డెహ్రాడూన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే వక్రమార్గం పట్టారు. హాస్టల్ విద్యార్ధినికి అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపుతూ.. వేధింపులకు గురిచేశాడు. విద్యార్ధిని పట్ల పిచ్చి వేషాలు వేసిన ఆ ప్రొఫెసర్‌కు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలతో దెబ్బకు దిమ్మతిరిగింది. ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలోని మహిళల హాస్టల్ వార్డెన్ అదే యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్ హస్టల్‌లో చదువుకుంటున్న ఓ విద్యార్థినికి ప్రొఫెసర్ అర్ధరాత్రి ఫోన్ చేసి ‘ప్రస్తుతం నా భార్య ఇంట్లో లేదు. నువ్వు వచ్చి వంట చేయి’ అని పిలిచాడు. అయితే అప్పటికే ప్రొఫెసర్ పలుమార్లు ఫోన్లు, మెసేజ్‌లు చేయడంతో విసిగిపోయిన విద్యార్థిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది.
అయితే తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదని వాపోయిన సదరు విద్యార్థి విశ్వవిద్యాలయ క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తింది. దీనికితోడు ప్రొఫెసర్ నుంచి వచ్చిన సందేశాలను ఆధారాలుగా చూపించింది. ఈ వ్యవహారం కాస్తా గవర్నర్ బేబీ రాణి మౌర్య దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై స్పందించిన గవర్నర్ గురువారం ప్రొఫెసర్‌పై దర్యాప్తుకు ఆదేశించారు. ఇంత వరకు సమస్యపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అయితే విద్యార్ధి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వనందున నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని యూనివర్సిటీ డీన్ సలీల్ తివారి తెలిపారు. అనంతరం ఈ విషయంపై వెంటనే దర్యాప్తు జరపాలని, వార్డెన్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే బాలికల హాస్టళ్ల నిర్వహణపై గవర్నర్ నివేదిక కోరారు. హస్టల్‌లోని అమ్మాయిలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని యూనివర్పిటీ రిజిస్టార్ శర్మ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామన్నారు. కాగా తాజా ఘటనపై విద్యార్థి సంఘాలు, విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులనే వేధింపులకు గురిచేస్తున్న అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment