పార్ల్: సఫారీ గడ్డపై రెండోసారి వన్డే సిరీస్ సాధించాలనే లక్ష్యంతో... నేడు దక్షిణాఫ్రికాతో జరిగే చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమిండియా తొలి వన్డేలో ఘనవిజయం సాధించినా... రెండో వన్డేలో మాత్రం తడబడింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు.
మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఆకట్టుకోలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అర్‡్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ అదరగొట్టగా... ముకేశ్ కుమార్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడో మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఫామ్ కోల్పోయిన తిలక్ వర్మ స్థానంలో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
మరోవైపు రెండో వన్డేలో సాధించిన విజయంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓపెనర్ టోని జోర్జి సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. మార్క్‌రమ్, రీజా హెన్‌డ్రిక్స్, క్లాసెన్, డసెన్, మిల్లర్ కూడా రాణిస్తే ఆ జట్టు మరో విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. మూడో మ్యాచ్ వేదికైన పార్ల్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. గత ఏడాది ఈ వేదికపై భారత్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment