డేటింగ్ సైట్ పెద్దావిడ కొంపముంచింది
లండన్: బ్రిటన్‌లో డేటింగ్ సైట్ ఓ పెద్దావిడ కొంపముంచింది. డేటింగ్ చేస్తున్న వ్యక్తిని నమ్మి దాదాపు 1,40,000 పౌండ్లు(రూ.1,18,81,159.50) మోసపోయింది. మరో అవాక్కయ్యే విషయమేమిటంటే ఆమె ఒక తెలివైన ప్రొఫెసర్ కూడా.. బ్రిటన్‌లో విక్టోరియా డెర్బీషైర్ ప్రోగ్రామ్‌లో డేటింగ్ సైట్ స్కాముల్లో ఇరుక్కొని ఎంతమంది మోసపోతున్నారనే విషయాన్ని వివరించారు. గతంతో పోలిస్తే 2016లోనే ఈ సైట్ భారీనపడి చాలామంది మోసపోయారంట.
ఈ డేటింగ్ సైట్ల అనుభవాన్ని వివరించేందుకు ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేస్తున్న జుడిత్ లాథ్‌లియాన్ ఆ టీవీ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె చెప్పిన వివరాలు పరిశీలిస్తే.. ఓ వ్యక్తితో ఆన్‌లైన్ డేటింగ్ చేద్దామని నిర్ణయించుకొని నిజాయితీ, నిబద్ధత, సిన్సియారిటీ అంటూ ప్రొఫైల్ కంటెంట్ పెట్టుకున్న వ్యక్తిని ఆమె ఎంచుకుంది.
ఆ తర్వాత అతడితో ప్రేమలో పడింది. ఇరువురు పరస్పరం ప్రేమను చెప్పుకున్నారు. ఒకరు విడిచి ఒకరు ఉండలేనంతగా తయారయ్యారు. అనంతరం అవతలి వ్యక్తి తన కష్టాలు చెప్పుకోగానే కరిగిపోయన ఆప్రొఫెసర్ అతడికి దాదాపు రూ. కోటి 20లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత అవతలి వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి అనంతరం కేసు పెట్టింది. ఇలా గత ఏడాది 4000 మంది ఆన్‌లైన్ డేటింగ్ వ్యామోహంతో మోసగాళ్లబారిన పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది.