ప్రాక్టీస్ చేస్తున్న నవత
-
ఆరోసారి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
-
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం
-
వచ్చే నెల బ్యాంకాక్‌లో మెగాటోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: సెపక్‌తక్రా క్రీడలో జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి నవత దూసుకుపోతోంది. నిరుపేద కుటుంబ, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా మొక్కవోని దీక్ష, పట్టుదలతో సెపక్‌తక్రాలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. ప్రధాన స్రై్టకర్‌గా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతోంది. వచ్చే నెల 15 నుంచి 20 వరకు బ్యాంకాక్ (థాయ్‌లాండ్)లో జరగనున్న సెపక్‌తక్రా వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత మహిళల జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో మహారాష్ట్ర (ఔరంగాబాద్)లో జరిగిన ప్రత్యేక క్యాంపులో ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన నవతను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 28న జాతీయ జట్టుతో కలిసి ఆమె బ్యాంకాక్‌కు బయలుదేరనుంది. సెపక్‌తక్రాలో ప్రదర్శనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నవతకు రూ.3లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది.
అంతర్జాతీయ పోటీల్లో నవత ప్రతిభ...
సెపక్‌తక్రాలో నవత గతంలో ఐదుసార్లు అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2013 సెప్టెంబర్‌లో యుథంటిని (థాయ్‌లాండ్)లో జరిగిన ప్రపంచ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో దేశానికి తొలిసారిగా ప్రాతినిధ్యం వహించింది. ఆ టోర్నీలో భారత మహిళల జట్టు మూడోస్థానంలో నిలిచింది. 2014 మార్చిలో కౌలాలంపూర్(మలేసియా)లో జరిగిన ఐఎస్‌టీఏఎఫ్ సూపర్‌సిరీస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అదే ఏడాది ఆగస్టులో బ్యాంకాక్(బ్యాంకాక్)లో జరిగిన ప్రపంచ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో పాల్గొని రజత పతకం సాధించింది. సెప్టెంబర్‌లో కొరియాలో జరిగిన ఏషియన్స్ గేమ్స్‌లో, 2015లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దేశం తరుఫున పాల్గొంది.