వంద శాతం ఫిట్‌గా మారేందుకే.. | Rohit Sharma begins fitness training at NCA | Sakshi
Sakshi News home page

వంద శాతం ఫిట్‌గా మారేందుకే..

Published Sun, Nov 22 2020 5:20 AM | Last Updated on Sun, Nov 22 2020 11:03 AM

Rohit Sharma begins fitness training at NCA - Sakshi

భారత క్రికెట్‌కు సంబంధించి ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసిన అంశం రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌... ఐపీఎల్‌ జరుగుతున్నప్పుడు అతను గాయపడి నాలుగు మ్యాచ్‌లకు దూరం కావడం... ఫిట్‌గా లేడంటూ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం...ఆపై పూర్తిగా కోలుకోకుండానే రోహిత్‌ బరిలోకి దిగడం... గంగూలీ హెచ్చరిక, రవిశాస్త్రి వ్యాఖ్య... మళ్లీ టెస్టు జట్టులో చోటు... ఇలా ఎక్కడా అతని గాయంపై స్పష్టత లేకుండా వ్యవహారం సాగింది. చివరకు జాతీయ క్రికెట్‌ అకాడమీకి (ఎన్‌సీఏ) చేరుకున్న రోహిత్‌... తొలిసారి తన గాయం తీవ్రతపై పెదవి విప్పాడు. వంద శాతం ఫిట్‌గా మారేందుకే ఆస్ట్రేలియా వన్డే, టి20లకు దూరమైనట్లు వెల్లడించిన అతను... తన గాయం వివాదంగా మారడం పట్ల అసంతృప్తిని ప్రదర్శించాడు. 
 
బెంగళూరు:
ఐపీఎల్‌లో తాను కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ విషయాన్ని అటు బీసీసీఐకి, ఇటు ముంబై ఇండియన్స్‌కు స్పష్టంగా తెలియజేసినట్లు భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. ఈ అంశంపై బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అతను చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఆ సమయంలో బయట అసలు ఏం జరుగుతుందో, అందరూ దేని గురించి చర్చించుకుంటున్నారో కూడా నాకు తెలీదు. నేను బీసీసీఐ, ముంబై ఇండియన్స్‌కి గాయం గురించి స్పష్టంగా వివరించాను. గాయమైన తర్వాత నేను తర్వాతి మ్యాచ్‌లు ఆడగలనా లేదా అని ఆలోచించాను.  అయితే మైదానంలో దిగితే తప్ప దాని తీవ్రత తెలీదు. టి20 ఫార్మాట్‌లో ఎక్కువగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆడగలనంటూ ముంబై యాజమాన్యానికి చెప్పాను. ప్రతీ రోజూ ఫిట్‌నెస్‌ మెరుగవుతుండటంతో మళ్లీ బరిలోకి దిగాను. బాగుంటేనే ప్లే ఆఫ్స్‌ ఆడతానని, లేదంటే తప్పుకుంటానని కూడా వారికి స్పష్టం చేశాను. నా గాయం గురించి, ప్లే ఆఫ్స్‌లో ఆడటం, ఆస్ట్రేలియాకు వెళ్లడం గురించి ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు అంటే నేను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రోహిత్‌ శర్మ వివరించాడు.  

ముందు జాగ్రత్త కోసమే...
కండరాల గాయం నుంచి తాను చాలా వరకు కోలుకున్నా... మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని రోహిత్‌ వెల్లడించాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాకే ఆస్ట్రేలియాకు వెళ్లి టెస్టులు ఆడతానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడు నా గాయం తీవ్రత చాలా వరకు తగ్గింది. అయితే మరింత ఫిట్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నా. టెస్టు ఫార్మాట్‌లో ఆడాలంటే నా వైపు నుంచి ఎలాంటి లోపం ఉండకూడదని భావించే ఇప్పుడు ఎన్‌సీఏకు వచ్చా. పూర్తిగా మెరుగయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే 11 రోజుల వ్యవధిలో 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న వన్డే, టి20 సిరీస్‌ల కోసం తొందరపడలేదు. మరో 25 రోజులు నేను శ్రమిస్తే టెస్టులు ఆడగలనని నమ్ముతున్నా. ఇది చాలా సులువైన నిర్ణయం. బయటివారికి ఇది ఎందుకు అంత కష్టంగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు’ అని రోహిత్‌ చెప్పాడు.  

ఒక్కసారిగా ఫలితాలు రావు...
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదోసారి విజేతగా నిలవడంపై ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందని, పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కవని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టామని అతను పేర్కొన్నాడు. ‘మరో జట్టుతో రోహిత్‌ ఇలాంటి ఫలితాలు సాధించేవాడా అని కొందరు అడుగుతున్నారు. అసలు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి. ఎందుకు సాధించి చూపించాలి. మా ఫ్రాంచైజీ ఆలోచనల ప్రకారమే నేను ఆటగాడిగా, కెప్టెన్‌గా కావాల్సిన పనితీరును ప్రదర్శించా. ఒక్క రాత్రికి ఫలితాలు రాలేదు. 

పొలార్డ్, బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలాంటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారనే మాటను అంగీకరిస్తా. అయితే 2011లో నాతో సహా అందరూ వేలంలో అందుబాటులో ఉన్నారు కదా. కానీ ముంబై మమ్మల్ని ఎంచుకుంది. మాపై నమ్మకముంచి జట్టును తీర్చి దిద్దుకుంది. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్‌ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్‌రైజర్స్‌కు కూడా ఆడాడు కదా. ఆరంభంలోనే బంతిని స్వింగ్‌ చేసి వికెట్లు తీయగల బౌలర్‌ మాకు అవసరం ఉందని భావించాం. అందుకే ఢిల్లీతో గట్టిగా పట్టుబట్టి బౌల్ట్‌ను తీసుకున్నాం. ఆపై అతను సత్తా చాటాడు. నా మనసుకు సరైంది అనిపించేది చేయడమే నా విజయ రహస్యం’ అని రోహిత్‌ విశ్లేషించాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement