలో పెళ్ళిళ్ళ మార్కెట్ కొన్ని వందల కోట్ల విలువైన వ్యాపారం. ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళ క్రితమే 1997లో మన దేశంలో ‘షాదీ డాట్‌కామ్’, ‘భారత్ మ్యాట్రిమొనీ డాట్‌కామ్’ లాంటి పాపులర్ పెళ్ళిసంబంధాల వెబ్సైట్లు మొదలయ్యాయి. నిజానికి, అప్పట్లో మన జనాభాలో 0.1 శాతం మందే ఇంటర్నెట్ వాడేవాళ్ళు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగాక, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పల్లెల్లోకి కూడా చొచ్చుకుపోయాక పరిస్థితి బాగా మారింది. ఒకప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో తల్లితండ్రులదే ఆఖరి మాట. కులం, మతం, ప్రాంతం లాంటివెన్నో చూస్తే కానీ కథ పెళ్ళి దాకా వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు డేటింగ్ యాప్స్ ద్వారా ఆడపిల్లలకు సైతం తమ జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కావాల్సినంత ఛాయిస్ వచ్చింది. కెరీర్, జీవితాశయం లాంటివి దృష్టిలో పెట్టుకొనే, పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇదో పెద్ద మార్కెట్! ప్రస్తుతం మన దేశ జనాభాలో దాదాపు సగం మంది పాతికేళ్ళ లోపు వాళ్ళే. ఇక, దేశంలో 18 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు వారి లెక్క చూస్తే, వారిలో దాదాపు 25 కోట్ల మంది ఒంటరి పక్షులే. ఇంతమంది ప్రపంచంలో మరెక్కడా లేరు. చివరకు చైనాలో కూడా లేరు. దానికి తోడు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం కూడా ఆన్లైన్ డేటింగ్, పెళ్ళిళ్ళ వ్యాపారానికి కలిసొచ్చింది. మన దేశంలోని 25 కోట్ల మంది ఒంటరిపక్షుల్లో సుమారు 23.5 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు. అందుకే, డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు ఈ డేటింగ్ - పెళ్ళిళ్ళ వ్యాపారం శరవేగంగా పెరుగుతోంది. ఇది ఏకంగా దాదాపు రూ.13 వేల కోట్ల పైచిలుకు వ్యాపారమని ఒక అంచనా. ఇది గుర్తించబట్టే చాలామంది యువ పారిశ్రామికవేత్తలు మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ద్వారా ఎక్కువమందిని ఆకర్షించి, సొమ్ము చేసుకొనే పనిలో ఉన్నారు. నిజానికి, పెళ్ళి కాక ముందే అబ్బాయి, అమ్మాయి పరిచయం పెంచుకొని, స్నేహంగా తిరగడమనేది కొన్నేళ్ళుగా ఉన్నదే. అయితే, ఒకప్పుడు అది కేవలం అగ్రశ్రేణి 2 శాతం మందికే పరిమితం. కానీ, ఇప్పుడు అది ప్రధాన జీవన స్రవంతిలోని దిగువ శ్రేణి జనాభాకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు జరుగుతున్నా, ఆర్థిక పురోగమన కాలానికి చెందిన ఆధునిక తరం యువతీ యువకులు పాత పద్ధతుల్ని పక్కనపెట్టి, పాశ్చాత్య ఆలోచనల్ని స్వాగతిస్తున్నారు. బంధనాలు తెంచుకొని... పంజరాలు దాటుకొని! ఈ డిజిటల్ శకంలో పాశ్చాత్య ప్రపంచానికీ, మనకూ మధ్య తేడా క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. అమ్మాయిల్లో అక్షరాస్యత, ఉద్యోగినుల శాతం గణనీయంగా పెరగడంతో ప్రేమ, పెళ్ళి లాంటి విషయాల్లో పితృస్వామ్య భావజాలాల సంకెళ్ళు క్రమంగా తెగిపోతున్నాయి. 1981 నుంచి 2011 మధ్య కాలంలో మన దేశంలో అమ్మాయిల అక్షరాస్యతా రేటు 29.8 శాతం నుంచి 65.5 శాతానికి పెరిగింది. అలాగే, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యల్లో చేరే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే, వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే ఆడవారి సంఖ్య గడచిన దశాబ్ది కాలంలో 50 లక్షల నుంచి 60 లక్షలైంది. పైకి ఇది కొద్దిగానే అనిపిస్తున్నా, అవ్యవస్థీకృత రంగంలో ఇంతకన్నా ఎన్నో రెట్ల మంది పనిచేస్తున్నారు. అలాగే, 2001 నుంచి 2011 మధ్య కాలంలో 20 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసు అమ్మాయిల్లో అవివాహితుల సంఖ్య ఏకంగా 68 శాతం మేర పెరిగినట్లు జాతీయ జనాభా లెక్కల సమాచారం. అంటే, స్త్రీలు చదువు, కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూ, ఆ తరువాతే పెళ్ళి అంటున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ళ మీద నిలబడ్డ అమ్మాయి, తన జీవిత భాగస్వామి ఎంపికలో కూడా బంధనాలు తెంచుకొని, పంజరాలు దాటుకొని, తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని వినియోగించుకుంటోంది. ‘ట్రూలీ మ్యాడ్లీ’ సహా ‘వూ’, ‘హింజ్’, ‘ఏక్ కాఫీ’, ‘మ్యాచిఫై’ లాంటి చాలా యాప్స్ ఇవాళ ఇండియాలో సక్సెస్ అవడం వెనక ఇవన్నీ కారణాలే! కేవలం గడచిన రెండేళ్ళలో లక్షల మంది ఈ యాప్స్‌ను తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవడం గమనించాల్సిన విషయం. నకిలీరాయుళ్ళ ఏరివేత! అయితే, ఈ డేటింగ్, మ్యాచ్ మేకింగ్ యాప్‌ల బిజినెస్ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దగ్గర కొద్దిగా డిఫరెంట్ అనుకోవాలి. అక్కడలా ఇక్కడ ఒక్కరు నలుగురితో తిరగడాన్ని హర్షించరు. అలాగే, కాలక్షేపం డేటింగ్ ప్రమాదాలు ఎక్కడైనా ఎక్కువే. అందుకే, ఈ విషయంలో యాప్‌లు, యూజర్లు జాగ్రత్తగా ఉండక తప్పదు. చాలా యాప్‌లు నకిలీ పెళ్ళికొడుకులు, వేధింపురాయుళ్ళ గోల తగ్గించడానికి, యాప్‌లో రిజిస్టర్ అయ్యే టైమ్‌లోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా లాగిన్ అయ్యేలా చూస్తున్నాయి. రిజిస్టర్ అవుతున్న వారి వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నాయి. ఇండియాలోని మొట్టమొదటి డేటింగ్ యాప్ ‘ట్రూలీ మ్యాడ్లీ’లో రిజిస్టర్ చేసుకున్న పది రోజుల్లోనే దాదాపు 25 శాతం మంది మగ అప్లికెంట్లను తొలగించారు. ఇక, కొన్ని డేటింగ్ స్టార్టప్ సంస్థలైతే ముందుగా టెలిఫోన్లో ఇంటర్వ్యూ చేసి కానీ, వాళ్ళకు తమ యాప్‌లో సభ్యత్వం ఇవ్వడం లేదు. అందుకే, వీటిలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ మంది సభ్యులు. అలాగే, తమకు ఇష్టం లేనివాళ్ళు సంప్రతించే అవకాశం లేకుండా ఆ ప్రొఫైల్స్‌ను ఆడవాళ్ళు బ్లాక్ చేయవచ్చు. ఫిర్యాదూ చేయవచ్చు. ప్రేమకు వరం... భవిష్యత్ తరం! ఈ మాత్రం రక్షణ ఉండడంతో, మన దేశంలో క్రమంగా డేటింగ్ యాప్‌ల పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళూ ఆకర్షితులవుతున్నారు. రెండేళ్ళ క్రితం మొదలైన ఆన్లైన్ డేటింగ్ యాప్ ‘ట్రూలీ మ్యాడ్లీ’కి ఇప్పుడు దాదాపు 20 లక్షల మంది యూజర్లున్నారు. అంతేకాదు... ఢిల్లీ శివార్లలోని ఈ స్టార్టప్ సంస్థ ఆఫీసులో 40 మంది ఉద్యోగినులుంటే, వాళ్ళలో సగం మంది అమ్మాయిలే! అదీ 30 ఏళ్ళ లోపువాళ్ళు. పైగా, అందరూ చిన్న చిన్న పట్నాల నుంచి పైకొచ్చి, బాగా చదువుకొని, తమ ఆశల అన్వేషణలో ఢిల్లీ బాట పట్టినవాళ్ళు. తాము జీవితాంతం కలసి నడవాల్సిన భాగస్వామి ఎంపిక బాధ్యత పెద్దలదని వదిలేయకుండా, డేటింగ్ యాప్స్ వాడుతూ, స్వతంత్రంగా వరుడి ఎంపికలో బిజీగా ఉంటున్నవాళ్ళు! ఇదంతా మారుతున్న ముఖచిత్రానికి నిదర్శనం. మరో నాలుగేళ్ళలో 2020 నాటి కల్లా భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ కానుంది. 125 కోట్ల భారతీయ జనాభా సగటు వయసు 29 ఏళ్ళు కానుంది. అంటే, సినిమా ప్రేమకథలు, ప్రేమలు, ప్రేమికుల దినోత్సవాలు, కులాలు - కట్నకానుకల పట్టింపులకు దూరంగా పెళ్ళిళ్ళు - వీటి మధ్యే పెరిగిన కొత్త తరం పగ్గాలు చేపడుతుంది. ప్రేమా జిందాబాద్! ప్రేమతో పెళ్ళికే జిందాబాద్! అంటుంది. డేటింగ్ యాప్ అందుకు ఒక చిన్న... కొత్త మజిలీ... అంతే! ప్రేమకే పట్టం మనదేశంలో ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు క్రమంగా తగ్గుతుంటే, వధూవరులు ఒకరినొకరు తెలుసుకొని, చేసుకుంటున్న ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి. పదేళ్ళ క్రితం మన భారతీయ వివాహాల్లో ప్రేమ పెళ్ళిళ్ళు కేవలం 5 శాతమే. కానీ, ఇప్పుడవి ఏకంగా 30 శాతానికి పెరిగాయి. కొన్ని ప్రధాన నగరాల్లో అయితే, ఈ శాతం ఇంకా చాలా ఎక్కువని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇండియాలో ప్రేమ వివాహాలు పెరగడం గురించి ఏకంగా పుస్తకమే రాసిన షెఫాలీ సంధ్య ఈ సంగతి వెల్లడించారు. డేట్... యాప్... హుర్రే! డేటింగ్ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో అంతకంతకూ పెరుగుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. ఇంకా చెప్పాలంటే, ఆసియాలోకెల్లా అతి పెద్దది. అందుకు తగ్గట్లే కొన్నేళ్ళుగా మన దేశంలో ఈ డేటింగ్ యాప్‌ల మార్కెట్ బాగా విస్తరించింది. ప్రస్తుతం దాదాపు డజనుకు పైగా కంపెనీలు ఇండియాలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే, స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్ళలో 10 లక్షల పైగా మంది ఇలాంటి యాప్‌లలో కనీసం ఒక్కటైనా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇవి మీకు తెలుసా? ప్రస్తుతం మన దేశంలో వాడుకలో ఉన్న కొన్ని ప్రధాన డేటింగ్ యాప్స్ 1. టిండర్: భావసారూప్యం ఉండి, ఒకే ఏరియాలో ఉన్న వ్యక్తుల్ని కలుపుతుంది కాలక్షేపం స్నేహాల యాప్‌గా పాపులర్. ప్రపంచవ్యాప్తంగా రోజూ 2.6 కోట్ల మ్యాచ్‌లు ఈ డేటింగ్ యాప్ ‘టిండర్’ ద్వారా జరుగుతుంటాయి 2012లో వచ్చిన ఈ యాప్ ప్రస్తుతం 196 దేశాల్లో అందుబాటులో ఉంది ఆసియాలో కెల్లా ఈ యాప్‌కు అతి పెద్ద మార్కెట్ మన దేశమే ఈ యాప్‌లో ఛాటింగ్ చేస్తూ అత్యంత ఎక్కువ సమయం గడుపుతున్నది భారతీయులే. 2. వూ: ఈ డేటింగ్ యాప్‌లో పెళ్ళయినవాళ్ళు చేరడానికి వీలుండదు. పాతిక నుంచి 35 ఏళ్ళ మధ్యవయస్కుల్లో అర్థవంతమైన సంభాషణలకి వేదిక ఈ యాప్ వాడేవారిలో 23 శాతం మంది ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం వారు. 21 శాతం మంది ముంబయ్ వాసులు. 18 శాతం మంది బెంగుళూరు వాళ్ళు. 10 శాతం మంది పుణే వాస్తవ్యులు ఇందులో జరిగే మ్యాచ్‌లలో అధిక శాతం 24 - 30 ఏళ్ళ మధ్య వయస్కుల వి. 3. హ్యాప్న్: ప్రపంచవ్యాప్తంగా కోటీ 95 లక్షల మంది ఈ డేటింగ్ యాప్ వాడుతున్నారు ఈ ఏడాది మే నెలలోనే ఇండియాలో ఇది ఆరంభమైంది ఈ ఏడాది చివరికల్లా మన దేశంలో 10 లక్షల మంది యూజర్లను సంపాదించాలన్న లక్ష్యంతో సాగుతోంది. 4. ట్రూలీ మ్యాడ్: భారతదేశంలోని మొట్టమొదటి ఆన్లైన్ డేటింగ్, మ్యాచ్ మేకింగ్ యాప్. వివరాలు సరిచూసి, సింగిల్‌గా ఉన్నవాళ్ళనే ఈ యాప్ అనుమతిస్తుంది 2014లో ‘ప్రేమికుల రోజు’న ఈ యాప్ మొదలైంది ఇప్పటికి దాదాపు 20 లక్షల మందికి పైగా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ వాడుతున్నవాళ్ళు సగటున ప్రతి రోజూ 46 నిమిషాల టైమ్ దీని మీదే వెచ్చిస్తున్నారు. 5. ఇన్‌క్లోవ్: దివ్యాంగుల కోసం ఏర్పాటైన ప్రపంచంలోని మొట్టమొదటి డేటింగ్ యాప్ ఇది. - రెంటాల జయదేవ -
ఆన్లైన్ డేటింగ్లో చీటింగ్
లండన్: భార్యాభర్తలు ఒకరికొకరు దూరమై ఒంటరితనంతో బాధ పడుతున్న వారెందరో ఆన్లైన్ డేటింగ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ డేటింగ్లలో ఆశించిన ఆనందం దొరక్కపోగా మరింత విషాదం వారి జీవితాలను అలుముకుంటోంది. కోరుకున్నవారు కోరుకున్నట్లు ఉండకపోవడంతో హతాశులవుతున్నవారు ఎందరో! ఏదోరకంగా భార్యాపిల్లలకు దూరమై ఒంటరిగా బతుకుతున్న కొంతమంది వయోవృద్ధుల అనుభవాలు ఇలా ఉన్నాయి.... ఆన్లైన్ డేటింగ్ సైట్లో కనిపించే మహిళల ఫొటో కనీసం పది నుంచి పాతికేళ్ల క్రితం తీసుకున్నదై ఉంటుంది. వయస్సు కారణంగానో, మేకప్ కారణంగానో చూడడానికి ఫొటో అందంగా కనిపించవచ్చు. తీరా వెళ్లి చూస్తే పీక్కుపోయి ముడతలు పడిన ముఖంతోనీ, పిచ్చుక గూడులాగానో, చింపిరి జుట్టుతోనో కనిపించడం ఖాయం. సన్నగా నాజూగ్గా కనిపిస్తుందనుకుంటే సుమోలకు తీసిపోని విధంగా ఉంటారు. ఆన్లైన్లో వారి ఫొటోలకన్నా కలిసే నాటికి కనీసం యాభై కిలోల బరువు ఎక్కువుంటారు. ఆకారం ఎలా ఉంటేనేమీ మానసికంగా కంపెనీ ఇచ్చేవాళ్లుంటే చాలులే అనుకుంటే వెనక్కి తిరిగి పిక్క బలం చూపించాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకునే మాటల సంగతి అటుంచి ఐదు నిమిషాలకు మించి భరించలేని సుత్తి కబుర్లను సరికొత్తగా వినాల్సి వస్తోంది. మాజీ భర్త లేదా మాజీ బోయ్ ఫ్రెండ్ గురించో, ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల గురించో, చిన్నప్పుడే భగ్నమైన ప్రేమ గురించో విఫులంగా వినాల్సి వస్తోంది. తల్లీ పిల్లలను ఖరీదైన హోటళ్లకు తిప్పడమే పనిగా పెట్టుకోవడం, బేబీ సిట్టింగ్లతో సేవలు చేయడమూ తప్పదు. పిల్లల పెళ్లిళ్ల లాంటి బరువు బాధ్యతలు కూడా మోయాల్సి రావచ్చు. సైట్లో వెల్లడించే హాబీలు ఎలా ఉంటాయంటే..... - పర్యటించడమంటే ఎంతో ఇష్టమన్నారంటే పక్కనున్న హాలీ డే రిసార్ట్‌కు వెళ్లడం. - ఫారిన్ ఫుడ్ ఎంతో ఇష్టమంటే పూరీలు తినే వాళ్లు, నూడుల్స్ తినడం లాంటిది. - సంగీతాన్ని ప్రేమిస్తానని అన్నారంటే ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమా చూసిన గుర్తు ఉండడం. -జంతువులను ప్రేమిస్తానంటే పెంచుకుంటున్న పిల్లులను, కుక్కలను ఇష్టపడడం. -సోషల్ డ్రింక్స్ అంటే పీకలదాకా తాగి సొమ్మసిల్లి పడిపోవడం. -సెన్సిటివ్ అంటే, బాటిల్ వైన్ తాగి గత జీవితం గురించి బాధపడడం. -అప్పుడప్పుడు సెక్స్ దొరికినా నిజమైన ప్రేమ మాత్రం ఎప్పటికీ దొరకదు. ఆక్స్ఫర్డ్ షైర్లో ఓ కంపెనీకి డెరైక్టర్‌గా పని చేస్తున్న 51 ఏళ్ల స్టీఫెన్ నైట్స్, గ్లౌసెస్టర్షైర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మేన్‌గా పనిచేస్తున్న 51 ఏళ్ల గేరిబాల్, లింకన్‌షైర్‌కు చెందిన 61 ఏళ్ల జాన్వేన్, బోగ్నర్ రేజిస్కు చెందిన 62 ఏళ్ల జాన్ మెర్రిట్, బెర్క్‌షైర్‌కు చెందిన రిటైర్డ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ 67 ఏళ్ల మార్టిన్ కర్టీస్, రిటైర్డ్ రెస్టారెంట్ ఓనర్ 70 ఏళ్ల బ్రెయిన్ ఫెట్చర్లు ఆన్లైన్ డేటింగ్లో గత నాలుగేళ్లలో ఎదుర్కొన్న అనుభవాలు. వారు ఇంచుమించు తమ ఏజ్ వాళ్లతోనే డేటింగ్ చేశారు. డేటింగ్‌కు స్వస్తి చెప్పి ఇష్టమైన మద్యం సేవిస్తూ, ఇష్టమైన సినిమా ఒంటరిగా చూడడమే బెటర్ అని వారు సలహా ఇస్తున్నారు. వీళ్ల సంగతి సరే, మరి ఆన్లైన్లో డేటింగ్ చేస్తున్న మహిళల సంగతేమిటి? వారి అనుభవాలు ఇంతకంటే వెగటు పుట్టించేలా ఉంటాయోమో! వీరిలాగా వారు కూడా మీడియా ముందుకొచ్చి చెబితేగానీ వాస్తవాలు తెలియవు.