న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శుక్రవారం ఫిట్‌నెస్ పరీక్ష పాస్ అయిన టాప్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ మరింత స్పష్టతనిచ్చింది. అతను ఆస్ట్రేలియాకు వెళుతున్నాడని... అయితే టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగే విషయంపై మాత్రం ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. ఆస్ట్రేలియాలో భారత జట్టుతో పాటు ఉన్న బోర్డు వైద్య బృందం రోహిత్ ఫిట్‌నెస్‌ను పునఃసమీక్షించిన తర్వాతే ఆడే విషయం తెలుస్తుందని స్పష్టం చేసింది.
‘ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ‘క్లినికల్లీ ఫిట్’గా ఉన్నాడు. అతని బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని పరీక్షించిన ఎన్‌సీఏ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అతను సుదీర్ఘ సమయం పాటు ఆడే అంశంలో మెరుగుపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో క్వారంటైన్ ముగిసిన తర్వాత బీసీసీఐ వైద్య బృందం రోహిత్ ఫిట్‌నెస్‌ను మళ్లీ పరీక్షిస్తుంది. దీనిని బట్టే మ్యాచ్ ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటారు’ అని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment