university professor
-
డాక్టర్ ఫస్ట్ లేడీ అంటే తప్పేంటి!?
అమెరికా కొత్త అధ్యక్షుడి సతీమణి డాక్టర్ జిల్ బైడెన్ తన పేరులోని ‘డాక్టర్’ అనే మాటను వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టకముందే తీసి పక్కన పెట్టేయాలని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు సూచించడం.. పురుషాహంకారంపై మహిళల ఆగ్రహాగ్నికి తాజా ఆజ్యం అయింది. ఒక మహిళ సొంతంగా ఏం సాధించినా గుర్తింపు లభించదా?! అమెరికా ప్రథమ మహిళ అయినా, భర్త చాటున ఆయన నీడలో ఉండిపోతేనే ఆమెకు గుర్తింపూ గౌరవమూనా?! తనకంటూ ఒక ఉనికిని, అస్తిత్వాన్ని ఆమె ఏర్పరచుకుంటే వెక్కిరింపులు, పరిహాసాలు తప్పవా అని హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబామా, ఇంకా ఇతర ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ జిల్ బైడెన్‌కు మద్దతుగా నిలబడుతున్నారు. కొద్ది రోజుల్లో డాక్టర్ జిల్ బైడెన్ అమెరికా ‘ప్రథమ మహిళ’ కాబోతున్నారు. అయితే ‘డాక్టర్’ అనే టైటిల్‌ని మించిన తలమానికం మాత్రం కాదు ఆమెకు ఆ ‘ఫస్ట్ లేడీ’ అనే గుర్తింపు. విద్యాబోధనలో పదమూడేళ్ల క్రితం పీహెచ్డీ చేశారు జిల్ బైడెన్. అప్పట్నుంచే ఆమె పేరుకు ముందు డాక్టర్ అనే మాట ఉంది. ఊరికే మాట వరసకు ఉండటం కాదు. ఆ మాటను ప్రాణప్రదంగా ప్రేమిస్తారు జిల్ బైడెన్. ప్రేమించడం అంటే.. ఒబామా హయాంలో ఎనిమిదేళ్ల తన ‘ద్వితీయ మహిళ’ హోదాలో కూడా ఒక్కనాడూ ఆమె తన ఉద్యోగాన్ని రెండోస్థానంలో వదిలేయలేదు! యూనివర్సిటీ ప్రొఫెసర్‌గానే ఉండిపోయారు. ఒకవేళ తను ప్రథమ మహిళ అయినా కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పడమే తన తొలి ప్రాధాన్యం అని ఎన్నికలకు ముందే ప్రకటించారు డాక్టర్ జిల్ బైడెన్. డాక్టరేట్ అన్నది ఆమె సాధించిన విజయం. అది ఆమె సంతోషం. అయితే ఆమె ప్రథమ మహిళ అయ్యాక తన పేరుకు ముందున్న ‘డాక్టర్’ అనే ఆ టైటిల్‌ను తీసి పక్కన పెట్టేయకపోతే వైట్ హౌస్ గౌరవానికి భంగం కలుగుతుందని జోసెఫ్ ఎప్‌స్టెయిన్ అనే ఆయన ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికలో డిసెంబర్ 11 న రాసిన ఒక అపహాస్య వ్యాసం ఆమె అస్తిత్వాన్ని, సంతోషాన్ని హరించే విధంగా ఉంది. ఒక స్త్రీ.. ‘డాక్టరేట్’ను తన ఉనికిగా చెప్పుకోవడం కూడా తప్పేనా! ఆమె భర్త అమెరికా అధ్యక్షుడు అయితే మాత్రం ఆమె తన డాక్టరేట్‌ను దాచిపెట్టి, అతడి నీడలో ఉండిపోవలసిందేనా అని హిల్లరీ క్లింటన్, మిషెల్ ఒబమా, మార్టిన్ లూథర్ కింగ్ కుమార్తె బెర్నీస్ కింగ్, మరికొందరు ప్రముఖులు జిల్ బైడెన్‌కు మద్దతుగా నిలబడంతో స్త్రీని లోకువ చేసే మగబుద్ధిపై అగ్రరాజ్య విద్యావంతులలో చర్చ మొదలైంది. ∙∙ ‘ఇదొక పెద్ద కామెడీ. నియమ విరుద్ధం’ అంటాడు జోసెఫ్ ఎప్‌స్టెయిన్. కామెడీ, నియమ విరుద్ధం ఏంటంటే జిల్ బైడెన్ తన పేరుకు ముందు ‘డాక్టర్’ అనే టైటిల్‌ని అలాగే ఉంచేసుకోవడం అట! వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఆయన రాసిన ఆ వ్యాసం శీర్షిక ఎలా ఉందో చూడండి. ‘వైట్ హౌస్‌లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? లేకుంటే కనుక ఒక ఎం.డి. కావాలి’. వెక్కిరింపు అన్నమాట. డాక్టర్ అంటే ఆయన ఉద్దేశంలో డెలివరీ చేయగలిగిన డాక్టర్ మాత్రమే. ఆ మాట కూడా రాశాడు. ‘జిల్ బైడెన్ ఎడ్యుకేషన్ సైన్సెస్‌లో పీహెచ్.డి చేశారు. ఆమె చేసింది మెడికల్ డిగ్రీ కాదు. కాన్పు చేసి, బిడ్డను బయటికి తీసినవాళ్లు మాత్రమే తమ పేరుకు ముందు ‘డాక్టర్’ అని ఉంచుకోవాలి’ అంటాడు! ఇంకా ఆ వ్యాసంలో జిల్ బైడెన్‌ను ‘కిడ్డో’ అని, ‘ఫ్రాడ్యులెంట్’ అని, ‘ఎ టచ్ కామిక్’ అనీ నానా మాటలూ అన్నాడు. ఆమె చిన్న పిల్లట. జోసెఫ్ ఎప్‌స్టెయిన్ కూడా చిన్నపిల్లాడేం కాదు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ‘ది అమెరికన్ స్కాలర్ మేగజీన్’ మాజీ ఎడిటర్. అంతటి మనిషిలో ఇంతటి స్త్రీద్వేషం, పురుషాహంకారం ఏమిటి?! ∙∙ జనవరి 20 తన భర్త అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జిల్ బైడెన్‌కు రెండు బాధ్యతలు అవుతాయి. అమెరికా ప్రథమ మహిళగా ఒకటి, నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్న బాధ్యత ఒకటి. ఈ రెండో బాధ్యతనే ఆమె ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పేరుకు ముందు డాక్టర్ అనే టైటిల్ ఉన్నా, లేకున్నా పాఠాలు చెప్పడం అనే ఆసక్తి ఆమెకు మొదటి నుంచీ ఉంది. జోసెఫ్ ఎప్స్టీన్ గారు మాత్రం పాఠాలు చెప్పడంలోని ఆమె నిబద్ధతను వదిలేసి, పాఠాలు చెప్పడంలో ఆమె సాధించిన డాక్టరేట్ వెంట పడ్డారు! ఈయన వ్యాసానికి వెస్టెర్న్ కెంటకీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ వాల్టన్ హాన్లీ తగిన సమాధానమే చెప్పారు. ‘జిల్ బైడెన్ తన టైటిల్‌ని వదిలేయడం కాదు. జోసెఫ్ ఎప్స్టెయినే అదనంగా ఒక డిగ్రీ పట్టాను సంపాదించాలి. తన ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోడానికి’’ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ భర్త ఎంహాఫ్.. ‘ఇలాంటివి ఒక పురుషుడిపై రాయరెందుకు?’ అని ట్వీట్ చేశారు. అందరికన్నా ముందు జిల్ బైడెన్‌కు మద్దతుగా మాట్లాడింది ఆయనే. తర్వాత మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్, మార్టిన్ లూథర్ కింగ్ కూతురు బెర్నైస్ కింగ్, జో బైడెన్ ప్రతినిధి మైఖేల్ లా రోసా, మరో ప్రథమ మహిళ మిషెల్ ఒబామా.. జిల్ బైడెన్ వైపు గట్టిగా నిలబడ్డారు. ప్రముఖులు, మెడికల్ డాక్టర్లు కూడా జిల్ బైడెన్ కు సంఘీభావం తెలిపారు. అనేకమంది మహిళలు ఆమె గౌరవార్థం తమ ట్విట్టర్ అకౌంట్లో తమ పేరుకు ముందు ‘డాక్టర్’ అనే మాట (ఆనరఫిక్)ను జత కలుపుకున్నారు. కొందరైతే ‘పురుషాహంకారం’, ‘స్త్రీ ద్వేషం’లో జోసెఫ్ ఎప్‌స్టెయిన్‌కు డబుల్ పీహెచ్డీ ఇవ్వాలి అని సున్నితంగా రెండు అంటించారు. ఇన్‌స్టాలో మిషెల్ మద్దతు ‘‘ఆడపిల్లలకు మాత్రమే కాదు. మహిళలందరికీ జిల్ రోల్ మోడల్. వైట్ హౌస్‌లో ఎనిమిదేళ్లు తనను దగ్గరగా చూశాను. ప్రొఫెషనల్ ఉమన్ అంటే తనే అనిపించింది. ఒక బాధ్యత కాదు. కాలేజ్‌లో పాఠాలు, ఇంట్లో తల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా అన్ని పాత్రల్లోనూ తను ఆదర్శంగా ఉండేవారు. ప్రొఫెషనల్‌గా ఉండే ఒక మహిళ.. ఆమె ‘డాక్టర్’, ‘మిస్’, ‘మిసెస్’, ఆఖరికి ‘ఫస్ట్ లేడీ’ అయినా, ఎంత సాధించినా ఆమె శక్తిని గౌరవించడం కన్నా, ఆమెను అపహాస్యం చేయడమే ఎక్కువగా ఉంటుంది. తరాలుగా స్త్రీ ఎదుర్కొంటున్న వివక్షే ఇది. అయినా స్త్రీ ఎప్పటికప్పుడు తనను తను నిరూపించుకుంటూనే ఉంది. జిల్ బైడెన్ కన్నా మెరుగైన ‘ఫస్ట్ లేడీ’ ఉంటారా?!’’ కాబోయే అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో మిషెల్ ఒబామా -
డ్రగ్స్ తయారీ కేసులో ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు
వాషింగ్టన్: ఉత్తర అమెరికాలోని ఓ కళాశాల ల్యాబ్‌లో మాదక ద్రవ్యాలను ఉపయోగించి మెత్‌ను తయారు చేశారని ఇద్దరు కెమిస్ట్రీ ప్రొఫెసర్లను శుక్రవారం పోలీసులు ఆరెస్టు చేశారు. ప్రొపెసర్లు ఇద్దరు ఆర్కాన్సాస్ కళాశాలకు చెందిన వారని పోలీసులు తెలపారు. వివరాలు.. హెండర్సన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఆర్కాన్సాస్ కళాశాల ప్రొఫెసర్లు టెర్రీ డేవిడ్ బాటెమన్, బ్రాడ్లీ అలెన్ రోలాండ్లు మెథాంపేటమిన్ తయారు చేశారని, ఇందుకోసం మాదక ద్రవ్యాల పరికరాలను కూడా వాడినట్లు సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే దీనిపై కళాశాల ప్రతినిధి టీనా హాల్ మాట్లాడుతూ.. వారిద్దరు గత అక్టోబర్ 11 నుంచి అధికారిక సెలవులలో ఉన్నారని తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం కళాశాల సైన్స్ ల్యాబ్ నుంచి ఏదో కెమికల్ వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించామని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా ల్యాబ్‌లో మాదక ద్రవ్యాల సామాగ్రిని ఉపమోగించి మెథాంపేటమిన్ అనే కొత్త కెమికల్ డ్రగ్‌ను తయారు చేసినట్లుగా తెలింది. దీంతో కెమికల్ డ్రగ్ వల్ల కళాశాల క్యాంపస్ ఆవరణం అంతా దుర్వాసనా రావడంతో మూడు రోజుల పాటు కళాశాలను మూసివేశామన్నారు. ఇక ల్యాబ్‌ను శుభ్రం చేయించి తిరిగి అక్టోబర్ 29 కళాశాలను తిరిగి ప్రారంభించామని టీనా హాల్ మీడియాకు తెలిపారు. -
నా భార్య ఇంట్లో లేదు.. వచ్చి వంట చేయి!
డెహ్రాడూన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. హాస్టల్ విద్యార్ధినికి అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపుతూ.. వేధింపులకు గురిచేశాడు. విద్యార్ధిని పట్ల పిచ్చి వేషాలు వేసిన ఆ ప్రొఫెసర్‌కు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో దెబ్బకు దిమ్మతిరిగింది. ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోని మహిళల హాస్టల్ వార్డెన్ అదే యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్ హస్టల్లో చదువుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్ అర్ధరాత్రి ఫోన్ చేసి ‘ప్రస్తుతం నా భార్య ఇంట్లో లేదు. నువ్వు వచ్చి వంట చేయి’ అని పిలిచాడు. అయితే అప్పటికే ప్రొఫెసర్ పలుమార్లు ఫోన్లు, మెసేజ్‌లు చేయడంతో విసిగిపోయిన విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని వాపోయిన సదరు విద్యార్థి విశ్వవిద్యాలయ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తింది. దీనికితోడు ప్రొఫెసర్ నుంచి వచ్చిన సందేశాలను ఆధారాలుగా చూపించింది. ఈ వ్యవహారం కాస్తా గవర్నర్ బేబీ రాణి మౌర్య దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై స్పందించిన గవర్నర్ గురువారం ప్రొఫెసర్‌పై దర్యాప్తుకు ఆదేశించారు. ఇంత వరకు సమస్యపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అయితే విద్యార్ధి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వనందున నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని యూనివర్సిటీ డీన్ సలీల్ తివారి తెలిపారు. అనంతరం ఈ విషయంపై వెంటనే దర్యాప్తు జరపాలని, వార్డెన్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బాలికల హాస్టళ్ల నిర్వహణపై గవర్నర్ నివేదిక కోరారు. హస్టల్లోని అమ్మాయిలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని యూనివర్పిటీ రిజిస్టార్ శర్మ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామన్నారు. కాగా తాజా ఘటనపై విద్యార్థి సంఘాలు, విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులనే వేధింపులకు గురిచేస్తున్న అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
17 ఏళ్ల తర్వాత వచ్చి ఉద్యోగం కావాలన్నాడు
న్యూఢిల్లీ: తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్ అమెరికాలో ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి 17 ఏళ్ల తర్వాత భారత్ వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ప్రధాని మోదీని కోరిన ఘటన ఇటీవల జరిగింది. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజేష్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లో పోస్టింగ్ అందుకున్నాడు. పీహెచ్డీ కోసం రెండేళ్లకాలానికి ప్రభుత్వ అనుమతితో 1996లో అమెరికా వెళ్లారు. తర్వాత భారత్‌కు రాలేదు. ఉత్తరాఖంఢ్‌లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. తర్వాత 2001 ఆగస్టు 12 వరకూ సెలవులు కోరుతూ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఓకే చెప్పింది. మళ్లీ 2001 డిసెంబర్ 31 వరకూ సెలవులు పొడిగించుకున్నారు. మళ్లీ ఆరునెలలు కావాలంటూ దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం తిరస్కరించింది. విధుల్లో చేరాలని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, చట్టం ప్రకారం ఐదేళ్లకు మించి విధులకు దూరంగా ఉండటంతో విధుల నుంచి 2003లో తొలగించారు. తనను విధుల్లో చేర్చుకోవాలంటూ 2017లో మోదీకి ఆయన లేఖ రాశారు. మోదీ దాన్ని తిరస్కరించడంతో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడా తిరస్కరణే ఎదురైంది. కొద్ది రోజుల పాటు సెలవులు పెడితేనే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటిది సంవత్సరాల తరబడి సెలవులు ఎలా పెడతారని ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసింది. -
శ్రీకాకుళం..మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకొండి
సాక్షి, శ్రీకాకుళం : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.inవెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. మీ ఓటుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఈ మొబైల్ నంబరుకు సంప్రదించవచ్చు. జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూం సెల్ నెం: 8186923639 -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఉపవాసంతో జీవక్రియ మెరుగు
టోక్యో: ఉపవాసం జీవక్రియను మెరుగుపరుస్తుందని తాజా సర్వే పేర్కొంది. కేవలం శరీర బరువు తగ్గడమే కాకుండా అనామ్లజనకాల ఉత్పత్తికి, వృద్ధాప్యానికి దారితీసే లక్షణాలకు చెక్ పెడుతుందని వివరించింది. ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సర్వే నిర్వహించారు. ఉపవాసంవల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని కొనసాగించినట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో తెలిపారు. ఆహారం తీసుకోనప్పుడు శరీరంలో జరుగుతున్న మార్పులు, రసాయనిక చర్యలను నిశితంగా పరిశీలించారు. -
డేటింగ్ సైట్ పెద్దావిడ కొంపముంచింది
లండన్: బ్రిటన్‌లో డేటింగ్ సైట్ ఓ పెద్దావిడ కొంపముంచింది. డేటింగ్ చేస్తున్న వ్యక్తిని నమ్మి దాదాపు 1,40,000 పౌండ్లు(రూ.1,18,81,159.50) మోసపోయింది. మరో అవాక్కయ్యే విషయమేమిటంటే ఆమె ఒక తెలివైన ప్రొఫెసర్ కూడా.. బ్రిటన్‌లో విక్టోరియా డెర్బీషైర్ ప్రోగ్రామ్‌లో డేటింగ్ సైట్ స్కాముల్లో ఇరుక్కొని ఎంతమంది మోసపోతున్నారనే విషయాన్ని వివరించారు. గతంతో పోలిస్తే 2016లోనే ఈ సైట్ భారీనపడి చాలామంది మోసపోయారంట. ఈ డేటింగ్ సైట్ల అనుభవాన్ని వివరించేందుకు ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేస్తున్న జుడిత్ లాథ్లియాన్ ఆ టీవీ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె చెప్పిన వివరాలు పరిశీలిస్తే.. ఓ వ్యక్తితో ఆన్లైన్ డేటింగ్ చేద్దామని నిర్ణయించుకొని నిజాయితీ, నిబద్ధత, సిన్సియారిటీ అంటూ ప్రొఫైల్ కంటెంట్ పెట్టుకున్న వ్యక్తిని ఆమె ఎంచుకుంది. ఆ తర్వాత అతడితో ప్రేమలో పడింది. ఇరువురు పరస్పరం ప్రేమను చెప్పుకున్నారు. ఒకరు విడిచి ఒకరు ఉండలేనంతగా తయారయ్యారు. అనంతరం అవతలి వ్యక్తి తన కష్టాలు చెప్పుకోగానే కరిగిపోయన ఆప్రొఫెసర్ అతడికి దాదాపు రూ. కోటి 20లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత అవతలి వ్యక్తి కనిపించకుండా పోవడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి అనంతరం కేసు పెట్టింది. ఇలా గత ఏడాది 4000 మంది ఆన్లైన్ డేటింగ్ వ్యామోహంతో మోసగాళ్లబారిన పడ్డారని ఆ టీవీ చానెల్ తెలిపింది.