చచ్చి బట్టకట్టారు | Then one of the debts, loves his wife | Sakshi
Sakshi News home page

చచ్చి బట్టకట్టారు

Published Sun, Feb 5 2017 10:41 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

చచ్చి బట్టకట్టారు - Sakshi

చచ్చి బట్టకట్టారు

థీమ్‌.. త న న

బతకడం కోసం చనిపోయిన వాళ్లు వీళ్లంతా! అంటే... బతకలేక చనిపోయారా? కాదు. బతకడానికి చనిపోయారు! ఇల్లు గడవక ఒకరు, అప్పులకు తాళలేక ఒకరు, భార్యను ప్రేమించలేక (!) ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో చనిపోయారు. చచ్చి బతుకుదామనుకుని చనిపోయారు! చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించాలని చూశారు. అబ్బే.. వీళ్ల.. చావు తెలివితేటలు వర్కవుట్‌ కాలేదు.

లార్డ్‌ ల్యుకాన్‌
అసలు పేరు రిచర్డ్‌ జాన్‌ బింఘామ్‌. 1974 నవంబర్‌ 7 రాత్రి ఇతడు తన భార్యను హత్య చేయబోయి పొరపాటున పనిమనిషి శాండ్రా రివెట్‌ను చంపేశాడు! తనెంత ఘోరమైన పొరపాటు చేశాడో తెలుసుకున్న వెంటనే తన ఫ్రెండ్‌ ఇంటికి పారిపోయాడు. పోలీసుల భయంతో మర్నాడు తన కారుని న్యూహావెన్‌ ఒడ్డున వదిలేసి, సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రపంచాన్ని నమ్మించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్‌లలో అతడు అనేకసార్లు అనేక మందికి కనిపించినా ఎవరూ అనుమానించలేదు! అదృశ్యం అయ్యేనాటికి ల్యుకాన్‌ వయసు 39 ఏళ్లు. ఇప్పటివరకు ఇతడి ఆచూకీ ఎవరికీ తెలియదు. లార్డ్‌ ల్యుకాన్‌ బ్రిటిష్‌ దేశస్థుడు. పోలీసు రికార్డుల్లో ల్యుకాన్‌ది అనుమానాస్పద మరణం అని నమోదై ఉంది.

యానా గ్రే
యానా గ్రే అనే అమ్మాయికి ఆన్‌లైన్‌ డేటింగ్‌లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు.  అయితే కొన్ని రోజుల తర్వాత యానా బ్రేకప్‌ కాదలచుకుంది. ఓ రోజు సడన్‌గా అబ్బాయి నుంచి యానాకు మెసేజ్‌ వచ్చింది.. ‘ఇవాళ నైట్‌కి మనం కలుసుకోవాలి. అరగంటలో మీ ఇంటి బయట ఉంటాను’ అని. అన్నా భయపడిపోయింది. అతడిని వదిలించుకోవాలనుకుంది. తన చెల్లెలి పేరుతో అతడికి రిప్లైయ్‌ ఇచ్చింది. యానా తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఆసుపత్రిలో అడ్మిట్‌ అయింది’ అని మెసేజ్‌ పంపింది. ‘యానాను నేను కలవాల్సిందే’ అని  పట్టుపట్టాడు. ‘కలవడానికి వీలుకాదు. ఎందుకంటే యానా చనిపోయింది’ అని తిరుగు మెజేస్‌ పెట్టింది యానా గ్రే. అలా వాళ్ల ఆన్‌లైన్‌ డేటింగ్‌ స్టాప్‌ అయింది. తర్వాత అతడు ఇంకో డైటింగ్‌ సైట్‌లో యానాను గుర్తుపట్టాడు కానీ ఆమెను కలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు.

ఒక సైనికుడి భార్య
మిగిలిందీ, మిగుల్చుకున్నదీ ఏమీ లేకపోవడంతో రిటైర్డ్‌ ఆర్మీ అధికారి కెన్నె™Œ  ఝాంగఝా చివరి రోజులలో కటిక పేదరికంలో గడపాల్సి వచ్చింది. ఇల్లు గడవడం కోసం అతడు ఓ ఆలోచన చేశాడు. భార్య పేరిట జీవిత బీమా పాలసీ ఉంది. ఆమె చనిపోతే వెయ్యి డాలర్లు వస్తుంది. గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తన భార్య చనిపోయిందని చెప్పి, ఆ గ్రామపెద్ద సంతకంతో మరణ ధృవీకరణ పత్రం సంపాదించాడు. బ్యాంకు అధికారి ఎడ్మండ్‌ మ్లంగాను కలిశాడు. ఎడ్మండ్‌ మిగతా పత్రాలను కూడా సిద్ధం చేసి బ్యాంకుకు సమర్పించబోతుండగా కెన్నెత్‌ కన్నీళ్లు పెట్టుకుని, ‘నా భార్య బతికే ఉంది. చనిపోయిందని అబద్ధం చెప్పాను’ అని బోరుమన్నాడు. ఆ తర్వాత జడ్జి అడిగితే, ‘చేతిలో డబ్బు లేక, ఆకలి బాధకు తట్టుకోలేక అలా చేశాను మిలార్డ్‌’ అని చెప్పాడు కెన్నెత్‌. ఈ ఘటన జింబాంబ్వేలో జరిగింది.

గండారుబన్‌ సుబ్రహ్మణియమ్‌
సింగపూర్‌లో కార్లను అద్దెకిచ్చే బిజినెస్‌ చేస్తున్నాడు సుబ్రహ్మణియమ్‌. బిజినెస్‌ లాస్‌ వచ్చి, అప్పుల పాలై 1987లో షట్టర్‌ క్లోజ్‌ చేశాడు. తర్వాత సింగపూర్‌ నుంచి శ్రీలంక పారిపోయాడు. అక్కడ తను చనిపోయినట్లుగా నమ్మించేందుకు ఒక పథకం వేశాడు. శ్రీలంక అంతర్యుద్ధంలో జరిగిన ఒక కాల్పుల ఘటనలో తను చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌ సంపాదించి, 2,50,000 డాలర్ల బీమా డబ్బును కూడా క్లయిమ్‌ చేసుకున్నాడు! నకిలీ పాస్‌పోర్ట్‌ను సంపాదించి, తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆ పాస్‌పోర్ట్‌ ఉపయోగించి అనేక సార్లు సింగపూర్‌ కూడా వెళ్లొచ్చాడు. చివరికి 2007లో అతడిని పోలీసులు పట్టుకున్నారు. కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

విలియం గ్రో«ద్‌
విలియంకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంది. దాని విలువ మిలియన్‌ డాలర్లు. ఆ మొత్తం కోసం భార్యతో కలిసి తన చావుకు తనే స్కెచ్‌ వేసుకున్నాడు. 2008 నవంబర్‌ 19న విలియం భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడి కోసం గాలించారు. నది ఒడ్డున వారికి విలియం లెదర్‌ జాకెట్టు, మనీ పర్సు కనిపించాయి. అది సరిపోదన్నట్లు విలియం తనకు తానుగా పోలీసులకు ఫోన్‌ చేసి తనే విలియంని చంపేసినట్లు చెప్పాడు. ఆ వాయిస్‌ ఆధారంగా చివరికి పోలీసులు విలియంను మిస్సోలాలో (యు.ఎస్‌.) పట్టుకున్నారు. తన చావును తనే ధృవీకరించబోయి, తన గోతిని తనే తవ్వుకుని ఇలా పోలీసులకు చిక్కాడు విలియం. అతడిని వెదకడానికి పోలీసులకు అయిన ఖర్చులకు గాను  కోర్టు అతడి చేత 13,000 డాలర్లు కక్కించింది.

ఆలిసన్‌ మతేరా
ఫ్లారిడాలో ఆలిసన్, ఆమె స్నేహితురాళ్లు  చర్చికి వెళ్లే విశ్వాసుల కూటమి చేరారు. అయితే ఆమెకు  ప్రతిరోజూ చర్చికి వెళ్లడం, అక్కడి దైవక్రియలలో పాల్గొనడం ఇష్టం లేదు. వాటిని తప్పించుకోవడం కోసం తను త్వరలో క్యాన్సర్‌తో చనిపోతోందనీ, అనారోగ్యంతో ఉన్న కారణంగా చర్చికి రాలేదని పాస్టర్‌కు చెప్పించింది. ఆయన నమ్మారు. దాదాపు ఏడాది అలాగే గడిచింది. తనింకా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే ఉన్నానని, ఆరోగ్యం కుదుట పడ్డాక చర్చికి వస్తానని ఆలిసన్‌ చెబుతూ వస్తోంది. చివరికి ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. అసలు తన క్యారెక్టర్‌నే లేకుండా చేస్తే.. అనుకుంది. 2007 జనవరి 18న ఒక నర్సు కాల్‌ చేసినట్టుగా పాస్టర్‌కి కాల్‌ చేసి, ‘పాపం.. ఆలిసన్‌ చనిపోయింది’ అని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ అబద్ధం బయట పడింది.

మార్కస్‌ స్క్రెన్కర్‌
మార్కస్‌ ఫైనాన్షియల్‌ మేనేజర్‌. ఆయనపై మోయలేనన్ని లీగల్‌ కేసులు ఉన్నాయి. 2009 జనవరి 11న తన సొంత ఫ్లైట్‌లో ఇండియానా నుంచి ఫ్లారిడా బయల్దేరాడు. మార్గం మధ్యలో విమానాన్ని ఆటో పైలట్‌ మోడల్‌లో ఉంచి ప్యారాచూట్‌ లోంచి కిందికి దూకేశాడు. విమానం క్రాష్‌ అయి, తను చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు అతడు అలా చేశాడు. ప్యారాచూట్‌లోంచి అలబామాలో దిగి, పోలీసుల సహాయంతో అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లి అక్కడ తలదాచుకున్నాడు. ఇతడి కదలికలను అనుమానించి ఆ ఇంటి ఓనరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో డొంకంతా కదిలింది. ఇందంతా రెండ్రోజుల్లోనే జరిగిపోయింది. 2009 జనవరి 13న మార్కస్‌ అరెస్ట్‌ అయ్యాడు.

చంద్ర మోహన్‌ శర్మ
ఆర్‌.టి.ఐ. కార్యకర్త. లాండ్‌ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇతడి దాంపత్య జీవితం సంతృప్తిగా ఉండేది కాదంటారు. పొరుగింట్లో ఉండే ప్రీతి అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. శర్మ ఉండేది నోయిడాలో. అతడి పేరు మీద 3 లక్షల జీవిత బీమా ఉంది. అది కాకుండా, అతడు పని చేసే కంపెనీ నుంచి అతడు మరణించిన పక్షంలో అతడి కుటుంబానికి 36 లక్షల పరిహారం వస్తుంది. అందుకే తన చావుకు తనే కుట్ర పన్నుకున్నాడు. తన గర్ల్‌ ఫ్రెండ్‌ (ప్రీతి కాదు), తన బావమరిది సహాయంతో ఇల్లు లేని ఒక అనాథను చంపి, అతడి మృతదేహాన్ని తన కారులో కుక్కి, ఆ కారును మంటల్లో తగలబెట్టేశాడు. అంతా లాండ్‌ మాఫియానే శర్మను చంపిందనుకున్నారు. తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి  బెంగళూరు జంప్‌ అయ్యాడు. అక్కడి నుంచి ప్రీతి ఇంటికి ఫోన్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

జాన్‌ డార్విన్‌
ఈయన టీచర్‌. ఇంగ్లండ్‌లోని హార్టిల్‌పూల్‌లో జైలు అధికారి. నెత్తిపైన వందలు వేల పౌండ్ల అప్పుంది. ఆ అప్పు నుంచి బయట పడేందుకు భార్యతో కలిసి తన చావుకు తనే ప్లాన్‌ వేసుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం 2002 మార్చి 21న ‘చనిపోయాడు’. ఎలాగంటే.. ముందుగా జాన్‌ తన సొంత పడవలో సముద్రంలోకి వెళ్లాడు. అక్కడ నీళ్లలో మునిగి గల్లంతైనట్లు ప్రపంచానికి పిక్చర్‌ ఇచ్చాడు. దాంతో అతడి భార్యకు ఇన్సూరెన్స్‌ డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో అప్పులన్నీ తీరిపోయాయి. భార్యాభర్తలు రహస్యంగా కొత్త జీవితం ప్రారంభించారు. అయితే అంతకాలం రహస్య జీవితం గడపలేక 2007 డిసెంబర్‌ 1న జాన్‌  బయటికి వచ్చి తను గతం మర్చిపోయానని, జరిగిందేమిటో తెలీదని చెప్పాడు. పోలీసులు నమ్మలేదు. అరెస్ట్‌ చేశారు.

జాన్‌ స్టోన్‌హౌస్‌
జాన్‌ లేబర్‌పార్టీ రాజకీయ నాయకుడు. విలాసవం తమైన జీవితంతో అప్పుల పాలయ్యాడు. అప్పు లిచ్చినవాళ్లు మీద పడ్డారు. ‘ఛీ ఈ జీవితం వదు’్ద అనుకున్నాడు. తన భార్య షీలా బక్లీతో కలిసి ఫ్రెష్‌గా మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. 1974 నవంబర్‌ 20న ఈతకు వెళ్లినట్లుగా మయామీ బీచ్‌కి వెళ్లాడు. ఆ తర్వాత అదృశ్యం అయిపోయాడు. షార్క్‌లు తినేసి ఉంటాయనుకున్నారు అంతా. ‘పాపం.. మునిగిపోయి ఉంటాడు’ అని కొందరు.  పోలీసులు కూడా జాన్‌ చనిపోయి ఉంటాడనే అనుకున్నారు. అదే ఏడాది క్రిస్మస్‌కి ఆస్ట్రేలియా తిరిగొచ్చాడు జాన్‌. కొంతకాలం అజ్ఞాతంగా గడిపాడు. అంతా తనను మర్చిపోయి ఉంటారని అనుకున్నాడు కానీ, పోలీసులు తన కోసం ఇంకా వెతుకుతూనే ఉండి ఉంటారని అనుకోలేకపోయాడు. 1976 ఆగస్టులో పోలీసులకు పట్టుపడ్డాడు. జాన్‌కి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement