'కంగారూ'ల వేటకు సిద్ధం!
నేటినుంచి ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం
వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో భారత్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్
వన్డే ప్రపంచకప్‌లు, ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో మినహా భారత్, ఆసీస్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్ జరగలేదు. తొలిసారి టీమిండియా టెస్టులు ఆడకుండా కేవలం వన్డేలు, టి20 మ్యాచ్‌ల కోసం కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమి జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగానే అదే వేదికలో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ధోని సేన తన సత్తా చాటి ఈసారైనా కంగారూలను వేటాడుతుందా..!
పెర్త్: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ముందు శుక్రవారం టీమిండియా తొలి ప్రాక్టీస్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. అయితే ఇది టి20 ప్రాక్టీస్ మ్యాచ్ కావడం విశేషం. టి20 జట్టు కోసం ఎంపిక చేసిన కొంత మంది ఆటగాళ్లు లేకుండా వన్డే జట్టుతోనే ధోని సేన వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో భారత్ తలపడుతుంది.
43 డిగ్రీల ఉష్ణోగ్రతలో...
బుధవారం ఆస్ట్రేలియా చేరుకున్న భారత క్రికెటర్లు గురువారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కెప్టెన్ ధోనితో పాటు కోహ్లి, ధావన్ ఎక్కువ సేపు నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేశారు. చాలా కాలం తర్వాత జట్టుతో చేరిన పేసర్ షమీ కూడా నిర్విరామంగా బౌలింగ్ చేశాడు. 43 డిగ్రీల తీవ్రమైన ఎండలో కూడా మన ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. భారత్ తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈ నెల 9న ఆడుతుంది.
జట్టునుంచి రైనాలాంటి సీనియర్ స్థానం కోల్పోవడంతో పాటు కొంత మంది కొత్త ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో టీమ్ కాంబినేషన్‌పై ఒక అంచనాకు వచ్చేందుకు ధోనికి ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయి. ఆసీస్ బయల్దేరే ముందు 6, 7 స్థానాల్లో గుర్‌కీరత్, మనీశ్ పాండేలకు అవకాశం ఇవ్వడం గురించి మాట్లాడిన ధోని వారిని ప్రాక్టీస్ మ్యాచ్‌లో పరీక్షించే అవకాశం ఉంది. మరో వైపు ప్రధాన ఆటగాళ్లు ఉన్న పెర్త్ జట్టు ఒక వైపు బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొంటుండగా... ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతున్న వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌లో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు ఉన్నారు.