బెంగళూరు: భారత అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లేందుకు మార్గం సుగమమైంది. శుక్రవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో నిర్వహించిన పరీక్షలో రోహిత్ సఫలమయ్యాడు. అతను తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మాజీ కెప్టెన్, ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి పర్యవేక్షణలో ఈ పరీక్ష జరిగిందని... రోహిత్ ఫిట్‌నెస్, బ్యాటింగ్ సమయంలో అతని కదలికలతో సంతృప్తి చెందిన ద్రవిడ్ తన నివేదికను బోర్డుకు పంపించినట్లు సమాచారం.
బీసీసీఐ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆది లేదా సోమవారాల్లో రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరతాడు. చార్టర్డ్ ఫ్లయిట్‌లో దుబాయ్ వెళ్లి అక్కడినుంచి సిడ్నీకి పయనమవుతాడు. ఆసీస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోహిత్ ముందుగా భారత జట్టుతో సంబంధం లేకుండా 14 రోజుల కఠినమైన క్వారంటైన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను జట్టుతో కలుస్తాడు. జనవరి 7నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో కండరాల గాయానికి గురైన అనంతరంనుంచి అతని ఫిట్‌నెస్, జట్టులోకి ఎంపిక చేయకపోవడం, కెప్టెన్‌కు సమాచారం ఇవ్వకపోవడంవంటి తదితర అంశాలు వివాదానికి కారణమయ్యాయి. తాజా పరిణామంతో వాటికి ముగింపు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment