sepak takraw
-
సెపక్తక్రా జట్లకు కెప్టెన్లుగా దినేశ్, తరంగిణి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను బుధవారం ప్రకటించారు. మహిళల జట్టుకు ఎ. తరంగిణి, పురుషుల జట్టుకు డి. దినేశ్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా ఈనెల 28 నుంచి జనవరి 2 వరకు జాతీయ సెపక్తక్రా చాంపియన్‌షిప్ జరుగుతుంది. జట్ల వివరాలు పురుషులు: డి. దినేశ్ (కెప్టెన్), కె. ప్రవీణ్, జి. శ్రీనాథ్, ఎ. హరినాథ్, డి. శశాంక్, ఎం. వికేశ్ కుమార్ (కోచ్), కె. నిఖిల్ (మేనేజర్). మహిళలు: ఎ. తరంగిణి (కెప్టెన్), ఆర్. నవత, కోమల్, బి. శైలజ, ఠాకూర్ యోగేశ్వరి, మానసి అవస్థి, ఎస్. ఆకాంక్ష, కె. ధనశ్రీ, పి. మాళవిక, నందిని, డి. దివ్య, సాయి ప్రణతి, ఆర్తి, శస్ర, పూజిత, అహ్మద్ (కోచ్), కపిల్ ఆనంద్ (కోచ్), షబ్రీశ్ వర్మ (మేనేజర్). -
సెపక్తక్రా ప్రపంచ కప్‌నకు భారత్ ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జకార్తా, పాలెంబాంగ్ వేదికల్లో జరిగిన ఆసియా క్రీడల్లో తన ఉనికిని చాటుకున్న భారత సెపక్తక్రా సమాఖ్య... సెపక్తక్రా ప్రపంచ కప్ నిర్వహించేందుకు సిద్ధమైంది. గోవా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగనున్న అంతర్జాతీయ సెపక్తక్రా సమాఖ్య (ఐఎస్‌టీఏఎఫ్) ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో ప్రపంచకప్ నిర్వహణ హక్కుల పత్రాన్ని ఐఎస్‌టీఏఎఫ్ కార్యదర్శి డాటో అబ్దుల్ హలీమ్ బిన్ ఖాదిర్, భారత సెపక్తక్రా సమాఖ్య అధ్యక్షులు ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్‌కు అందజేశారు. 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడలతో భారత్‌లో సెపక్తక్రా ఆట పరిచయమైంది. తాజాగా పాలెంబాంగ్ ఆసియా క్రీడల్లో భారత సెపక్తక్రా జట్టు కాంస్యాన్ని అందుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్‌లో సెపక్తక్రా క్రీడ మరింత ప్రాచుర్యం పొందాలంటే ప్రత్యేక అకాడమీలు నెలకొల్పాలని.... రెగ్యులర్‌గా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఐఎస్‌టీఏఎఫ్ అబ్దుల్ హలీమ్ సూచించారు. మరోవైపు శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం కూడా ఆసక్తిగా ఉందని... దీనికి సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎస్కే జోషికి పంపించామని తెలిపారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తదుపరి యూత్ గేమ్స్‌ను ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించే ఆలోచనలో ఉన్నామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ చీఫ్ సెక్రటరీకి పంపించిన లేఖలో పేర్కొన్నారు. -
ఏషియాడ్ కాంస్య విజేత.. టీ అమ్ముతూ..
న్యూఢిల్లీ : హరీష్ కుమార్.. ఏషియన్ గేమ్స్-2018లో కాంస్యం సాధించిన భారత సెపక్ తక్రా జట్టులో సభ్యుడు. ప్రస్తుతం అతను టీ అమ్ముతున్నాడు. మెడల్ సాధించి టీ అమ్మడం ఏంటని మీడియా ప్రశ్నించగా.. తమది చాలా పేద కుటుంబమని, అందరూ పనిచేస్తేనే ఇళ్లు గడుస్తుందని తన దయనీయ స్థితిని వివరించాడు. ‘మాకున్న చిన్న టీ కొట్టులో మా కుటుంబానికి సాయంగా టీ అమ్ముతాను. ప్రతిరోజు రోజు నాలుగు గంటలు 2 నుంచి 6 మధ్య ప్రాక్టీస్ చేస్తాను. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి నా కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాను’ అని తన మనసులోని మాటను చెప్పాడు. ప్రత్యేకంగా ఉండే సెపక్ తక్రా ఆట ఆడటం అంత సులవుకాదు. ఈ ఆటను ఆడటానికి తను ఎన్నో కష్టాలని పడ్డానని తెలిపాడు. ‘2011లో ఈ ఆటను ఆడటం ప్రారంభించాను. నా కోచ్ హెమ్రాజ్ నన్ను ఈ ఆటకు పరిచయం చేశారు. ఒకరోజు నేను నా స్నేహితులతో టైర్ ఆట ఆడుతుండగా మా కోచ్ చూసి నన్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఉపకార వేతనాలు అందుకుంటూ ఆటను నేర్చుకున్నాను. దేశానికి మెడల్ సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ చేసేవాడిని.’ అని తెలిపాడు. హరీష్ తల్లి ఇందిరాదేవి మాట్లాడుతూ.. ‘ ఎన్నో కష్టాలు పడుతూ నా పిల్లలను పెంచాను. వీళ్ల నాన్న ఆటో డ్రైవర్. మాకు ఓ చిన్న టీకొట్టు ఉంది. నా కొడుకు సైతం టీ అమ్ముతూ మాకు ఆసరాగా ఉంటాడు. నా కొడుకుకు అన్ని సౌకర్యాలు కల్పించి మెడల్ సాధించేలా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే కోచ్ హెమ్రాజ్ సర్‌కు ఎంతో రుణపడి ఉంటాం.’ అని తెలిపారు. హరీష్ సోదరుడు ధావన్ మాట్లాడుతూ.. కాంస్యపతకం సాధించిన తన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ‘కొన్ని సార్లు మా ఇంటి అద్దెను కూడా చెల్లిచలేని ధీన స్థితిమాది. నా సోదరుడిని మొత్తం హేమ్రాజ్ సరే చూసుకున్నాడు. సాయ్ సాయం మరవలేని. అతని ఆటకు కావాల్సిన సామ్రాగ్రి ని అందజేయడంతో పాటు ఉపకార వేతనం అందించింది. రూ. 50 లక్షల రివార్డు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు. అలాగే నా సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి మా కుటుంబానికి అండగా నిలివాలి’ అని కోరాడు. -
సెపక్‌తక్రాలో కాంస్యంతో సరి
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా సెపక్తక్రా పురుషుల ఈవెంట్లో భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. మంగళవారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత్ జట్టు ఓటమి పాలైంది. ఈ పోరులో ఏమాత్రం పోటీ ఇవ్వలేని భారత్ 0-2 తేడాతో పరాజయం చెందింది. ఫలితంగా కాంస్యాన్ని మాత్రమే దక్కించుకోగల్గింది. ఇది ఓవరాల్ ఏషియన్ గేమ్స్ లో భారత్‌కు తొలి సెపక్తక్రా పతకం కావడం విశేషం. దాంతో ఇప్పటివరకూ భారత్ సాధించిన పతకాల సంఖ్య 9కి చేరింది. భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: ‘రజత’ రాజ్‌పుత్ పరిమళించిన యువ ‘సౌరభం’ -
రంగారెడ్డి జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి 16–21, 21–19, 22–20తో నల్లగొండపై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలికల విభాగంలో హైదరాబాద్ 17–21, 19–21తో నిజామాబాద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర విభాగంలో ఖమ్మం, బాలికల విభాగంలో రంగారెడ్డి జట్లు మూడోస్థానంలో నిలిచాయి. రంగారెడ్డి జట్టు సభ్యుడు మెహమ్మద్ ముబషిర్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా సెపక్తక్రా సంఘం అధ్యక్షుడు రవి చక్రవర్తి, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కె. రంగారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెపక్తక్రా సంఘం కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ మహిళల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు సత్తా చాటింది. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల రెగూ, డబుల్స్ ఈవెంట్లలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన టైటిల్‌పోరులో ఉస్మానియా యూనివర్సిటీ 21–17, 21–13తో పంజాబ్ యూనివర్సిటీపై విజయం సాధించింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో మణిపూర్ యూనివర్సిటీ 21–14, 21–4తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ యూనివర్సిటీపై గెలిచింది. మరోవైపు మహిళల డబుల్స్ ఫైనల్లో ఉస్మానియా జట్టు 17–21, 21–14, 21–18తో మణిపూర్ యూనివర్సిటీపై గెలుపొందింది. పాటియాలా పంజాబీ యూనివర్సిటీ 21–17, 21–17తో కుమాయున్ యూనివర్సిటీపై నెగ్గి కాంస్యాన్ని గెలుచుకుంది. పురుషుల విభాగంలో ఉస్మానియా జట్టు త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. కాంస్య పతక పోరులో ఓయూ 22–20, 17–21, 3–21తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఈ విభాగంలో అన్నా యూనివర్సిటీ విజేతగా నిలవగా, పాటియాలా పంజాబీ యూనివర్సిటీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల రెగూ ఈవెంట్ తుదిపోరులో పంజాబీ యూనివర్సిటీ 21–12, 21–13తో అన్నా యూనివర్సిటీపై గెలుపొందింది. కాలికట్ యూనివర్సిటీ 21–13, 21–6తో ఎంజేపీ రోహిల్‌ఖండ్ యూనివర్సిటీపై గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
నేటి నుంచి సెపక్తక్రా చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ సెపక్తక్రా చాంపియన్‌షిప్ నేటి నుంచి జరుగనుంది. ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా మహిళలు, పురుషుల విభాగాల్లో సోమవారం వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు చెందిన 38 పురుషుల జట్లు, 32 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ మేరకు శుక్రవారం టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ ఈ పోటీలను ప్రారంభిస్తారని వారు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, ఓయూ వైస్ చాన్స్‌లర్ తదితరులు పాల్గొంటారు. -
భారత పురుషుల జట్టుకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సెపక్తక్రా ప్రపంచకప్ టోర్నీలో భారత పురుషుల జట్టు రాణించింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టైటిల్ పోరులో థాయ్‌లాండ్ 21–19, 23–21తో మలేసియాపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో ఓడిన భారత్ కాంస్యాన్ని దక్కించుకుంది. సెమీస్‌లో రన్నరప్ మలేసియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. మరో సెమీస్‌లో ఓడిన సింగపూర్ జట్టుకు కూడా కాంస్యం లభించింది. మహిళల టీమ్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ థాయ్‌లాండ్ 21–11, 23–19తో వియత్నాంపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత మహిళల జట్టు క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌బాబు, ఓఎస్డీ రాజేశ్వర్, అంతర్జాతీయ సెపక్తక్రా సమాఖ్య ప్రతినిధులు, భారత సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి యోగిందర్ సింగ్ దహియా తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో భారత్ బోల్తా
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో తొలిసారి జరుగుతోన్న సెపక్తక్రా ప్రపంచకప్‌లో మన ఆటగాళ్ల పోరాటం ముగిసింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. శనివారం జరిగిన పురుషుల టీమ్ చాంపియన్‌షిప్ సెమీస్ పోటీల్లో భారత్ 16–21, 8–21తో మలేసియా చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత మహిళల జట్టు క్వార్టర్స్‌లో నిష్క్రమించింది. మరో సెమీస్‌లో థాయ్‌లాండ్ 21–5, 21–8తో సింగపూర్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. -
భారత జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: సెపక్తక్రా ప్రపంచకప్ టోర్నమెంట్లో తొలిరోజు భారత జట్లు సత్తా చాటాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. గురువారం జరిగిన పురుషుల మ్యాచ్‌లో భారత్ 21–6, 21–10తో ఫ్రాన్స్ జట్టును చిత్తుగా ఓడించింది. మహిళల విభాగంలో భారత్ 21–8, 21–8తో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్‌లో తొలిసారి జరుగుతోన్న ఈ ప్రపంచకప్‌కు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి ఈ మెగా టోర్నీని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కె. సాయిబాబా, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, అంతర్జాతీయ సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి అబ్దుల్ హలీం ఖాదర్, డిప్యూటీ ప్రెసిడెంట్ బూన్‌చెయ్ లోరిపట్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ తౌఫీఖ్, భారత సెపక్తక్రా సమాఖ్య కార్యదర్శి యోగిందర్ సింగ్ దహియా తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో మొత్తం 16 పురుషుల జట్లు, 12 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. -
రంగారెడ్డి బాలికల డబుల్ ధమాకా
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి సెపక్తక్రా టోర్నమెంట్లో రంగారెడ్డి బాలికల జట్లు అండర్–14, 17 విభాగాల్లో విజేతగా నిలిచాయి.సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన అండర్–14 బాలికల ఫైనల్లో రంగారెడ్డి 2–1 స్కోరుతో నిజామాబాద్‌పై గెలిచింది. సెమీస్‌లో రంగారెడ్డి 2–0తో ఆదిలాబాద్‌పై, నిజామాబాద్ 2–0తో హైదరాబాద్‌పై గెలుపొందాయి. అండర్–17 ఫైనల్లోనూ రంగారెడ్డి 2–0తో నిజామాబాద్‌పైనే నెగ్గింది. సెమీస్‌లో రంగారెడ్డి 2–0తో వరంగల్‌పై, నిజామాబాద్ 2–0తో నల్లగొండపై నెగ్గాయి. అండర్–14 బాలుర తుదిపోరులో మహబూబ్‌నగర్ 2–0తో నల్లగొండపై, అండర్–17 బాలుర టైటిల్ పోరులో వరంగల్ 2–0తో నిజామాబాద్‌పై విజయం సాధించాయి. స్క్వాష్ మార్షల్ ఆర్ట్స్‌లో వేణు, విష్ణు గెలుపొందారు. 48 కేజీల విభాగంలో వేణు 9–6తో కమలేశ్‌పై, బిపిన్ పాండే 12–8తో వేణుపై గెలువగా... 56 కేజీల కేటగిరీలో విష్ణు 6–2తో నందుపై, ఖుర్షీద్ 12–6తో విష్ణుపై నెగ్గారు. 52 కేజీల విభాగంలో శివమణి 10–7తో యశ్వంత్‌పై, 60 కేజీల కేటగిరీలో వేణు 12–8తో అజయ్‌పై నెగ్గారు. -
విజేతలు హైదరాబాద్, రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ మహిళల, పురుషుల సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు విజేతలుగా నిలిచాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 21–15తో ఆదిలాబాద్‌పై గెలుపొందింది. ఈ విభాగంలో నిజామాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. మహిళల టైటిల్ పోరులో రంగారెడ్డి 21–16తో హైదరాబాద్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆదిలాబాద్‌కు మూడో స్థానం దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, కోశాధికారి మహేశ్, సెపక్తక్రా క్రీడాకారుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్‌లో సెపక్తక్రా వరల్డ్ కప్
సాక్షి, హైదరాబాద్: ఐఎస్‌టీఏఎఫ్ ‘ప్రపంచ కప్’ ఇంటర్ రెగూ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్‌లో జరుగనున్న ఈ అంతర్జాతీయ టోర్నీకి భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈమేరకు శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎల్బీ స్టేడియంలో ఆదివారం టోర్నీ కార్యాచరణకు సంబంధించిన సమావేశం జరిగింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నవంబర్ 2 నుంచి 5 వరకు సెపక్తక్రా ప్రపంచ కప్ పోటీలు జరుగుతాయని శాట్స్ చైర్మన్ తెలిపారు. మొత్తం 20 దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్‌తో పాటు జపాన్, థాయ్‌లాండ్, మలేసియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, దక్షిణ కొరియా, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, వియత్నాం, కాంబోడియా, చైనీస్ తైపీ, ఇరాన్ జట్లు ఈ టోర్నీలో తలపడతాయి. టోర్నీ జరిగినన్నీ రోజులు మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయని, పోటీలను తెలంగాణ సాంస్కృతిక కమిటీ సంచాలకులు ఎం. హరికృష్ణ ప్రారంభిస్తారని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు హైటెక్ సిటీలో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్ల ముందంజ
రాష్ట్ర స్థాయి సెపక్తక్రా టోర్నీ సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు ముందంజ వేశాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో శనివారం ప్రారంభమైన ఈ టోర్నీ రెగూ ఈవెంట్లో హైదరాబాద్ పురుషుల జట్టు 21-12, 21-5తో నిజామాబాద్‌పై, 21-19, 21-9తో కరీంనగర్‌పై విజయం సాధించాయి. మహిళల విభాగంలో తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 21-6, 21-9తో మహబూబ్‌నగర్‌పై, మరో మ్యాచ్‌లో 21-10, 21-6తో నల్గొండను ఓడించింది. ఈ టోర్నీని రాష్ట్ర ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషులు: మెదక్ 21-13, 21-14తో నల్గొండపై, ఆదిలాబాద్ 21-3, 21-8తో మహబూబ్‌నగర్‌పై, రంగారెడ్డి 21-14, 21-13తో కరీంనగర్‌పై, నల్గొండ 21-14, 21-11తో వరంగల్‌పై, ఖమ్మం 21-19, 21-14తో నిజామాబాద్‌పై, మెదక్ 21-11, 21-4తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ 21-9, 21-7తో వరంగల్‌పై, రంగారెడ్డి 19-21, 21-17, 21-19తో ఖమ్మంపై గెలుపొందాయి. మహిళలు: మెదక్ 21-5, 21-9తో నిజామాబాద్‌పై, ఆదిలాబాద్ 21-5, 21-7తో వరంగల్‌పై, రంగారెడ్డి 21-6, 21-7తో కరీంనగర్‌పై, నల్గొండ 21-9, 21-7తో వరంగల్‌పై, నిజామాబాద్ 21-8, 21-6తో కరీంనగర్‌పై, రంగారెడ్డి 21-12, 21-5తో ఖమ్మంపై, ఖమ్మం 21-8, 21-9తో నిజామాబాద్‌పై, నల్గొండ 21-13, 21-8తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి. -
ఢిల్లీ, మణిపూర్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జాతీయ సెపక్తక్రా అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఢిల్లీ, మణిపూర్ జట్లు విజేతలుగా నిలిచారుు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో సోమవారం జరిగిన బాలుర ఫైనల్లో ఢిల్లీ జట్టు 13-21, 21-20, 21-15తో మణిపూర్ జట్టుపై గెలుపొందింది. బాలికల విభాగంలో మణిపూర్ జట్టు 19-21, 21-11, 21-12తో ఒడిశాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జమ్ము, కశ్మీర్ డీజీ జహంగీర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తెలంగాణ జట్లకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఎస్జీఎఫ్ఐ జాతీయ అండర్-19 సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్సలో ఆదివారం బాలుర విభాగంలో జరిగిన కాంస్యపతక పోరులో తెలంగాణ 21-13, 21-10తో గుజరాత్‌పై గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో తెలంగాణ 12-21, 9-21తో ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. మరో సెమీస్‌లో మణిపూర్ 25-5, 21-6తో గుజరాత్‌ను ఓడించింది. బాలికల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో తెలంగాణ 21-12, 21-11తో మహారాష్ట్రపై విజయం సాధించింది. సెమీస్‌లో తెలంగాణ 14-21, 15-21తో ఒడిశా చేతిలో, మహారాష్ట్ర 6-21, 13-21తో మణిపూర్ చేతిలో కంగుతిన్నాయి. బాలుర ఫైనల్లో ఢిల్లీతో మణిపూర్, బాలికల ఫైనల్లో మణిపూర్‌తో ఒడిశా తలపడతాయి. -
నవత.. మరో ఘనత
ఆరోసారి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వచ్చే నెల బ్యాంకాక్‌లో మెగాటోర్నీ మహబూబ్‌నగర్ క్రీడలు: సెపక్తక్రా క్రీడలో జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి నవత దూసుకుపోతోంది. నిరుపేద కుటుంబ, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా మొక్కవోని దీక్ష, పట్టుదలతో సెపక్‌తక్రాలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. ప్రధాన స్రై్టకర్గా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతోంది. వచ్చే నెల 15 నుంచి 20 వరకు బ్యాంకాక్ (థాయ్‌లాండ్)లో జరగనున్న సెపక్తక్రా వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత మహిళల జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో మహారాష్ట్ర (ఔరంగాబాద్)లో జరిగిన ప్రత్యేక క్యాంపులో ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన నవతను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 28న జాతీయ జట్టుతో కలిసి ఆమె బ్యాంకాక్‌కు బయలుదేరనుంది. సెపక్‌తక్రాలో ప్రదర్శనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నవతకు రూ.3లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది. అంతర్జాతీయ పోటీల్లో నవత ప్రతిభ... సెపక్‌తక్రాలో నవత గతంలో ఐదుసార్లు అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2013 సెప్టెంబర్‌లో యుథంటిని (థాయ్‌లాండ్)లో జరిగిన ప్రపంచ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలిసారిగా ప్రాతినిధ్యం వహించింది. ఆ టోర్నీలో భారత మహిళల జట్టు మూడోస్థానంలో నిలిచింది. 2014 మార్చిలో కౌలాలంపూర్(మలేసియా)లో జరిగిన ఐఎస్‌టీఏఎఫ్ సూపర్‌సిరీస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అదే ఏడాది ఆగస్టులో బ్యాంకాక్(బ్యాంకాక్)లో జరిగిన ప్రపంచ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో పాల్గొని రజత పతకం సాధించింది. సెప్టెంబర్‌లో కొరియాలో జరిగిన ఏషియన్స్ గేమ్స్‌లో, 2015లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దేశం తరుఫున పాల్గొంది. -
సెపక్తక్రా పోటీల్లో హైదరాబాద్ జట్ల ముందంజ
అంతర్ జిల్లా సెపక్తక్రా చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సెపక్తక్రా పోటీల్లో హైదరాబాద్ జట్లు ముందంజ వేశాయి. చందానగర్‌లోని పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర రెగూ ఈవెంట్లో హైదరాబాద్ 2-0 (21-13, 21-8)తో నిజామాబాద్‌పై గెలుపొందగా... బాలికల విభాగంలో హైదరాబాద్ 2-0 (21-9, 21-9)తో కరీంనగర్ జట్టును ఓడించింది. ఇతర బాలుర మ్యాచ్‌ల్లో మహబూబ్‌నగర్ 2-0 (21-18, 21-18)తో వరంగల్‌పై, నల్లగొండ 2-0 (21-18, 22-21) తో ఆదిలాబాద్‌పై, ఖమ్మం 2-0 (21-18, 21-15)తో ఆదిలాబాద్‌పై, మహబూబ్‌నగర్ 2-1 (21-16, 17-21, 21-13)తో నల్లగొండపై, ఖమ్మం 2-1 (21-15, 16-21, 21-7)తో వరంగల్‌పై, మెదక్ 2-0 (22-20, 21-18)తో రంగారెడ్డిపై విజయం సాధించాయి. బాలికల ఫలితాలు: నిజామాబాద్ 2-0 (21-11, 21-13)తో ఖమ్మంపై, మెదక్ 2-0 (21-14, 21-9)తో కరీంనగర్‌పై, మెదక్ 2-0 (21-6, 21-6)తో నిజామాబాద్‌పై, హైదరాబాద్ 2-0 (21-10, 21-3)తో ఖమ్మంపై, మెదక్ 2-0 (21-14, 21-9)తో కరీంనగర్‌పై, కరీంనగర్ 2-0 (21-5, 21-11)తో ఖమ్మంపై, హైదరాబాద్ 2-0 (21-13, 31-7)తో నిజామాబాద్‌పై, హైదరాబాద్ 2-0 (21-17, 22-20)తో మెదక్‌పై, నల్లగొండ 2-0 (21-14, 21-10)తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ 2-0 (21-7, 21-15)తో వరంగల్, రంగారెడ్డి 2-0 (21-5, 21-1)తో వరంగల్‌పై, నల్లగొండ 2-0 (21-10, 21-16)తో ఆదిలాబాద్‌పై, ఆదిలాబాద్ 2-0 (21-12, 21-5)తో మహబూబ్‌నగర్‌పై, రంగారెడ్డి 2-0 (21-13, 21-7)తో నల్లగొండపై, రంగారెడ్డి 2-0 (21-13, 21-9)తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 2-0 (21-15, 21-7)తో మహబూబ్‌నగర్‌పై గెలుపొందాయి. -
‘సెపక్తక్రా’ జిల్లా జట్టు ఎంపిక
లింగాల: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల,కళాశాల క్రీడామైదానంలో శుక్రవారం‘సెపక్తక్రా’జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ ఎంపికకు గాను జిల్లా నలుమూల నుంచి సెపక్తక్రా క్రీడపై ఆసక్తి ఉన్న పలువురు క్రీడాకారులు తరలివచ్చారు. పీడీ భాస్కర్, లెక్చరర్ జి.శ్రీనివాసులు పర్యవేక్షణలో జరిగిన పోటీలలో 12 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో ప్రతిభ కనబర్చిన 7 మంది క్రీడాకారులతో జల్లా జట్టును ఎంపిక చేశారు. అఖిలేష్(అమ్రాబాద్),ఉదయ్(పెబ్బేర్), జగన్(కొత్తకోట),సురేష్(కోడేర్), మహేష్(కోడేర్),సీ. ఆంజనేయులు(అచ్చంపేట), బాబుప్రసాద్(చక్రాపూర్) జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 27,28 తేదీలలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు ఆడనున్నట్లు పీడీ భాస్కర్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగభూషణం, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్,అధ్యాపకులు శ్రీనివాసులు, పాండు తదితరులు పాల్గొన్నారు. -
కడప వెళ్తున్న సపక్ తక్ర జట్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్ (అండర్–19) సపక్‌తక్ర జట్లు రాష్ట్రపోటీల కోసం బుధవారం ఇక్కడ నుంచి కడప బయల్దేరి వెళ్తున్నట్లు జిల్లా సపక్‌తక్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంగా ఈనెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల సపక్‌తక్ర చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్లను సోమవారం ఎంపికచేసిన విషయం తెలిసిందే. ఎంపికైన క్రీడాకారులంతా ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తమ లగేజితోపాటు వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్, పాస్‌ఫోటోలతో చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సపక్‌తక్ర సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి (9949291288)ని సంప్రదించాలని సూచించారు. -
జిల్లా సపక్‌తక్ర క్రీడా జట్లు ఖరారు
18, 19 తేదీల్లో కడపలో రాష్ట్రస్థాయి పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్ (అండర్–19) బాలబాలికల సపక్‌తక్ర జట్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సపక్‌తక్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కోడిరామ్మూర్తి స్టేడియంలో సపక్‌తక్ర ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలను ఆ సంఘ అధ్యక్షుడు ఎమ్మెస్సాఆర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కిందట జిల్లాలో సపక్‌తక్ర క్రీడను పరిచయం చేశామన్నారు. అనతి కాలంలోనే క్రీడాకారులు ఉన్నతంగా రాణిస్తుండటం శుభపరిణామంగా పేర్కొన్నారు. 18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు.. వైఎస్సార్ కడప జిల్లాలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి జూనియర్ సపక్‌తక్ర చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయని సంఘ ప్రధాన కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి వెల్లడించారు. ఇక్కడ ఎంపికచేసిన జట్లు రాష్ట్ర పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, ఎండీ కాసీంఖాన్, సపక్‌తక్ర సంఘ ఉపాధ్యక్షుడు పి.నర్సింగరావు, రామారావు, ప్రతినిధులు రమేష్‌నాయుడు, సత్యనారాయణ, ఈశ్వరరావు పాల్గొన్నారు. తుది జట్లు ఖరారు ఎంపికల అనంతరం క్రీడాకారుల ప్రతిభ, శిక్షణ శిబిరాల్లో ప్రాతినిధ్యం, నైపుణ్యం ఆధారంగా తుది జట్లను ఖరారు చేశారు. చెరో ఐదేసి మంది సభ్యులతో కూడిన జట్లు జాబితాను సంఘ ప్రతినిధులు ప్రకటించారు. బాలురు జట్టు: ఎస్.తారకేశ్వరరావు (కెప్టెన్), డి.సంతోష్, ఎస్.కృష్ణప్రసాద్, డి.చంద్రశేఖర్, డి.తేజ. జట్టుకు కోచ్, మేనేజర్లుగా జి.షున్ముఖ, బి.ఈశ్వరరావులు వ్యవహరిస్తారు. బాలికల జట్టు: ఎస్.పద్మజ (కెప్టెన్), జి.దుర్గాప్రశాంతి, ఎస్.హేమలత, బి.ఝాన్సీ, బి.అనూష. ఈ జట్టుకు ఎ.హరిత, జి.అర్జున్ప్రసాద్లు కోచ్, మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. -
ఆంధ్ర, తెలంగాణ జట్ల విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో రెగూ ఈవెంట్ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ 21-11, 21-18తో బీహార్‌పై, 21-7, 21-16తో అస్సాంపై గెలుపొందగా... తెలంగాణ జట్టు 21-10, 21-9తో చండీగఢ్‌ను, 21-12, 19-21, 21-14తో పశ్చిమ బెంగాల్‌ను ఓడించింది. బాలికల విభాగంలో మాత్రం తెలంగాణ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ 16-21, 22-20, 13-21తో బీహార్ చేతిలో, అనంతరం 13-21, 19-21తో ఢిల్లీ చేతిలో ఓడిపోయాయి. ఇతర మ్యాచ్‌ల్లో ఒడిశా 21-6, 21-11తో ఉత్తరప్రదేశ్‌పై, కర్ణాటక 21-14, 21-19తో పంజాబ్‌పై, తమిళనాడు 21-1, 21-5తో హరియాణాపై విజయం సాధించాయి. -
రేపటి నుంచి సెపక్తక్రా చాంపియన్‌షిప్
హైదరాబాద్: తెలంగాణ సెపక్తక్రా సంఘం ఆధ్వర్యంలో జరిగే ‘సబ్ జూనియర్ జాతీయ సెపక్తక్రా చాంపియన్‌షిప్’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విక్టరీ ప్లేగ్రౌండ్ ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ఈ టోర్నీని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు ప్రారంభిస్తారు. జూలై 31 వరకు జరిగే చాంపియన్‌షిప్‌లో దాదాపు 650 మంది బాలబాలికలు పాల్గొననున్నారు. టీమ్ విభాగంతో పాటు, రెగు ఈవెంట్, డబుల్స్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నారు.