ఆన్‌లైన్ ప్రేమకు... తాళి కట్టు! | Online dating and match-making apps in Love | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ ప్రేమకు... తాళి కట్టు!

Published Sun, Sep 18 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

ఆన్‌లైన్ ప్రేమకు... తాళి కట్టు!

ఆన్‌లైన్ ప్రేమకు... తాళి కట్టు!

‘తాళికట్టు శుభవేళ... మెడలో కల్యాణమాల...’ అన్నారో సినీకవి. కానీ, చదువు, సంపాదన - అన్నీ పెరిగిన ఆధునిక డిజిటల్ తరం ‘ప్రేమ పుట్టు శుభవేళే...’ మెడలో కల్యాణమాలకు సిద్ధం అంటోంది. అంతా పెద్దల చేతికే వదిలేయకుండా, అభిరుచులు కలసిన భాగస్వామి కోసం కొత్తగా స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ డేటింగ్, మ్యాచ్ మేకింగ్ యాప్స్‌లో అన్వేషణ సాగిస్తోంది. పెరుగుతున్న ఆ యాప్‌లు, క్రమంగా వాటికి పెరుగుతున్న ఆదరణే అందుకు సాక్షి!
 
అది 1980....
డిగ్రీ పూర్తి చేసిన లక్ష్మికి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజారావుకు కూడా తగిన వధువు ఎవరా అని వెతుకుతున్నారు. ఈ రెండు కుటుంబాలకూ ముడిపెడితే బాగుంటుందని... తెలిసిన దూరపు బంధువులు అనుకున్నారు. అంతే... అమ్మాయి ఇంట్లో పెళ్ళి చూపులు... పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు పెద్దల ఎదుటే మాట్లాడుకున్నారు. పెద్దలకే నిర్ణయం ఇచ్చేశారు. ఇంకేం... వెంటనే బాజా బజంత్రీలు...
 
కట్ చేస్తే... 2010...
ఈసారి రాజారావు, లక్ష్మి దంపతుల పెద్దమ్మాయి పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయింది. పెళ్ళి వయసుకొచ్చింది. కాలం మారింది. ఉమ్మడి కుటుంబాలు లేవు. వ్యష్టి కుటుంబాలొచ్చాయి. బంధుత్వాలు పలచబడ్డాక, పత్రికల్లో పెళ్ళిపందిళ్ళ ప్రకటనలు... మ్యారేజ్ బ్యూరోలతోనే పెళ్ళి సంబంధాలు కుదురుతున్నాయి. పెళ్ళిచూపుల్లో అబ్బాయి, అమ్మాయి కాసేపు విడిగా మాట్లాడుకున్నారు. తాము ఒకరికొకరం సరిజోడీ అనుకున్నారు. పెళ్ళికి ముందే అబ్బాయి కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశానికి అమ్మాయి వెళ్ళింది. అబ్బాయి, అమ్మాయి కలిసి షాపింగ్‌లకూ వెళ్ళొచ్చారు. ఒకరినొకరు మరింత తెలుసుకున్నారు. పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది.

మళ్ళీ కట్ చేస్తే... 2016... ఇప్పుడు రాజారావు, లక్ష్మి దంపతుల ఆఖరి అమ్మాయికి పెళ్ళి చేయాలి. వైఫై, వాట్సప్ తరంలో కొత్త ట్రెండ్స్ వచ్చేశాయి. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు, మ్యారేజ్ బ్యూరో పెళ్ళిళ్ళను కూడా దాటి... ఇప్పుడు ఆన్‌లైన్ వేదికలు వెలిశాయి. ఫేస్‌బుక్ ఛాట్‌లను మించి, మొబైల్ ఫోనుల్లో డేటింగ్ యాప్స్ వచ్చేశాయి. స్మార్ట్‌ఫోన్స్‌లోని ఆ యాప్స్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అమ్మాయి, అబ్బాయి పరిచయమవుతున్నారు. పరిచయం పెరిగాక మరింత అర్థం కావడం కోసం కలసి తిరుగుతున్నారు. అన్నీ కుదిరాయి అనుకుంటేనే, పెళ్ళి పీటలెక్కుతున్నారు. లేదంటే... మరో పార్ట్‌నర్ కోసం ఆన్‌లైన్ అన్వేషణ! ఇదీ లేటెస్ట్ ట్రెండ్!! రాజారావు గారి అమ్మాయి మొబైల్ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్‌ల ఎలర్ట్ మెసేజ్‌లతో తరచూ ట్రింగ్... ట్రింగ్ అంటోంది. వెల్‌కమ్ టు ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్... సరికొత్త ఆన్‌లైన్ ప్రేమ, పెళ్ళిసంబంధాల యాప్స్‌కు స్వాగతం!
 
ఆర్థిక సరళీకరణ తరువాత... అంటే 1991 తరువాత పుట్టి, పెరిగిన భారతీయ యువతీ యువకులు ఇప్పుడు పెళ్ళీడుకొచ్చారు. ఈ తరం ఇప్పుడు పెళ్లి సంప్రదాయానికి సంబంధించి ఏళ్ళ తరబడిగా ఉన్న పద్ధతుల్ని తిరగరాస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ఎరేంజ్డ్ మ్యారేజ్‌ల వ్యవస్థ ఈ 21వ శతాబ్దంలో పూర్తిగా రూపం మార్చు కొంటోంది. ఈ సరికొత్త మేకోవర్ గురించి తెలుసుకుందాం..
 
తరం మారుతోంది... స్వరం మారుతోంది!
నిజానికి, మన దేశంలో పెళ్ళిళ్ళ మార్కెట్ కొన్ని వందల కోట్ల విలువైన వ్యాపారం. ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళ క్రితమే 1997లో మన దేశంలో ‘షాదీ డాట్‌కామ్’, ‘భారత్ మ్యాట్రిమొనీ డాట్‌కామ్’ లాంటి పాపులర్ పెళ్ళిసంబంధాల వెబ్‌సైట్లు మొదలయ్యాయి. నిజానికి, అప్పట్లో మన జనాభాలో 0.1 శాతం మందే ఇంటర్నెట్ వాడేవాళ్ళు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగాక, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పల్లెల్లోకి కూడా చొచ్చుకుపోయాక పరిస్థితి బాగా మారింది. ఒకప్పుడు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో తల్లితండ్రులదే ఆఖరి మాట. కులం, మతం, ప్రాంతం లాంటివెన్నో చూస్తే కానీ కథ పెళ్ళి దాకా వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు డేటింగ్ యాప్స్ ద్వారా ఆడపిల్లలకు సైతం తమ జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కావాల్సినంత ఛాయిస్ వచ్చింది. కెరీర్, జీవితాశయం లాంటివి దృష్టిలో పెట్టుకొనే, పెళ్ళికి సిద్ధమవుతున్నారు.
 
ఇదో పెద్ద మార్కెట్!
ప్రస్తుతం మన దేశ జనాభాలో దాదాపు సగం మంది పాతికేళ్ళ లోపు వాళ్ళే. ఇక, దేశంలో 18 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు వారి లెక్క చూస్తే, వారిలో దాదాపు 25 కోట్ల మంది ఒంటరి పక్షులే. ఇంతమంది ప్రపంచంలో మరెక్కడా లేరు. చివరకు చైనాలో కూడా లేరు. దానికి తోడు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడం కూడా ఆన్‌లైన్ డేటింగ్, పెళ్ళిళ్ళ వ్యాపారానికి కలిసొచ్చింది. మన దేశంలోని 25 కోట్ల మంది ఒంటరిపక్షుల్లో సుమారు 23.5 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు. అందుకే, డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు ఈ డేటింగ్ - పెళ్ళిళ్ళ వ్యాపారం శరవేగంగా పెరుగుతోంది. ఇది ఏకంగా దాదాపు రూ.13 వేల కోట్ల పైచిలుకు వ్యాపారమని ఒక అంచనా. ఇది గుర్తించబట్టే చాలామంది యువ పారిశ్రామికవేత్తలు మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ద్వారా ఎక్కువమందిని ఆకర్షించి, సొమ్ము చేసుకొనే పనిలో ఉన్నారు.
 
నిజానికి, పెళ్ళి కాక ముందే అబ్బాయి, అమ్మాయి పరిచయం పెంచుకొని, స్నేహంగా తిరగడమనేది కొన్నేళ్ళుగా ఉన్నదే. అయితే, ఒకప్పుడు అది కేవలం అగ్రశ్రేణి 2 శాతం మందికే పరిమితం. కానీ, ఇప్పుడు అది ప్రధాన జీవన స్రవంతిలోని దిగువ శ్రేణి జనాభాకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు జరుగుతున్నా, ఆర్థిక పురోగమన కాలానికి చెందిన ఆధునిక తరం యువతీ యువకులు పాత పద్ధతుల్ని పక్కనపెట్టి, పాశ్చాత్య ఆలోచనల్ని స్వాగతిస్తున్నారు.
 
బంధనాలు తెంచుకొని... పంజరాలు దాటుకొని!
ఈ డిజిటల్ శకంలో పాశ్చాత్య ప్రపంచానికీ, మనకూ మధ్య తేడా క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. అమ్మాయిల్లో అక్షరాస్యత, ఉద్యోగినుల శాతం గణనీయంగా పెరగడంతో ప్రేమ, పెళ్ళి లాంటి విషయాల్లో పితృస్వామ్య భావజాలాల సంకెళ్ళు క్రమంగా తెగిపోతున్నాయి.

1981 నుంచి 2011 మధ్య కాలంలో మన దేశంలో అమ్మాయిల అక్షరాస్యతా రేటు 29.8 శాతం నుంచి 65.5 శాతానికి పెరిగింది. అలాగే, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యల్లో చేరే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే, వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే ఆడవారి సంఖ్య గడచిన దశాబ్ది  కాలంలో 50 లక్షల నుంచి 60 లక్షలైంది. పైకి ఇది కొద్దిగానే అనిపిస్తున్నా, అవ్యవస్థీకృత రంగంలో ఇంతకన్నా ఎన్నో రెట్ల మంది పనిచేస్తున్నారు.    

అలాగే, 2001 నుంచి 2011 మధ్య కాలంలో 20 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసు అమ్మాయిల్లో అవివాహితుల సంఖ్య ఏకంగా 68 శాతం మేర పెరిగినట్లు జాతీయ జనాభా లెక్కల సమాచారం. అంటే, స్త్రీలు చదువు, కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూ, ఆ తరువాతే పెళ్ళి అంటున్నారు.

ఆర్థికంగా సొంత కాళ్ళ మీద నిలబడ్డ అమ్మాయి, తన జీవిత భాగస్వామి ఎంపికలో కూడా బంధనాలు తెంచుకొని, పంజరాలు దాటుకొని, తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని వినియోగించుకుంటోంది. ‘ట్రూలీ మ్యాడ్లీ’ సహా ‘వూ’, ‘హింజ్’, ‘ఏక్ కాఫీ’, ‘మ్యాచిఫై’ లాంటి చాలా యాప్స్ ఇవాళ ఇండియాలో సక్సెస్ అవడం వెనక ఇవన్నీ కారణాలే! కేవలం గడచిన రెండేళ్ళలో లక్షల మంది ఈ యాప్స్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవడం గమనించాల్సిన విషయం.
 
నకిలీరాయుళ్ళ ఏరివేత!
అయితే, ఈ డేటింగ్, మ్యాచ్ మేకింగ్ యాప్‌ల బిజినెస్ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దగ్గర కొద్దిగా డిఫరెంట్ అనుకోవాలి. అక్కడలా ఇక్కడ ఒక్కరు నలుగురితో తిరగడాన్ని హర్షించరు. అలాగే, కాలక్షేపం డేటింగ్ ప్రమాదాలు ఎక్కడైనా ఎక్కువే. అందుకే, ఈ విషయంలో యాప్‌లు, యూజర్లు జాగ్రత్తగా ఉండక తప్పదు. చాలా యాప్‌లు నకిలీ పెళ్ళికొడుకులు, వేధింపురాయుళ్ళ గోల తగ్గించడానికి, యాప్‌లో రిజిస్టర్ అయ్యే టైమ్‌లోనే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా లాగిన్ అయ్యేలా చూస్తున్నాయి. రిజిస్టర్ అవుతున్న వారి వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నాయి.

ఇండియాలోని మొట్టమొదటి డేటింగ్ యాప్ ‘ట్రూలీ మ్యాడ్లీ’లో రిజిస్టర్ చేసుకున్న పది రోజుల్లోనే దాదాపు 25 శాతం మంది మగ అప్లికెంట్లను తొలగించారు. ఇక, కొన్ని డేటింగ్ స్టార్టప్ సంస్థలైతే ముందుగా టెలిఫోన్‌లో ఇంటర్వ్యూ చేసి కానీ, వాళ్ళకు తమ యాప్‌లో సభ్యత్వం ఇవ్వడం లేదు. అందుకే, వీటిలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ మంది సభ్యులు. అలాగే, తమకు ఇష్టం లేనివాళ్ళు సంప్రతించే అవకాశం లేకుండా ఆ ప్రొఫైల్స్‌ను ఆడవాళ్ళు బ్లాక్ చేయవచ్చు. ఫిర్యాదూ చేయవచ్చు.
 
ప్రేమకు వరం... భవిష్యత్ తరం!
ఈ మాత్రం రక్షణ ఉండడంతో, మన దేశంలో క్రమంగా డేటింగ్ యాప్‌ల పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళూ ఆకర్షితులవుతున్నారు. రెండేళ్ళ క్రితం మొదలైన ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ‘ట్రూలీ మ్యాడ్లీ’కి ఇప్పుడు దాదాపు 20 లక్షల మంది యూజర్లున్నారు. అంతేకాదు... ఢిల్లీ శివార్లలోని ఈ స్టార్టప్ సంస్థ ఆఫీసులో 40 మంది ఉద్యోగినులుంటే, వాళ్ళలో సగం మంది అమ్మాయిలే! అదీ 30 ఏళ్ళ లోపువాళ్ళు. పైగా, అందరూ చిన్న చిన్న పట్నాల నుంచి పైకొచ్చి, బాగా చదువుకొని, తమ ఆశల అన్వేషణలో ఢిల్లీ బాట పట్టినవాళ్ళు. తాము జీవితాంతం కలసి నడవాల్సిన భాగస్వామి ఎంపిక బాధ్యత పెద్దలదని వదిలేయకుండా, డేటింగ్ యాప్స్ వాడుతూ, స్వతంత్రంగా వరుడి ఎంపికలో బిజీగా ఉంటున్నవాళ్ళు! ఇదంతా మారుతున్న ముఖచిత్రానికి నిదర్శనం.

మరో నాలుగేళ్ళలో 2020 నాటి కల్లా భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ కానుంది. 125 కోట్ల భారతీయ జనాభా సగటు వయసు 29 ఏళ్ళు కానుంది. అంటే, సినిమా ప్రేమకథలు, ప్రేమలు, ప్రేమికుల దినోత్సవాలు, కులాలు - కట్నకానుకల పట్టింపులకు దూరంగా పెళ్ళిళ్ళు - వీటి మధ్యే పెరిగిన కొత్త తరం పగ్గాలు చేపడుతుంది. ప్రేమా జిందాబాద్! ప్రేమతో పెళ్ళికే జిందాబాద్! అంటుంది. డేటింగ్ యాప్ అందుకు ఒక చిన్న... కొత్త మజిలీ... అంతే!
 
ప్రేమకే పట్టం
మనదేశంలో ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు క్రమంగా తగ్గుతుంటే, వధూవరులు ఒకరినొకరు తెలుసుకొని, చేసుకుంటున్న ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి. పదేళ్ళ క్రితం మన భారతీయ వివాహాల్లో ప్రేమ పెళ్ళిళ్ళు కేవలం 5 శాతమే. కానీ, ఇప్పుడవి ఏకంగా 30 శాతానికి పెరిగాయి. కొన్ని ప్రధాన నగరాల్లో అయితే, ఈ శాతం ఇంకా చాలా ఎక్కువని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇండియాలో ప్రేమ వివాహాలు పెరగడం గురించి ఏకంగా పుస్తకమే రాసిన షెఫాలీ సంధ్య ఈ సంగతి వెల్లడించారు.
 
డేట్... యాప్... హుర్రే!
డేటింగ్ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో అంతకంతకూ పెరుగుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. ఇంకా చెప్పాలంటే, ఆసియాలోకెల్లా అతి పెద్దది. అందుకు తగ్గట్లే కొన్నేళ్ళుగా మన దేశంలో ఈ డేటింగ్ యాప్‌ల మార్కెట్ బాగా విస్తరించింది. ప్రస్తుతం దాదాపు డజనుకు పైగా కంపెనీలు ఇండియాలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే, స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్ళలో 10 లక్షల పైగా మంది ఇలాంటి యాప్‌లలో కనీసం ఒక్కటైనా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
 
ఇవి మీకు తెలుసా?
ప్రస్తుతం మన దేశంలో వాడుకలో ఉన్న కొన్ని ప్రధాన డేటింగ్ యాప్స్
1. టిండర్: భావసారూప్యం ఉండి, ఒకే ఏరియాలో ఉన్న వ్యక్తుల్ని కలుపుతుంది  కాలక్షేపం స్నేహాల యాప్‌గా పాపులర్. ప్రపంచవ్యాప్తంగా రోజూ 2.6 కోట్ల మ్యాచ్‌లు ఈ డేటింగ్ యాప్ ‘టిండర్’ ద్వారా జరుగుతుంటాయి  2012లో వచ్చిన ఈ యాప్ ప్రస్తుతం 196 దేశాల్లో అందుబాటులో ఉంది   ఆసియాలో కెల్లా ఈ యాప్‌కు అతి పెద్ద మార్కెట్ మన దేశమే  ఈ యాప్‌లో ఛాటింగ్ చేస్తూ అత్యంత ఎక్కువ సమయం గడుపుతున్నది భారతీయులే.
2. వూ: ఈ డేటింగ్ యాప్‌లో పెళ్ళయినవాళ్ళు చేరడానికి వీలుండదు. పాతిక నుంచి 35 ఏళ్ళ మధ్యవయస్కుల్లో అర్థవంతమైన సంభాషణలకి వేదిక  ఈ యాప్ వాడేవారిలో 23 శాతం మంది ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం వారు. 21 శాతం మంది ముంబయ్ వాసులు. 18 శాతం మంది బెంగుళూరు వాళ్ళు. 10 శాతం మంది పుణే వాస్తవ్యులు   ఇందులో జరిగే మ్యాచ్‌లలో అధిక శాతం 24 - 30 ఏళ్ళ మధ్య వయస్కుల వి.

3. హ్యాప్‌న్: ప్రపంచవ్యాప్తంగా కోటీ 95 లక్షల మంది ఈ డేటింగ్ యాప్ వాడుతున్నారు  ఈ ఏడాది మే నెలలోనే ఇండియాలో ఇది ఆరంభమైంది  ఈ ఏడాది చివరికల్లా మన దేశంలో 10 లక్షల మంది యూజర్లను సంపాదించాలన్న లక్ష్యంతో సాగుతోంది.

4. ట్రూలీ మ్యాడ్: భారతదేశంలోని మొట్టమొదటి ఆన్‌లైన్ డేటింగ్, మ్యాచ్ మేకింగ్ యాప్. వివరాలు సరిచూసి, సింగిల్‌గా ఉన్నవాళ్ళనే ఈ యాప్ అనుమతిస్తుంది  2014లో ‘ప్రేమికుల రోజు’న ఈ యాప్ మొదలైంది  ఇప్పటికి దాదాపు 20 లక్షల మందికి పైగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు  ఈ యాప్ వాడుతున్నవాళ్ళు సగటున ప్రతి రోజూ 46 నిమిషాల టైమ్ దీని మీదే వెచ్చిస్తున్నారు.

5. ఇన్‌క్లోవ్: దివ్యాంగుల కోసం ఏర్పాటైన ప్రపంచంలోని మొట్టమొదటి డేటింగ్ యాప్ ఇది.
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement